హైదరాబాద్‌లో నెల్లూరు జిల్లాకు చెందిన స్థిరాస్థి వ్యాపారి విజయ భాస్కర్ అపహరణ, హత్య ఘటన మరవకముందే.. తెలంగాణలో మరోచోట అలాంటి ఘటన చోటు చేసుకుంది. అయితే, పోలీసులు వెంటనే ఛేదించి బాధితుడికి ఎలాంటి నష్టం జరక్కుండానే నిందితులను అరెస్టు చేశారు. నిర్మల్‌ జిల్లాలో రియల్ ఎస్టేట్ వ్యాపారి కిడ్నాప్ కావడం కలకలం రేపింది. రియల్ ఎస్టేట్ వ్యాపారి విజయ్‌ చందర్ దేశ్‌పాండేను గుర్తుతెలియని దుండగులు కిడ్నాప్ చేశారు.


నిర్మల్‌ నగరంలోని తన్వి అనే అపార్ట్‌మెంట్‌లో ఓ ఫ్లాట్‌లో ఉంటున్న విజయ్‌ చందర్‌ దేశ్‌పాండేను కిడ్నాప్ చేశారు. ఉదయం 7 గంటల ప్రాంతంలో ఆయన ఫ్లాట్ నుంచి కిందికి వచ్చిన సమయంలో గుర్తు తెలియని ఆరుగురు వ్యక్తులు రియల్ ఎస్టేట్ వ్యాపారిని బలవంతంగా ఎత్తుకెళ్లారు. రెండు కార్లలో వచ్చిన వ్యక్తులు విజయ్ చందర్ దేశ్ పాండేను బలవంతంగా లాక్కొని కారు ఎక్కించి తీసుకువెళ్లారు. స్థానికులు అడ్డుకునే ప్రయత్నం చేయగా బెదిరింపులకు పాల్పడినట్లు తెలుస్తోంది. నలుగురు దుండగులు విజయ్‌ చందర్‌ను కారులో తీసుకెళ్లినట్లు కుటుంబ సభ్యులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీంతో పోలీసులు కేసు నమోదు చేసుకొని విచారణ చేపట్టారు.


Also Read: Hyderabad Crime News: ప్రియుడితో ఏకాంతంగా భార్య.. ఇంతలో భర్త ఎంట్రీ, చివరికి ఏమైందంటే..


విచారణలో భాగంగా పోలీసులు విజయ్​చందర్ ఫోన్‌తో పాటు, స్థానికంగా ఉన్న సీసీటీవీ కెమెరాల ఫుటేజీలను క్షుణ్నంగా పరిశీలించారు. సుదీర్ఘ విచారణ అనంతరం మెదక్ జిల్లా తూప్రాన్ వద్ద విజయ్‌ చందర్ ఉన్నట్లుగా పోలీసులు ఆచూకీ కనుగొన్నారు. తూప్రాన్‌ వద్ద ఐదుగురు నిందితులను అదుపులోకి తీసుకున్నట్లు పోలీసులు చెప్పారు. 


ఛేజింగ్ చేసి అదుపులోకి..
కుటుంబ సభ్యుల ఫిర్యాదుతో అప్రమత్తమైన పోలీసులు సీసీటీవీ కెమెరాల ద్వారా కిడ్నా్ప్ చేసిన వాహనాలు తూప్రాన్‌ వైపు వెళ్తున్నట్లు గుర్తించారు. వెంటనే రెండు బృందాలుగా ఏర్పడి వారిని వెంబడించి కిడ్నాపర్లను తుప్రాన్ దగ్గర పట్టుకున్నారు. రియల్టర్‌ విజయ్‌ దేశ్‌ పాండే సురక్షితంగా ఉన్నట్లు కుటుంబ సభ్యులకు పోలీసులు సమాచారం అందించారు. రియల్టర్‌ లావాదేవీలు, భూముల కొనుగోలు వ్యవహారమే కిడ్నాప్‌కు కారణమని పోలీసులు ప్రాథమికంగా భావిస్తున్నారు. రియల్టర్‌ విజయ్‌ దేశ్‌పాండే సంగారెడ్డిలో రెండు నెలల క్రితం రూ.2 కోట్ల విలువైన భూమిని కొనుగోలు చేశారు. ఆ భూమి లావాదేవీల విషయంలో వివాదం వచ్చినట్లు తెలుస్తోంది. దీనివల్లే కిడ్నాప్‌కు గురైనట్లు పోలీసులు భావిస్తున్నారు.


Also Read: CM KCR Convoy: సీఎం కేసీఆర్ కాన్వాయ్‌కు ఎదురుగా దూసుకొచ్చిన బైక్.. టెన్షన్.. టెన్షన్, పోలీసుల ఉరుకులు పరుగులు


హైదరాబాద్‌లో కిడ్నాప్, హత్య మరవకముందే..
హైదరాబాద్‌లో కూడా ఇలాంటి ఘటనే ఒకటి జరిగిన సంగతి తెలిసిందే. కేపీహెచ్‌బీ ప్రాంతంలో హాస్టల్‌లో ఉంటున్న రియల్ ఎస్టేట్ వ్యాపారి విజయ్ భాస్కర్ రెడ్డిని దుండగులు కిడ్నాప్ చేశారు. గత నెల 20న ఈ ఘటన జరిగింది. అతణ్ని శ్రీశైలం హైవేపై హత్య చేసి సున్నిపెంట సమీపంలోని ఓ శ్మశానంలో అంత్యక్రియలు సైతం నిర్వహించారు. ఈ ఘటనలో రెండ్రోజుల క్రితం పోలీసులు ఏడుగురిని అదుపులోకి తీసుకున్న సంగతి తెలిసిందే. బెంగళూరుకు చెందిన ఓ గురూజీ ఈ హత్యకు కుట్ర పన్నినట్లుగా పోలీసులు అనుమానిస్తున్నారు. దీనికి సంబంధించి మరింత లోతుగా పోలీసులు విచారణ కొనసాగిస్తున్నారు.


Also Read: Earthquake: సూర్యాపేటలో భూ ప్రకంపనలు.. గుంటూరు జిల్లాలో కూడా కదలికలు..