PM Modi Nizamabad Tour: ప్రధాని నరేంద్ర మోదీ మంగళవారం నిజామాబాద్ జిల్లాలో పర్యటించనున్నారు. సభకు రైతులను, మహిళలను భారీగా రప్పించేందుకు బీజేపీ నేతలు ఏర్పాట్లు చేస్తున్నారు. మంగళవారం నిజామాబాద్‌లో జరగబోయే మోడీ సభను పార్టీ నాయకులు ప్రతిష్టాత్మకంగా తీసుకున్నారు. మహిళా బిల్లుకు ఆమోదం లభించడంతో మహిళలతో ప్రధానికి స్వాగతం పలికేందుకు బీజేపీ నేతలు ఏర్పాట్లు చేస్తున్నారు. నిజామాబాద్‌లో జరగబోయే సభ ద్వారా మరిన్ని అభివృద్ధి కార్యక్రమాల గురించి తెలియజేస్తారన్న నేపథ్యంలో జన సమీకరణపై ప్రధానంగా దృష్టి పెట్టారు. పార్టీ పరంగా బహిరంగ సభతో పాటు అధికారిక కార్యక్రమాల కోసం మరో వేదికను ఏర్పాటు చేశారు. ఎస్‌పీజీ అధికారులు సభ నిర్వహిస్తున్న ప్రాంతాన్ని తమ ఆధీనంలోకి తీసుకున్నారు. సభ నిర్వహిస్తున్న మూడు కిలోమీటర్ల పరిధిలో ఆంక్షలు విధించారు. రాబోయే ఎన్నికలకు మోడీ సభ కీలకమవుతుందని జిల్లా నాయకులు భావిస్తున్నారు.






తాజాగా పాలమూరులో ప్రధాని నరేంద్ర మోడీ పసుపు బోర్డు, ట్రైబల్ వర్సిటీ ప్రకటనతో బీజేపీ శ్రేణుల్లో సరికొత్త ఉత్సాహం కనిపిస్తోంది. దశాబ్దాల కల నెరవేరడంతో రైతులు కూడా స్వచ్ఛందంగా సభకు తరలి వస్తారని బీజేపీ నాయకులు అంచనా వేస్తున్నారు. ఈ నేపథ్యంలోనే పసుపు బోర్డు ఏర్పాటు చేయడం పట్ల ప్రధాని మోదీకి నిజామాబాద్ బీజేపీ ఎంపీ ధర్మపురి అరవింద్‌ ధన్యవాదాలు తెలిపారు. దీనికి ప్రధాని నరేంద్ర మోడీ తెలుగులో బదులిచ్చారు. తమకు రైతులు, ప్రజల ప్రయోజనాలే ముఖ్యమని స్పష్టం చేశారు. ఈ పర్యటనలో మోదీ పలు అభివృద్ధి పనులను ప్రకటించనున్నారు.


ప్రధాని మోదీ నిజామాబాద్ షెడ్యూల్ ఇలా
నిజామాబాద్ జిల్లాలో పర్యటించనున్నారు. వివిధ అభివృద్ధి కార్యక్రమాలకు శంకుస్థాపన, ప్రారంభోత్సవాలలో పాల్గొననున్నారు. మంగళవారం మధ్యాహ్నాం 2:10 నిమిషాలకు.. బీదర్ ఎయిర్‌పోర్ట్‌ చేరుకుంటారు. 2:55 నిమిషాలకు బీదర్ ఎయిర్‌పోర్ట్ నుంచి బయల్దేరి ప్రత్యేక హెలికాప్టర్‌లో నిజామాబాద్‌కు చేరుకుంటారు. 3:00 నుంచి 3:35 గంటల వరకు వివిధ అభివృద్ధి పనులకు శంకుస్థాపన, ప్రారంభోత్సవాలు చేస్తారు. 3:45 నుంచి 4:45 గంటల వరకు బహిరంగ సభలో పాల్గొంటారు. 4:55 గంటలకు నిజామాబాద్ నుంచి బయలుదేరి 5:45 గంటలకు బీదర్ ఎయిర్‌పోర్ట్‌కు చేరుకోకుని అక్కడి నుంచి ఢిల్లీకి తిరుగు ప్రయాణం అవుతారు.


మోదీ ప్రారంబించనున్న అభివృద్ధి కార్యక్రమాల వివరాలు:
రూ. 8,021కోట్ల అభివృద్ధి పనులను మోదీ ప్రజలకు అంకితమిస్తారు. రామగుండంలో నిర్మించిన 8 వందల మెగావాట్ల ఎన్టీపీసీ విద్యుత్ ప్లాంట్‌ను ప్రధాని ప్రారంభిస్తారు. ఈ ప్లాంట్‌లో ఆల్ట్రా సూపర్ క్రిటికల్ సాంకేతికతను ఈ ప్రాజెక్టులో ఉపయోచారు. ఈ ప్రాజెక్టులో బొగ్గు వినియోగం తక్కువ.. విద్యుత్ ఉత్పత్తి ఎక్కువగా ఉంటుంది. రూ.1360 కోట్లతో 496 బస్తీ దావాఖానాలకు, 50 పడకల క్రిటికల్ కేర్ బ్లాక్‌లను మోదీ ప్రారంభిస్తారు. అలాగే ప్రతీ జిల్లాలో నిర్మించే పనులను వర్చువల్‌గా ప్రారంభిస్తారు. రూ. 305 కోట్లతో నిర్మితమైన రైల్వే విద్యుత్ లైన్‌ను ప్రజలకు అంకితం చేస్తారు. అలాగే కొమురవెల్లి దేవస్థానం వద్ద కేంద్రం రైల్వే స్టేషన్ ఏర్పాటు చేయనుంది.