Case on Young Man Who Make Insta Reel on How to Eat Dmart Free Chocolates: ప్రస్తుతం యువత సోషల్ మీడియాకు అడిక్ట్ అవుతున్నారు. తక్కువ టైంలో పాపులారిటీ కావాలనే ఉద్దేశంతో వింతగా ప్రవర్తిస్తూ.. ఆ పిచ్చి చేష్టలను సోషల్ మీడియా వేదికగా షేర్ చేస్తూ ఇబ్బందులు కొని తెచ్చుకుంటున్నారు. ఇప్పటివరకూ మెట్రోలో రీల్స్ చేయడం, బహిరంగంగా డ్యాన్స్ చేయడం వంటి వాటినే మనం చూశాం. కానీ, ఓ యువకుడు డీ మార్ట్ (Dmart) లో విచిత్రంగా దొంగతనం చేశాడు. 'బిల్ కట్టకుండా ఓ చాక్లెట్ చోరీ చేసి అక్కడే తినడం ఎలా.?' అనే టైటిల్ పెట్టి ఇన్ స్టా రీల్ చేశాడు. అది కాస్తా వైరల్ కావడంతో పోలీసులు సదరు యువకునిపై చర్యలు చేపట్టారు. 


ఇదీ జరిగింది.


ఇటీవల హనుమాన్ నాయక్ (22) (Hanuman Nayak) అనే యువకుడు స్నేహితులతో కలిసి షేక్ పేటలోని డీ మార్ట్ సూపర్ మార్కెట్ కు వెళ్లాడు. అక్కడ అమ్మే చాక్లెట్లను డబ్బులు చెల్లించకుండా ఎలా తినాలో చూపించి ఫేమస్ కావాలని నిర్ణయించుకున్నాడు. ఈ క్రమంలోనే ఓ 2 చాక్లెట్లు తీసుకుని.. ఓ షర్టు తీసుకున్నాడు. అనంతరం ట్రైల్ రూంలోకి వెళ్లి చాక్లెట్స్ తిని అనంతరం చాక్లెట్ కవర్ షర్ట్ లో పెట్టి తెచ్చిన చోటే తిరిగి పెట్టేశాడు. అంతే కాకుండా 'బిల్లు చెల్లించకుండా ఫ్రీగా చాక్లెట్స్ ఎలా తినాలో తెలుసా.?' అంటూ ఇన్ స్టాతో పాటు ఇతర సోషల్ మీడియాల్లో పోస్ట్ చేశాడు. ఈ వీడియో వైరల్ కాగా.. డీమార్ట్ బ్రాంచ్ మేనేజర్ అర్జున్ సింగ్ బుధవారం ఫిలింనగర్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీంతో చాక్లెట్లు దొంగిలించిన హనుమాన్ నాయక్, అతని స్నేహితులపై ఐపీసీ సెక్షన్ 402, 379, ఐటీ చట్టం కింద పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. 


డీ మార్ట్ మొత్తం సీసీ కెమెరా సర్వేలెన్స్ లో ఉండగా.. ట్రైల్ రూంలో మాత్రం సీసీ కెమెరాలు ఉండవు. దీంతో ఈ లాజిక్ నే హనుమంత్ నాయక్ వాడుకొని రీల్స్ చేసి వ్యూస్ పెంచుకోవాలనుకున్నాడు. చివరకు కథ అడ్డం తిరిగి పోలీసులకు చిక్కాడు.


Also Read: Shiva Balakrishna Arrested: హెచ్‌ఎండీఏ అవినీతి అనకొండ శివబాలకృష్ణ అరెస్టు- ఇంకా కొనసాగుతున్న అక్రమాస్తుల మదింపు