Happy Birthday Mohan Babu: అప్పట్లో ఈ నటుడి సినిమా అంటే బాక్సాఫీసుపై కలెక్షన్ల దాడి జరగాల్సిందే. తన వైవిధ్యమైన డైలాగ్‌ డెలివరి, నటనతో బాక్సాఫీసు వద్ద కనకవర్షం కురిపించారు. అందుకే ఆయన నిర్మాతల 'కలెక్షన్‌ కింగ్‌, అభిమానుల 'డైలాగ్‌ కింగ్‌' అయ్యారు. ఆయనే విలక్షణ నటుడు మంచు మోహన్‌ బాబు. వెండితెరపై విలన్‌గా బయపెట్టిన ఆయన హీరోగానూ ఆకట్టుకున్నారు. తన వైవిధ్యమైన నటన, డైలాగ్‌ డెలివరితో బాక్సాఫీసు వద్ద కలెక్షన్ల సునామితో నిర్మాతల 'పెద్దరాయుడి'గా నిలిచారు. నేడు మోహన్‌ బాబు బర్త్‌డే. మార్చి 19న ఆయన పుట్టిన రోజు. ఫిజికల్‌ ట్రైనర్‌ నుంచి కలెక్షన్‌గా కింగ్‌గా ఎదిగిన ఆయన నట ప్రస్థానం గురించి ఇక్కడ ఒకసారి చూద్దాం!


మోహన్ బాబు అసలు పేరు భక్తవత్సలం నాయుడు. 1952, మార్చి 19న చిత్తూరు జిల్లా మోదుగలపాళెంలో జన్మించారు. ఫిజిక్స్‌లో డిగ్రీ చేసిన ఆయన ఆ తర్వాత ఫిజికల్‌ ట్రైనర్‌ టీజర్‌గా పనిచేశారు. ఆ తర్వాత సినీరంగ ప్రవేశం చేసిన ఆయన ఆ తర్వాత మోహన్‌ బాబుగా పేరు మార్చుకున్నారు. అయితే నటనపై మక్కువతో చిత్తూరు నుంచి చెన్నై(అప్పటి మద్రాసు) రైలు ఎక్కిన మొదట్లో అవకాశాలు దొరక్క ఎన్నో కష్టాలు పడ్డ ఆయనకు మెల్లిగా ఆఫర్స్‌ వరించాయి. చిన్నచిన్న పాత్రలు చేసుకుంటున్న ఈ భక్తవత్సలం నాయుడు దాసరి దర్శకత్వంలో తెరకెక్కిన 'స్వర్గం-నరకం' సినిమాతో మంచి గుర్తింపుపొందారు. నిజం చెప్పాలంటే నటుడిగా మోహన్‌ బాబుకు గుర్తింపు తెచ్చిపట్టింది, నిలబెట్టింది ఈ సినిమానే.


'స్వర్గం-నరకం'తో సినీ ప్రస్థానం


అందుకే దాసరి తనకు తండ్రిలాంటి వారని, తనకు నటుడిగా జన్మనిచ్చింది ఆయనే అంటూ గురువులా భావిస్తారు. ఈ విషయాన్ని సందర్భం వచ్చినప్పుడల్లా ఆయన గుర్తు చేసుకుంటూనే ఉంటారు. 'స్వర్గం-నరకం' తర్వాత మోహన్‌ బాబు తన కెరీర్‌లో ఇక వెనక్కి తిరిగి చూసుకునే అవకాశం రాలేదు. విలన్‌గా, కమెడియన్‌గా, హీరోగా వెండితెరపై నవరసాలు పండించి తనలోని నటుడిని పరిచయం చేశారు. తన కెరీర్‌లో దాదాపు 575 పైగా సినిమాలు చేశారు. కెరీర్‌ ప్రారంభంలో విలన్‌గా గుర్తింపు పొందిన ఆయనను 'అల్లుడు గారు' , 'అసెంబ్లీ రౌడి' , 'రౌడీ గారి పెళ్ళాం' వంటి చిత్రాలు హీరోగా నిలబెట్టాయి. ఆ తరవాత వచ్చిన 'అల్లరి మొగుడు', 'బ్రహ్మ' , 'మేజర్ చంద్రకాంత్' వంటి చిత్రాలు బాక్సాఫీసు వద్ద సంచలన విజయం సాధించింది. ఈ చిత్రాలు బ్యాక్‌ టూ బ్యాక్‌ విజయాలతో ఆయనకు 'కలెక్షన్‌ కింగ్‌'గా బిరుదు పొందారు.  ఆ తరవాత వచ్చిన ‘పెదరాయుడు’ ఇండస్ట్రి హిట్‌గా నిలిచింది. అప్పట్లో ఈ సినిమా సాధించిన రికార్డ్స్‌ను ఏ తెలుగు సినిమా టచ్‌ చేయలేకపోయిందంటే ఆయన నటన, క్రేజ్‌ ఏ రేంజ్‌లో ఉండేదో అర్థచేసుకోవచ్చు.


'అల్లుడు గారు' వంటి సినిమాల్లో హోమ్లిగా, పెద్దరాయుడిలో డామినేట్‌ క్యారెక్టర్లతో ఆకట్టుకున్న మోహన్‌ బాబు..' శ్రీ రాములయ్య' , 'అడవిలో అన్న' వంటి చిత్రాలతో తనలో మరో నటుడిని పరిచయం చేశారు.  ఇందులో ఆయన యాక్టింగ్‌కు విమర్శకుల ప్రశంసలు దక్కాయి. మొత్తం మోహన్‌ బాబు తప విలనీజంలో హీరో.. మేనరిజాన్ని కలబోసుకుని విలక్షణమైన నటనను ఆయన సొంతం అనిపించుకున్నారు. ముఖ్యంగా 'అరిస్తే కరుస్తా.. కరిస్తే అరుస్తా..' వంటి కష్టతరమైన అవార్డును కూడా గుక్క తిప్పుకొకుండ చెప్పి ఆడియన్స్‌ని అబ్బురపరిచారు. స్టార్‌ హీరోగా కొనసాగుతుండగానే 1983లో శ్రీ లక్ష్మిప్రసన్న పిక్చర్స్ పేరు నిర్మాణ సంస్థ స్థాపించి 72కుపైగా సినిమాలు నిర్మించారు. నిర్మాతగాను ఆయన సక్సెస్‌ అయ్యారు.


2007లో 'పద్మశ్రీ' అవార్డు


తన సేవలను సినీరంగానికే కాకుండ విద్యారంగానికి కూడా అందిస్తున్నారు. 1992 శ్రీ విద్యానికేతన్ పేరుతో విద్యాసంస్థలు స్థాపించి పేద విద్యార్థులకు రాయితీ విద్యను అందిస్తున్నారు. దాంతో కళారంగం, విద్యారంగంలో ఆయన అందిస్తున్న సేవలకు గాను 2007లో కేంద్రప్రభుత్వం అత్యంత ప్రతిష్టాత్మ అవార్డులో ఒకటైన 'పద్మశ్రీ'తో ఆయనను సత్కరించింది. నటుడిగా ఎన్నో అవార్డులు అందుకున్న ఆయనకు'యాక్టర్ ఆఫ్ ది మిలీనియం' లాంటి పలు బిరుదులు కూడా వరించాయి. వీటితో పాటు' తెలుగు ఫిలింఫేర్ అవార్డ్స్, 'లైఫ్ టైం అచీవ్‌మెంట్‌' వంటి పురస్కారాలతో పాటు 2015లో ‘నటవాచస్పతి’ 2016లో ‘స్వర్ణకనకం’ వంటి నవరస నటరత్నం అవార్డులు కూడా వరించాయి. ఇక ఆయన రాజకీయాల్లోనూ తనదైన ముద్ర వేసుకున్నారు. 1995 నుంచి 2001 వ‌ర‌కు ఆయన టీడీపీలో రాజ్యసభ సభ్యుడిగా వ్యవహరించి ప్రజలకు సేవలు అందించిన సంగతి తెలిసిందే.  ఇక ఇప్పటికీ సినీరంగంలో రాణిస్తున్న ఆయన తన కుమారుడు మంచు విష్ణుతో 'కన్నప్ప' చిత్రంలో నటిస్తున్నారు.