PM Modi Wishes to Telangana People on Medaram Jathara: తెలంగాణ మహా కుంభమేళా మేడారం సమ్మక్క - సారలమ్మ జాతర ప్రారంభోత్సవం సందర్భంగా ప్రధాని మోదీ తెలంగాణ ప్రజలకు శుభాకాంక్షలు తెలిపారు. ఈ మేరకు బుధవారం ఆయన తెలుగులో ట్వీట్ చేశారు. 'గిరిజనుల అతిపెద్ద పండుగల్లో మేడారం జాతర ఒకటి. భక్తి, సంప్రదాయం, సమాజ స్ఫూర్తిల గొప్ప కలయిక ఈ జాతర. సమ్మక్క - సారక్కలకు మనం ప్రణమిల్లుదాం. వారు ప్రదర్శించిన ఐక్యతా స్ఫూర్తి, పరాక్రమాన్ని గుర్తు చేసుకుందాం.' అంటూ ట్వీట్ చేశారు.
మహా జాతర షురూ
ఆసియాలోనే అతిపెద్దదైన వనజాతర బుధవారం నుంచి ప్రారంభం కానుంది. గిరిజనుల ఆరధ్య దైవమైన సమ్మక్క- సారలమ్మ జాతరకు ఊళ్లకు ఊళ్లే కదిలి వెళ్తున్నాయి. రెండేళ్లకోసారి జరిగే జాతర చూసి వనదేవతలను పూజించుకొని మొక్కులు చెల్లించుకునేందుకు జనం వనం బాట పట్టారు. తెలంగాణ నుంచే కాకుండా దేశవ్యాప్తంగా కదలి వస్తున్న భక్తులతో మేడారం పరిసర ప్రాంతాలన్నీ కుంభమేళాను తలపిస్తున్నాయి. నాలుగు రోజుల పాటు జరిగే ఈ వన సంబురానికి అధికారులు సర్వం సిద్ధం చేశారు. జాతర ప్రారంభానికి వారం పది రోజుల ముందు నుంచే భక్తులు మేడారం తరలి వచ్చి తమ మొక్కులు తీర్చుకుంటున్నారు. దీంతో ఇప్పటికే అడవంతా జనంతో నిండిపోయింది.
మహత్తర ఘట్టం
మేడారం జాతర మహత్తర ఘట్టం మంగళవారమే ప్రారంభమైంది. సమ్మక్క భర్త పగిడిద్దరాజు ఆలయంలో పెనుక వంశీయులు, పూజారులు ప్రత్యేక పూజలు చేశారు. పగిడిద్దరాజును పడగ రూపంలో పట్టుకొని మేడారానికి బయల్దేరారు. మహబూబాబాద్ నుంచి 70 కిలోమీటర్ల పయనం తర్వాత ఈ సాయంత్రానికి జంపన్నవాగు వద్దకు చేరుకుంటారు. అక్కడ కొక్కెర వంశీయులు వారికి స్వాగతం పలుకుతారు. పగిడిద్దరాజుకు పట్టువస్త్రాలు సమర్పిస్తారు. ప్రతిగా సమ్మక్కకు పెనుక వంశీయులు చీర, పసుపు, కుంకుమ పెడతారు. రాత్రి 9 గంటలకు పగిడిద్దరాజు సారలమ్మ, గోవిందరాజుతో కలిసి గద్దెలపై కొలువుదీరుతారు.
భరిణి రూపంలో వనదేవత
ములుగు జిల్లా కేంద్రం నుంచి 44 కిలోమీటర్ల దూరంలో ఉన్న తాడ్వాయి మండలంలో ఉందీ మేడారం. ఇది ఒక గిరిజన గ్రామం. గిరిజన సంప్రదాయాన్ని కళ్లకు కట్టనట్టు చూపించే వనజాతరే ఈ మేడారం జాతర. ఇక్కడ ఎలాంటి విగ్రహాలు ఉండవు. చిలకలగుట్ట మీద నుంచి సమ్మక్కను కుంకుమ భరిణి రూపంలో తీసుకొచ్చి గద్దె మీద ప్రతిష్టించి పూజలు చేస్తారు. ఈ గిరిజన దేవలతకు మొక్కులు తీర్చడానికి బెల్లాన్ని సమర్పిస్తారు. దీన్ని బంగారంగా భావిస్తారు.
ఈసారి మేడారం జాతరకు కోటికి పైగా భక్తులు రానున్నట్ల సమాచారం. తెలంగాణ రాష్ట్రమే కాకుండా దేశ నలుమూలలు, వివిధ ప్రాంతాల నుంచి కూడా భక్తులు పెద్ద ఎత్తున తరలి వస్తారు. మేడారం జాతర నేపథ్యంలో ములుగు జిల్లాలో ఫిబ్రవరి 21,22,23,24 ప్రభుత్వ ప్రైవేటు విద్యా సంస్థలతో పాటు ప్రభుత్వ కార్యాలయాలకు కూడా పనిచేయవని ఆదేశాలు జారీ చేశారు. ఫిబ్రవరి 25 ఆదివారం కూడా సెలవు. అయితే, కొన్ని జిల్లాలకు మాత్రమే సెలవులు వర్తించనున్నాయి.
Also Read: High Court Liberality: తెలంగాణ హైకోర్టుకు చిన్నారుల లేఖ- పార్కు స్థలం కబ్జాపై విచారణకు ఆదేశం