PM Modi in Narayanpet: కాంగ్రెస్ పార్టీ యువరాజు ఎన్నికలకు ముందు విద్వేష విషం చిమ్ముతున్నాడని ప్రధాని నరేంద్ర మోదీ అన్నారు. కాంగ్రెస్ యువరాజుకి రాజగురువు మనల్ని రంగు ఆధారంగా విభజిస్తున్నారని విమర్శించారు. శరీర రంగును బట్టి మనం ఆఫ్రికన్లం అని అన్నాడని మోదీ గుర్తు చేశారు. కాంగ్రెస్ కు హిందువులు, హిందువుల పండుగలు అంటే ఇష్టం లేదని.. తాను గుడికి వెళ్తే కూడా దేశ వ్యతిరేకమైన పని అని విమర్శిస్తున్నారని అన్నారు. కాంగ్రెస్‌కు హిందువుల పండుగల పట్ల ఎంతో చులకన భావం ఉంది. యువరాజు గురువు కూడా అయోధ్యలో రామ మందిరం నిర్మించడాన్ని వ్యతిరేకించారు. నారాయణపేటలో తెలంగాణ బీజేపీ నిర్వహించిన భారీ బహిరంగ సభలో ప్రధాని మోదీ పాల్గొని ప్రసంగించారు.


దేశంలో హిందువులను ద్వితీయ శ్రేణి పౌరులుగా మార్చే ప్రయత్నం చేస్తున్నారని అన్నారు. మతపరమైన రిజర్వేషన్లను అంబేడ్కర్ కూడా వ్యతిరేకించిన విషయం కాంగ్రెస్ కు తెలుసని అన్నారు. కులాల పేరిట, మతాల పేరిట దేశాన్ని విభజించాలని కాంగ్రెస్ పార్టీ చూస్తోందని మోదీ ఆరోపించారు. దేశం ఏమైపోయినా కాంగ్రెస్ కు అవసరం లేదని, దానికి రాజకీయ లబ్ధి మాత్రమే కావాలని అన్నారు. మతాల ప్రాతిపదికన రిజర్వేషన్లు ఇస్తే.. మతమార్పిడులు పెరుగుతాయి. 


‘‘మహబూబ్ నగర్ ప్రాంతాన్ని బీఆర్ఎస్, కాంగ్రెస్ నేతలు తమ స్వార్థానికి వాడుకున్నారు. మహబూబ్ ప్రాంతానికి క్రిష్ణా, తుంగభద్ర నదుల ఆశీర్వాదం ఉంది. ఈ జిల్లాకు సాగునీటి ప్రాజెక్టులకు మేం రూ.వేల కోట్లు ఇచ్చినప్పటికీ సద్వినియోగం కాలేదు. ఇప్పటికీ మహబూబ్ నగర్ ప్రజలు ఇతర ప్రాంతాలకు వలసలు పోవాల్సి వస్తోంది. కాంగ్రెస్ దేశ వ్యతిరేక కార్యకలాపాలకు అడ్డుకట్ట వేయడానికి బీజేపీకి ఓటు వేయండి. మహబూబ్ నగర్ నుంచి డీకే అరుణ ఎంపీ అభ్యర్థిగా నిలబడ్డారు. ఆమెకు వేసే ప్రతి ఓటు నన్ను చేరుతుంది’’ అని మోదీ అన్నారు.