Maoists News: మహారాష్ట్రలోని గడ్చిరోలిలో పోలీసులు, మావోయిస్టుల మధ్య కాల్పులు జరిగాయి. ఈ ఎదురు కాల్పుల్లో నలుగురు మావోయిస్టులు హతమైనట్టు సమాచారం. ఇందులో కీలకమైన నేతలు ఉన్నట్టు తెలుస్తోంది. హతమైన వారిలో... వర్గీస్‌, మగాతు, కురుసం రాజు, వెంకటేష్‌‌. ఘటనా స్థలం నుంచి భారీగా ఆయుధాలు స్వాధీనం చేసుకున్నట్టు పోలీసులు తెలిపారు.  


తెలంగాణ నుంచి వెళ్తుండగా కాల్పులు


తెలంగాణ నుంచి మహారాష్ట్రలోకి ప్రవేశించేందుకు యత్నించిన మావోయిస్టులు పోలీసులకు ఎదురుపడ్డారని పోలీసులు ఓ ప్రకటన తెలిపారు. భద్రతా సిబ్బందిని చూసిన మావోయిస్టులు కాల్పులకు తెగబడ్డారని పేర్కొన్నారు. ప్రతిగానే పోలీసులు కాల్పులు జరిపినట్టు పేర్కొన్నారు. భారీ సంఖ్యలో ఆయుధాలతో మావోయిస్టులు మహారాష్ట్రలోకి వచ్చేందుకు ప్రయత్నించినట్టు వివిరించారు.   


మృతులు కీలక సభ్యులు 


చనిపోయిన మావోయిస్టులు తెలంగాణ కమిటీ సభ్యులుగా గుర్తించారు. వీళ్లపై 36 లక్షల రివార్డు ఉన్నట్టు వివరించారు. ఎన్‌కౌంటర్‌లో డీవీసీ సభ్యుడు వర్గీష్, డీవీసీ మంగాతు, ప్లాటూన్ సభ్యుడు రాజు, ప్లాటూన్ సభ్యుడు వెంకటేష్ మృతి చెందారు. సోమవారం సాయంత్రం కొందరు మావోయిస్టులు తెలంగాణ బోర్డర్ దాటి మహారాష్ట్రంలోకి రాబోతున్నట్టు ముందే సమాచారం అందినట్టు పేర్కొన్నారు పోలీసులు. లోక్‌సభ ఎన్నికల వేల అలజడి సృష్టించాలన్న ధ్యేయంతో భారీ ఆయుధాలతో ప్రాణహిత నది మీదుగా మహారాష్ట్రంలోకి ప్రవేశించబోతున్నట్టు ఆ సమాచారమని పేర్కొన్నారు. 


పక్కా సమాచారంతో తనిఖీలు


పక్కా సమాచారంతో అలర్టైన పోలీసులు అడిషనల్ ఎస్పీ యతీష్‌ దేశ్‌ముఖ్‌ ఆధ్వర్యంలో పోలీసులు, సీఆర్‌పీఎఫ్‌ బలగాలు తనిఖీలు చేపట్టాయి. బలగాల తనిఖీలు సాగుతుండగానే కోలమర్క కొండల్లో ఉన్న మావోయిస్టులు భద్రతా సిబ్బందిపై కాల్పులకు తెగబడ్డారు. దీనికి ప్రతిగానే పోలీసులు రియాక్ట్ అయినట్టు పేర్కొన్నారు. హోరాహోరీగా కాల్పులు జరిగాయన్నారు. 


ఆయుధాలు స్వాధీనం 


కాసేపటికి అటు నుంచి కాల్పులు ఆగిపోవడంతో భద్రతా సిబ్బంది తనిఖీలు చేయగా నలుగురు మావోయిస్టులు హతమైనట్టు గుర్తించారు. వారి మృతదేహాలను స్వాధీనం చేసుకున్నారు. ఒక ఏకే 47 రైఫిల్‌ను, కార్బయిన్‌ను, రెండు నాటు తుపాకులను, ఇతర నక్సల్‌ భావజాలంతో ఉన్న పుస్తకాలను వారి వద్ద నుంచి రికవరీ చేసుకున్నారు. 


జల్లెడ పట్టిన పోలీసులు 


చనిపోయిన డీవీసీఎం వర్గీష్‌, మంగీ ఇంద్రవల్లి ఎరియా కమిటీ సెక్రటరీ, కుమ్రంభీమ్‌ మంచిర్యాల డివిజన్‌ కమిటీ సభ్యుడిగా ఉన్నాడు. డీవీసీఎం మగ్తూ, సిర్పూర్‌ చెన్నేరు ఏరియా కమిటీ సెక్రటరీగా ఉన్నాడు. కుర్సాంగ్‌ రాజు ప్లాటూన్ సభ్యుడు. కుడిమెట్ట వెంకటేష్‌ కూడా ప్లాటూన్‌ సభ్యుడు. ఈ ఘటన తర్వాత కూడా భద్రతా సిబ్బంది ఆ ప్రాంతాన్ని జల్లెడ పట్టాయి.