Case On Medigadda Issue :  కాళేశ్వరం ప్రాజెక్టులో అతి కీలకమైన మేడిగడ్డ బ్యారేజీ వంతెన కుంగిపోవడంపై మహదేవ్‌పూర్ పోలీసులు ఈ కేసు రిజిష్టర్ చేశారు. ఇరిగేషన్ అధికారుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేశారు. పిల్లర్ కింద భారీ శబ్దం రావడంతో కుట్రకోణం ఉందన్న అనుమానంతో అధికారులు ఈ ఫిర్యాదు చేశారు. ఉద్దేశ పూర్వకంగానే విద్రోహచర్యతో ఎవరైనా పేలుడుపదార్థం పెట్టి ఉంటారని అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. అసెంబ్లీ ఎన్నికలు దగ్గరలో ఉన్న సమయంలో ఇలా జరగడంతో ప్రభుత్వాన్ని అప్రతిష్ట పాలు చేయాలని కుట్ర చేసినట్లుగా అనుమానిస్తున్నారు.  పబ్లిక్ ప్రాపర్టీ డ్యామేజ్ 3, 4 సెక్షన్ల కింద పోలీసులు కేసు నమోదు చేశారు.కేసుపై విచారణకు పోలీసులు ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేశారు.  


అసాంఘిక శక్తులు బ్యారేజీకి నష్టం కలిగించాయని ఇంజినీర్ ఫిర్యాదు 


కొన్న అసాంఘిక శక్తులు ప్రభుత్వానికి చెందిన ఈ బ్యారేజీకి నష్టం కలిగించారని ఘటన జరిగిన సమయంలో డ్యూటీలో ఉన్న అసిస్టింట్ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ రవికాంత్ పోలీసులకు ఇచ్చిన ఫిర్యాదులో  పేర్కొన్నారు. సమగ్ర దర్యాప్తు జరిపించాల్సిందిగా పోలీసులకు విజ్ఞప్తి చేశారు. మహదేవ్‌పూర్ స్టేషన్ హౌజ్ ఆఫీసర్‌కు ఆదివారం ఇచ్చిన రాతపూర్వక ఫిర్యాదులో పై అనుమానాన్ని వ్యక్తం చేశారు. భారీ శబ్దం వచ్చేంతవరకూ బ్యారేజీ బ్రిడ్జిమీద వాహనాల రాకపోకలు యధావిధిగానే జరిగాయని స్పష్టం చేశారు. శనివారం సాయంత్రం 6.20 గంటలకు భారీ శబ్దం వచ్చిందని, ఆ వెంటనే ఎల్ అండ్ టీ సంస్థకు చెందిన ఫోర్‌మాన్ బిద్యుత్ దేబ్‌నాధ్‌తో కలిసి ఘటనా స్థలం దగ్గరికి వెళ్ళి చూశామని, ఏడవ నెంబర్ బ్లాక్‌లో 19-21 పిల్లర్ల మధ్య ప్రాంతంలో బ్యారేజీ మీద ఉన్న రోడ్డు బ్రిడ్జి శ్లాబ్, పిట్టగూడ కుంగిపోయినట్లు గమనించామని, ఇది మహారాష్ట్ర సరిహద్దువైపు చోటుచేసుకున్నదని ఆ ఫిర్యాదులో రవికాంత్ పేర్కొన్నారు. ఈ ఫిర్యాదు ఆధారంగా పోలీసులు ఐపీసీలోని సెక్షన్ 427, పబ్లిక్ ప్రాపర్టీ విధ్వంస నిరోధక చట్టంలోని సెక్షన్ 3 కింద కేసు నమోదు చేసినట్లు తెలిపారు.


కుంగిన వంతెనను పరిశీలించిన కేంద్ర బృందం


విపక్షాలన్నీ నిర్మాణ లోపం, నాణ్యత లేకపోవడం, మానవ తప్పిదం, ఇంజనీరింగ్ డిజైన్‌లోనే పొరపాటు ఉండడం.. ఇలాంటి విమర్శలు వస్తున్న సమయంలో పోలీసులకు కుట్ర కోణంలో ఫిర్యాదు చేయడం..పోలీసులు కేసు నమోదు చేయడం ఆసక్తికరంగ మారింది. మరో వైపు మేడిగడ్డ బ్యారేజ్ ను కేంద్ర బృందం పరిశీలించింది.  నేషనల్ డ్యాం సేఫ్టీ అథారిటీ చైర్మన్ అనిల్ జైన్ ఆధ్వర్యంలో ఆరుగురు సభ్యుల కమిటీ.. మంగళవారం కుంగిన మేడిగడ్డ లక్ష్మీ బ్యారేజీని పరిశీలించింది.  సుమారు రెండు గంటల పాటు కుంగిన 20వ పిల్లర్ తోపాటు18, 19, 21వ పిల్లర్లను  కేంద్రం బృందం క్షుణ్ణంగా పరిశీలించింది. పగుళ్లు వచ్చిన డ్యాం, క్రస్ట్ గేట్లను పరిశీలించిన కేంద్ర బృందం సభ్యులు.. బ్యారేజీ డిజైన్, నిర్మాణం వివరాలను రాష్ట్ర ఇరిగేషన్ అధికారుల నుండి వివరాలు రికార్డు చేసుకున్నారు. బ్యారేజీ పటిష్టత,  జరిగిన నష్టంపై  కేంద్ర బృందం అంచనా వేసింది.


కీలకం కానున్న కేంద్ర బృందం 
 
కేంద్రం బృందం ఇచ్చే నివేదిక కూడా కీలకం కానుంది. డిజైన్ లోపం లేదా.. నిర్మాణ లోపం  ఉంటే కేంద్ర బృందం ఆ విషయాన్ని వెల్లడించే అవకాశం ఉంది. విద్రోహ చర్య అయితే.. ఆ విషయాన్ని కూడా కేంద్ర బృందం వెల్లడించే అవకాశం ఉంది. ఒక వేళ కేంద్ర బృందం...  నాణ్యతాలోపం లేదా డిజైన్ లోపం వల్ల అనే నివేదిక ఇస్తే.. ప్రభుత్వం.. తమ తప్పును ఇతరులపై నెట్టడానికి విద్రోహచర్య అనే  ప్రచారం చేస్తున్నదన్న విమర్శలు ఎదుర్కోవాల్సి వస్తుంది.