Government Vehicle Misuse Rapido: శాఖాపరమైన విధులకు, అత్యవసర పెట్రోలింగ్‌కు ఉపయోగించాల్సిన పోలీస్ మొబైల్ వాహనం ఒక రైడ్ షేరింగ్ యాప్‌లో ప్రత్యక్షమై సాధారణ ప్రయాణికుడికి రవాణా సేవలు అందించడం సంచలనంగా మారింది. ఓ పౌరుడు స అనుమానంతో ర్యాపిడో యాప్‌లో బైక్ బుకింగ్ చేయగా, ఆయనను పికప్ చేసుకోవడానికి ఏకంగా పోలీస్ అధికారిక పెట్రోలింగ్ వాహనం వచ్చి ఆగింది. ఈ వింత పరిణామానికి ఆశ్చర్యపోయిన సదరు కస్టమర్, పికప్ పాయింట్ నుంచి డ్రాప్ లోకేషన్ వరకు ప్రయాణాన్ని తన స్మార్ట్‌ఫోన్‌లో వీడియో తీసి సోషల్ మీడియాలో పోస్ట్ చేయడంతో అది క్షణాల్లో వైరల్‌గా మారింది.
ఈ వైరల్ వీడియో క్లిప్‌లో సదరు ప్రయాణికుడు పోలీస్ వాహనంలో వెళ్తుండగా, డ్రైవింగ్ సీట్లో ఉన్న వ్యక్తి సాధారణ ప్రయాణాన్ని సాగిస్తున్నట్లు స్పష్టంగా కనిపిస్తోంది. ప్రజా రక్షణకు, అత్యవసర సేవలకు వినియోగించే ప్రభుత్వ వాహనాలు ప్రైవేట్ యాప్‌లలో కమర్షియల్ రైడింగ్ కోసం ఎలా అందుబాటులోకి వచ్చాయనే అంశంపై నెటిజన్లు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ప్రభుత్వ ఆస్తులు, ఇంధనం దుర్వినియోగం కావడంపై నెటిజన్లు రకరకాల కామెంట్లతో నిరసన వ్యక్తంచేస్తున్నారు.
అయితే, ఈ వాహనం వరంగల్ పోలీస్ కమిషనరేట్‌కు చెందినదా లేదా కరీంనగర్ కమిషనరేట్ పరిధిలోనిదా అనే దానిపై స్పష్టత రావాల్సి ఉంది. నంబర్ ప్లేట్ , వాహనంపై ఉన్న స్టిక్కరింగ్ ఆధారంగా ఉమ్మడి వరంగల్, కరీంనగర్ జిల్లాల పరిధిలోని పోలీసు ఉన్నతాధికారులు ప్రాథమికంగా పరిశీలిస్తున్నారు. సాంకేతికంగా యాప్‌లో డ్రైవర్ ఐడీ ఎలా రిజిస్టర్ అయింది, నిజంగానే పోలీస్ డ్రైవర్ ఈ పనికి ఒడిగట్టాడా లేక వాహనాన్ని ప్రైవేట్ వ్యక్తులు సర్వీసింగ్, మెయింటెనెన్స్ కోసం తీసుకెళ్లినప్పుడు ఇలా చేశారా అనే కోణంలో దర్యాప్తు సాగుతోంది.
ప్రజా సేవల కోసం కేటాయించిన వాహనాన్ని వ్యాపార ప్రయోజనాలకు ఉపయోగించడం తీవ్రమైన నిబంధనల ఉల్లంఘన కిందకే వస్తుంది. ఈ ఘటనపై సంబంధిత జిల్లాల పోలీస్ కమిషనర్లు విచారణకు ఆదేశించినట్లు తెలుస్తోంది. వాహనంలో ఉన్న సిబ్బందిని లేదా వాహన బాధ్యత వహించే డ్రైవర్‌ను గుర్తించి, ఘటన వెనుక ఉన్న పూర్తి వాస్తవాలను త్వరలోనే అధికారికంగా వెల్లడించి బాధ్యులపై శాఖాపరమైన చర్యలు తీసుకుంటామని ఉన్నతాధికారులు స్పష్టం చేస్తున్నారు.
