తెలంగాణ రాజకీయ పార్టీలన్నింటికీ హుజూరాబాద్ ఫీవర్ పట్టుకుంది. టీఆర్ఎస్, బీజేపీ, కాంగ్రెస్ ఏ పార్టీకైనా ప్రతీ క్షణం హుజురాబాద్ గురించి ఆలోచనే. అబ్బే  మాకేం లెక్క లేదని టీఆర్ఎస్ మాటల్లో చెప్పినా చేతల్లో ఎంత కంగారు పడుతున్నారో కళ్ల ముందు కనిపిస్తూనే ఉంది. బీజేపీ అంతే.. టీఆర్ఎస్ అంతే. ఎంత త్వరగా ఎన్నికలు ముగిసిపోతే అంత త్వరగా భారం దించేసుకుందామని చాలా మంది అనుకుంటున్నారు కానీ..ఆ టెన్షన్ అలా పోస్ట్ పోన్ అవుతూనే ఉంది. ఇప్పుడు షె‌డ్యూల్ ఎప్పుడు వస్తుందో తెలియదు.  ఎప్పుడు ఎన్నిక జరుగుతుందో తెలియదు. దీంతో  పరిస్థితులు ఎప్పుడు ఎలా మారిపోతాయోననే టెన్షన్ అన్ని పార్టీలను పట్టి పీడిస్తోంది. 


టీఆర్ఎస్‌కు "దళిత బంధు" టెన్షన్..!


ఎన్నికల షెడ్యూల్ ఎంత ఆలస్యమైతే అంత ఎక్కువగా టెన్షన్ పడేది టీఆర్ఎస్సే. నిజానికి ఆలస్యం అయ్యే కొద్దీ ఈటల రాజేందర్ బలహీనపడతారనే అంచనాలు ఉన్నాయి. దీనికి టీఆర్ఎస్ సంతోషపడాలి. కానీ ఇక్కడ అసలు టెన్షన్ దళిత బంధు గురించే. పథకాన్ని కేసీఆర్ ప్రారంభించేశారు. అమలులో ఎక్కడా వెనక్కి తగ్గ కూడదు. చకచకా జరిగిపోవాలి. లేకపోతే ఓట్ల కోసం పెట్టారని ఓట్లేసిన తర్వాత కంటికి కనిపించరన్న ఓ అభిప్రాయం మాత్రం  బలపడుతుంది. నిజానికి కేసీఆర్ వ్యూహం ప్రకారం పథకం ప్రకటించిన తర్వాత ఎన్నికల షెడ్యూల్ రావాలి. అలా ప్లాన్ చేసుకున్నారు. ఓ సందర్భంలో రెండు రోజుల్లో ఎన్నికల షెడ్యూల్ వస్తుందని తెలియగానే వెంటనే వాసాలమర్రిలో ప్రోగ్రాం పెట్టి పథకం ప్రారంభించారు.


ఒక వేళ షెడ్యూల్ వస్తే ప్రారంభించడం సాధ్యం కాదు కాబట్టి. హుజురాబాద్‌లో పథకం ప్రారంభించిన తర్వాత షెడ్యూల్ వచ్చినా పెద్ద టెన్షన్ ఉండేది కాదు. దళిత కుటుంబాలందరి దగ్గర అప్లికేషన్ తీసుకుంటే ఓట్ల వర్షం కురిసేది. కానీ ఇప్పుడు  అందరికీ రూ. పది లక్షలు పంపిణీ చేయాల్సిందే. లేకపోతే ప్రజలు నమ్మే పరిస్థితి ఉండదు. ఎంత ఆలస్యమైతే టీఆర్ఎస్‌కు అంత గండం. ఇప్పటికి రూ. పన్నెండు వందల కోట్లను పథకానికి రిలీజ్ చేశారు కానీ సరిపోవు. మరో రూ. వెయ్యి కోట్లయినా మంజూరు చేయాల్సి ఉంది. అదే సమయంలో వీరందరికీ ఇస్తే ఇతర వర్గాల్లో ఖచ్చితంగా అసంతృప్తి పెరిగిపోతుంది. వారికి ఇచ్చారు మేమెందుకు ఓటు వేయాలనుకుంటే మొదటికే మోసం వస్తుంది.


ఎంత లేటయితే అంత ఒంటరి అయిపోతున్నానన్న బాధలో ఈటల..!


వేడి మీద ఎన్నికలు జరిగితే ఈటల రాజేందర్‌కు పెద్ద ఎత్తున సానుభూతి లభిస్తుంది. ఎంత ఆలస్యమైతే ఆయనకు అంత మైనస్. అంతే కాదు. ఈటల రాజేందర్ ప్రధాన అనుచురులందర్నీ టార్గెట్ చేసి మరీ హరీష్ రావు తన వైపు లాక్కుంటున్నారు. ఆయన తన టీంను రంగంలోకి దింపి గ్రామాల వారీగా.. మండలాల వారీగా ఈటల రాజేందర్ సన్నిహితుల్ని మార్క్ చేసుకుని అన్ని రకాల ప్లాన్లు అమలు చేస్తున్నారు. దీంతో వారంతా ఈటలను వదిలి పెట్టి కారు ఎక్కక తప్పడం లేదు. ఇది ఈటల రాజేందర్‌ను కంగారు పెడుతోంది. అదేసమయంలో అక్కడ బీజేపీకి ఎలాంటి క్యాడర్ లేకపోగా..  బీజేపీ అగ్రనేతలు కూడా శీతకన్నేశారు. ఎందుకు పట్టించుకోవడం లేదని అడుగుతారేమోనని అప్పుడప్పుడు.. హుజూరాబాద్‌లో గెలుస్తామని ప్రెస్మీట్లలో చెబుతూంటారు. ఎంత త్వరగా ఎన్నికలు అయిపోతే అంత మంచిదని ఈటల క్యాంప్ తొందర పడుతోంది. బీజేపీ హైకమాండ్ కూడా మొదట వెంటనే ఎన్నికలు వస్తాయని భరోసా ఇచ్చింది. కానీ ఇప్పుడు మాత్రం జరుగుతోంది వేరే.


ఎన్నికల ఆలస్యంతో కాంగ్రెస్‌లో కొత్త కొత్త సమస్యలు..!


ఎన్నికలు జరిగి అయిపోతే.. గెలిస్తామో.. ఓడిపోతామో.. గత ఎన్నికల్లో వచ్చినన్ని ఓట్లు వస్తాయా అన్నది తర్వాతి సంగతి ముందుగా ఎంత త్వరగా ఎన్నికలు అయిపోతే అంత త్వరగా ప్రజలు మర్చిపోతారని.. కానీ ప్రతిపక్షంగా తమ పోరాటం మాత్రం ఇతర పార్టీల కన్నా ఓ అడుగు ముందే ఉంటుందని కాంగ్రెస్ పార్టీ అంచనా వేస్తుంది. హుజురాబాద్ ఉపఎన్నిక ఈటల వర్సెస్ కేసీఆర్ అన్నట్లుగా మారిపోయింది. ఇలాంటి పరిస్థితుల్లో కాంగ్రెస్ పార్టీకూడా ఎక్కువ ఆశలు పెట్టుకోవడం లేదు. అందుకే త్వరగా అయిపోతే బాగుండని అనుకంటోంది. ఎన్నికలు ఆలస్యమయ్యే కొద్దీ అభ్యర్థి సమస్యలు.. గ్రూపు తగాదాలు.. అంతకు మించి పెరిగిపోతూ వస్తూంటాయి.


ఖర్చుల విషయంలో అందరికీ కష్టమే..!


ఇక ఎన్నికలంటే ఆషామాషీ కాదు. అడుగు తీసి అడుగేస్తే ఖర్చు. అది లక్షల్లో ఉంటుంది.  ఎన్ని రోజులు ఆలస్యమైతే అంత ఖర్చు. అందుకే అన్ని రాజకీయపార్టీలు రాజకీయ పరమైన కారణాలతో నే కాకుండా ఆర్థిక కారణాలతో కూడా త్వరగా ఎన్నికలు జరగాలని కోరుకుంటున్నాయి. కానీ అనుకున్నదే జరిగితే దైవం ఎందులకు అన్నట్లుగా...  ఎప్పుడు షెడ్యూల్ వస్తుందో చెప్పడం కష్టంగా మారింది.