రైతు సంక్షేమంపై బీఆర్ఎస్, కాంగ్రెస్ మధ్య రాజకీయ రచ్చ సాగుతోంది. రైతు సంక్షేమంపై రెండు పార్టీలు విమర్శనాస్త్రాలు సంధించుకుంటున్నాయి. తమ ప్రభుత్వమే రైతుల బాగు కోసం పని చేసిందని బీఆర్ఎస్ పార్టీ చెబుతుంటే, గత ప్రభుత్వం రైతులను వంచించిందని కాంగ్రెస్ పార్టీ నేతలు చెబుతున్నారు. దీనిపై అసెంబ్లీలో చర్చకు రావాలని సీఎం రేవంత్ రెడ్డి సవాల్ విసిరితే, ఇవాళ చర్చకు సోమాజీగూడ ప్రెస్ క్లబ్‌కు రావాలని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ప్రతి సవాల్ విసిరారు. ఈ మేరకు ఉదయం 11 గంటలకు సోమాజీగూడ ప్రెస్ క్లబ్‌కు కేటీఆర్ వెళ్లేందుకు సిద్ధమయ్యారు. ఈ క్రమంలో అసెంబ్లీలో చర్చకు రండంటూ సీఎల్పీ కార్యాలయానికి వెళ్లేందుకు కాంగ్రెస్ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు సిద్ధమవుతున్నారు. ఈ పరిస్థితుల్లో సోమాజీగూడ ప్రెస్ క్లబ్ వద్ద పెద్ద ఎత్తున పోలీసులు బందోబస్తు ఏర్పాటు చేశారు.

రైతు సంక్షేమం విషయంలో విప్లవాత్మక పంధా మాది - కేటీఆర్

తమ తొమ్మిదేళ్ల పాలనలో రైతుల సంక్షేమం కోసం అనేక విప్లవాత్మకమైన పథకాలను ప్రవేశపెట్టామని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ చెబుతున్నారు. రైతు బంధు కింద ప్రతీ సీజన్‌లో రూ. 5 వేల పెట్టుబడి సాయం అందించిన చరిత్ర తమదే అన్నారు. రైతు బీమా కింద రూ. 5 లక్షల బీమా, 24 గంటల ఉచిత విద్యుత్ వ్యవసాయానికి అందించడం, కోటి ఎకరాలకు కాళేశ్వరం ద్వారా సాగు నీరు కల్పన, మిషన్ కాకతీయ పథకాలు రైతుల కోసం పెట్టామని కేటీఆర్ కాంగ్రెస్ విమర్శలు తిప్పికొట్టేందుకు చెబుతున్నారు. తద్వారా తెలంగాణలో పంటల ఉత్పత్తి పెరిగిందని, రైతుల ఆత్మహత్యలు తగ్గాయన్నది బీఆర్ఎస్ నేతల వాదన. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చాక రైతు వ్యతిరేక కార్యక్రమాలు చేపట్టిందని ఆరోపిస్తున్నారు. రుణ మాఫీ హామీ నెరవేర్చడంలో ఘోరంగా విఫలమైందని చెబుతున్నారు. కాంగ్రెస్ నాయకులు ఆరోపిస్తున్నట్లుగా రైతు బంధు అందరికీ అందడం లేదని (గులాబీ పార్టీ) చెబుతున్నారు. ప్రకృతి వైపరీత్యాల కారణంగా పంట నష్టపోయిన రైతులకు పరిహారం ఇవ్వడం లేదన్న ఆరోపణలను కాంగ్రెస్ పార్టీ చేస్తోంది.

రైతుల పేరుతో బీఆర్ఎస్ ప్రజా ధనం వృధా చేసిందంటున్న కాంగ్రెస్

రైతుల సంక్షేమం కోసం అంటూ కాళేశ్వరం ప్రాజెక్టును ప్రారంభించిన బీఆర్ఎస్, అనవసర ఖర్చులు, అవినీతితో ప్రజాధనం వృధా చేశారన్నది కాంగ్రెస్ నేతల ప్రధాన ఆరోపణ. బీఆర్ఎస్ ఇచ్చిన రుణమాఫీని గులాబీ నేతలు ఘనంగా చెప్పుకుంటున్నా, చాలా మందికి రుణమాఫీ జరగలేదని కాంగ్రెస్ నాయకులు చెబుతున్నారు. బీఆర్ఎస్ ఇచ్చిన రైతు బంధు బడా భూస్వాములకే లబ్ధి చేకూర్చిందని, పేద రైతులకు ఉపయోగం లేదని కాంగ్రెస్ ఆరోపిస్తోంది. ధాన్యం కొనుగోలు జాప్యం, రైతు వ్యతిరేక పంధా వల్ల తెలంగాణలో మళ్లీ రైతుల ఆత్మహత్యలు పెరిగాయని కాంగ్రెస్ బీఆర్ఎస్ పై మాటల తూటాలు పేల్చుతోంది. తమ ప్రభుత్వం వచ్చాకే రైతులకు రైతు భరోసా ద్వారా పెట్టుబడి సాయం అందుతోందని, పంటలకు మద్దతు ధర లభిస్తోందని, రైతు రుణాలు మాఫీ అయ్యాయని కాంగ్రెస్ చెప్పుకొస్తోంది.

ఈ క్రమంలోనే రైతు సంక్షేమంపై అధికార కాంగ్రెస్, ప్రతిపక్ష బీఆర్ఎస్ పార్టీల మధ్య వాగ్యుద్ధం సాగుతోంది. దీనికి పరాకాష్ఠగా రేవంత్ రెడ్డి అసెంబ్లీలో చర్చకు రమ్మని సవాల్ విసిరితే, చర్చ సోమాజీగూడ ప్రెస్ క్లబ్‌లో పెట్టుకుందాం రండి అంటూ కేటీఆర్ ప్రతిసవాల్ విసిరారు. దీంతో రెండు పార్టీల మధ్య చర్చ తీవ్రస్థాయికి చేరింది.