Nirmal News: పోలీసులు రౌడీలతో, సామాన్య ప్రజలతే ఒకేలా వ్యవహరిస్తే సమస్యలు వస్తాయి. పరిస్థితులకు తగ్గట్లుగా వ్యవహిరంచకపోతే వ్యవస్థ మీదనే విమర్శలు వస్తాయి. అలాంటి ఘటనే నిర్మల్ జిల్లా లోజరిగింది. 

తెలంగాణలోని నిర్మల్ జిల్లాలో ఒక వృద్ధ రైతుపై  ASI  రామచందర్‌ అనుచితంగా ప్రవర్తించిన ఘటన సంచలనంగా మారింది. నిర్మల్ జిల్లా, ఖానాపూర్ మండలం, పాత ఎల్లాపూర్ గ్రామానికి చెందిన ఒక వృద్ధ రైతు రెవెన్యూ సదస్సులో తన భూ సమస్యను చెప్పుకునేందుకు తహశీల్దార్ కార్యాలయానికి వచ్చాడు. అక్కడ విధులు నిర్వహిస్తున్న ASI రామచందర్, ఆ రైతును మెడ పట్టుకుని నిర్దాక్షిణ్యంగా తహశీల్దార్ ఛాంబర్ నుంచి బయటకు గెంటాడు.  వీడియో సోషల్  మీడియాలో వైరల్ అయింది.  ASI రామచందర్ రైతును బలవంతంగా బయటకు తోస్తున్న దృశ్యాలు కనిపించాయి.  

ఉన్నతాధికారులకు తన భూమి సమస్య చెప్పుకునేందుకు వస్తే నన్ను కనికరం లేకుండా పోలీసులు ఈడ్చుకెళ్లారని రైతు ఆవేదన వ్యక్తంచేశారు. 

రైతుపై ఎస్సై దురుసు ప్రవర్తన అందర్నీ ఆగ్రహానికి గురి చేసింది.  ఈ ఘటనపై తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం తీవ్రంగా స్పందించింది. రాష్ట్ర మంత్రి సీతక్క ఆదేశాల మేరకు నిర్మల్ జిల్లా ఎస్పీ జానకి షర్మిల ASI రామచందర్‌ను సస్పెండ్ చేశారు. ఈ సంఘటనపై విచారణ జరపాలని ఆదేశించారు.  రామచందర్‌పై శాఖాపరమైన చర్యలు తీసుకునేలా విచారణకు ఆదేశించారు.       

తెలంగాణ ప్రభుత్వం భూ సమస్యలను పరిష్కరించేందుకు రెవెన్యూ సదస్సులను నిర్వహిస్తోంది.  ఇక్కడ రైతులు తమ సమస్యలను అధికారుల దృష్టికి తీసుకువచ్చేందుకు కార్యాలయాలకు వస్తున్నారు.  ఇలాంటి రెవిన్యూ సదస్సులలో తన సమస్య చెప్పుకునేందుకు వృద్ధ రైతు వచ్చాడు. అక్కడేం జరిగిందో కానీ ఏఎస్ఐ మాత్రం రైతును అవమానించాడు. దురుసుగా ప్రవర్తించాడు.  ఈ ఘటన రాష్ట్రవ్యాప్తంగా చర్చనీయాంశమైంది. రైతుల సమస్యలను పరిష్కరించేందుకు ఉద్దేశించిన కార్యక్రమంలో ఒక వృద్ధ రైతుపై అనుచితంగా ప్రవర్తించడం ప్రజలలో ఆగ్రహాన్ని రేకెత్తించింది.                   

ఈ సంఘటన పోలీసు అధికారులు, ముఖ్యంగా రెవెన్యూ సదస్సుల వంటి సామాజిక కార్యక్రమాలలో విధులు నిర్వహించేటప్పుడు ప్రజలతో వ్యవహరించే తీరుపై చర్చకు కారణం అయింది.