Bandi Sanjay Borabanda campaign event: బోరబండలో బండి సంజయ్ సభకు ఎట్టకేలకు అనుమతిని పోలీసులు ఇచ్చారు. జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల ప్రచారంలో భాగంగా బోరబండలో జరగాల్సిన కేంద్ర మంత్రి బండి సంజయ్ కుమార్ సభకు పోలీసులు మొదట అనుమతి ఇచ్చి, తర్వాత మధ్యాహ్నం 1 గంటకు రద్దు చేయడంతో రాజకీయ ఉద్రిక్తత ఏర్పడింది. బీజేపీ క్యాడర్ భారీ ఒత్తిడి , ఎన్నికల కమిషన్ (ECI) జోక్యంతో పోలీసులు తలొగ్గి, సభకు ఎట్టకేలకు అనుమతి ఇచ్చారు. సభ సైట్-3 వద్ద సాయంత్రం యథావథిగా జరపుకోవచ్చని ప్రకటించారు. భద్రత కోసం కేంద్ర బలగాలను భారీగా మోహరించారు.
జూబ్లీహిల్స్ ఉపఎన్నికల్లో బోరబండ డివిజన్ కీలకం. అక్కడ బీజేపీ అభ్యర్థి కోసం బండి సంజయ్ నేతృత్వంలో జరగాల్సిన ప్రచార సభకు పోలీసులు మొదట అనుమతి ఇచ్చారు. ఇది ECI ఆదేశాలకు అనుగుణంగా జరగాలని సూచించారు. అయితే, మధ్యాహ్నం 1 గంటకు హైదరాబాద్ పోలీసు కమిషనరేట్ అనుమతిని రద్దు చేసింది. 'భద్రతా సమస్యలు' , 'మోడల్ కోడ్ ఆఫ్ కండక్ట్' (MCC) ఉల్లంఘన వల్ల అనుమతి రద్దు చేసినట్లుగా తెలుస్తోంది. దీనిపై బండి సంజయ్ ఆగ్రహం వ్యక్తం చేశారు. "ఇది డెమోక్రసీనా లేక రజాకర్ రాజా? పోలీసులు ఎంఐఎం ఆర్డర్లలో ఉన్నారా? అనుమతి మొదట ఇచ్చి, ఒక్కసారిగా రద్దు చేయడం ఏమిటి? ప్రజల స్వరం లేక బీజేపీ ఎదుగుదల భయం? అనుమతి లేకపోయినా బోరబండకు వస్తాను. ఎవరైనా ఆపగలరా చూద్దాం" అని హెచ్చరించారు. బీజేపీ కార్యకర్తలకు "సాయంత్రం భారీగా తరలి రావాలని " పిలుపునిచ్చారు.
అనుమతి ఇవ్వకపోతే పెద్ద ఎత్తున జనం తరలి వచ్చి ఉద్రిక్తతలు ఏర్పడే అవకాశం ఉండటంతో పోలీసులు అనుమతి మంజూరు చేశారు. భద్రతను కేంద్ర రిజర్వ్ పోలీస్ ఫోర్స్, ర్యాపిడ్ యాక్షన్ ఫోర్స్ కల్పిస్తున్నాయి. సభ జరగనున్న సైట్-3 చుట్టూ 500 మంది కేంద్ర బలగాలు, 1,000 మంది స్థానిక పోలీసులు డ్యూటీలో ఉంటారు. ట్రాఫిక్ డైవర్షన్‌లు, బ్యారికేడ్‌లు ఏర్పాటు చేశారు.
కేంద్ర హోంశాఖ సహాయ మంత్రిగా బండి సంజయ్ ఉన్నారు. ఆయనసభకు ముందుగా అనుమతి ఇచ్చి రద్దు చేయడం వివాదాస్పదమయింది. పోలీసులు తమ చేతులలో ఏమీ లేదని అంతా రిటర్నింగ్ అధికారి చేతుల్లోనే ఉందని ప్రకటించారు. అయితే పరిస్థితులు విషమించుకండా ఉండాలంటే.. అనుమతి ఇవ్వడమే మంచిదని డిసైడయ్యి.. చివరికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. కానీ బోరబండ సున్నితమైన ప్రాంతం కావడంతో భారీ భద్రతను ఏర్పాటు చేస్తున్నారు.