PM Modi Live BJP Meeting in Hyderabad: టీఎస్ పీఎస్సీ పేపర్ల లీకేజీతో యువత జీవితాలు నాశనం: ప్రధాని మోదీ
PM Modi Meeting In LB Stadium: బీజేపీ కూడా ప్రచారంలో దూకుడు పెంచేందుకు రెడీ అవుతోంది. ప్రధానమంత్రి నరేంద్ర మోడీ నేడు హైదరాబాద్ రానున్నారు. ఎల్బీ స్టేడియంలో జరిగే బీసీ గర్జన సభలో మాట్లాడనున్నారు.
బీఆర్ఎస్ నేతలకు అహంకారం, వారి అవినీతిని కక్కిస్తామని ప్రధాని మోదీ అన్నారు. రాష్ట్రంలో టెన్త్ పేపర్ లీకేజీ, టీఎస్ పీఎస్సీ నిర్వహించే పరీక్షల పేపర్లు సైతం లీకయ్యాయని, అందుకు బీఆర్ఎస్ చేతకానితనమే కారణమంటూ మండిపడ్డారు. వేల సంఖ్యలో పోస్టులు ఖాళీగా ఉన్నాయి, నిరుద్యోగుల సమస్యలను బీఆర్ఎస్ ప్రభుత్వం గాలికొదిలేసిందన్నారు. అహంకారం ఉన్నవారికి ప్రజలు ఓట్లు వేయరని, కానీ బీఆర్ఎస్ నేతల్లోనూ అలాంటి అహంకారం కనిపిస్తుందన్నారు. అవినీతి ప్రభుత్వాన్ని ఈసారి ఇంటికి పంపడం ఖాయమని, బీఆర్ఎస్ ఓటమి తథ్యమన్నారు. 2019 లోక్ సభ ఎన్నికల్లో తెలంగాణ ప్రజలు అలాంటి అహంకార సీఎంకు మీ ఓటుతో జవాబు ఇచ్చారు. ఇక్కడి నేతలు మోదీని తిడుతూ ఉంటారు. బీఆర్ఎస్, కాంగ్రెస్ వేరు వేరు కాదు. ఒకే నాణేనికి ఉన్న రెండు ముఖాలు అని ప్రజలు గుర్తించాలన్నారు.
దళితులు, పీడితులు, ఆదివాసీలకు ఎప్పుడూ బీజేపీ అండగా ఉంటుందని ప్రధాని నరేంద్ర మోదీ అన్నారు. హైదరాబాద్ ఎల్బీ స్టేడియంలో నిర్వహించి బీసీ గర్జన సభకు మోదీతో పాటు, కిషన్ రెడ్డి, బండి సంజయ్, పవన్ కళ్యాణ్ తదితరులు హాజరయ్యారు. ‘‘అటల్ బిహారీ వాజ్ పేయీ ప్రభుత్వం సమయంలో మేమే ఏపీజే అబ్దుల్ కలాంను రాష్ట్రపతిని చేశాం. జీఎంసీ బాలయోగిని బీజేపీ తొలి దళిత లోక్ సభ స్పీకర్ ను చేసిందని గుర్తు చేశారు. అలాగే తొలి దళిత రాష్ట్రపతిగా కూడా రామ్ నాథ్ కోవింద్‌ను చేసిందని, అలాగే ద్రౌపది ముర్మును రాష్ట్రపతిగా చేసి తొలి ఆదివాసీ వ్యక్తిని దేశాధినేత చేసిన ఘనత బీజేపీకే దక్కుతుందని అన్నారు. తెలంగాణలో ఇప్పుడు బీసీ వ్యక్తి సీఎం కాబోతున్నారు. ఇది మోదీ గ్యారంటీ’’ అన్నారు ప్రధాని మోదీ.
తెలంగాణ రాష్ట్రం ఏర్పాటయ్యాక కేసీఆర్ ప్రభుత్వం అతి పెద్ద మోసం బీసీలకు చేసిందని ప్రధాని మోదీ విమర్శించారు. ఎస్సీ, ఎస్టీలను ఎప్పుడూ కేసీఆర్, బీఆర్ఎస్ ప్రభుత్వం పట్టించుకోలేదని అన్నారు. వారు ఎప్పుడూ తమ కుటుంబం (కేసీఆర్ ఫ్యామిలీ) కోసమే పని చేశారని ఆరోపించారు. కాంగ్రెస్ పార్టీ అనేది బీఆర్ఎస్ పార్టీకి సీ టీమ్ అని అన్నారు. హైదరాబాద్ లోని ఎల్బీ స్టేడియంలో తెలంగాణ బీజేపీ నిర్వహించిన భారీ బహిరంగ సభకు ప్రధాని మోదీ హాజరయ్యారు. ఈ సందర్భంగా కేసీఆర్ పైన, బీఆర్ఎస్, కాంగ్రెస్ పార్టీలపై తీవ్రమైన విమర్శలు చేశారు. వీరు ఏనాడూ బీసీ వ్యక్తిని సీఎం చేయాలని ఆలోచించలేదని అన్నారు.
పదేళ్ల కిందట గుజరాత్ సీఎంగా మోదీ ఎల్బీ స్టేడియానికి వచ్చారని కిషన్ రెడ్డి గుర్తుచేశారు. ఆ సభ తర్వాతే మోదీ ప్రధాని అయ్యారని చెప్పారు. బీఆర్ఎస్, కాంగ్రెస్, ఎంఐఎం అంతా ఒకటేనన్నారు. మన్మోహన్ హయాంలో కేసీఆర్ మంత్రి అయ్యారు. కాంగ్రెస్ హయాంలో టీఆర్ఎస్ నేతలు మంత్రులుగా ఉన్నారని కిషన్ రెడ్డి పేర్కొన్నారు. రాష్ట్రపతి అభ్యర్థిగా ముర్ము వస్తే సీఎం కేసీఆర్ పట్టించుకోలేదు అని కీలక వ్యాఖ్యలుచేశారు.
జల్, జంగిల్, జమీన్ నినాదాలతో కుమురం భీమ్ పోరాడారని, సకల జనులు పోరాడితేనే తెలంగాణ రాష్ట్రం సాకారమైందన్నారు పవన్ కళ్యాణ్. ప్రధాని మోదీ ఎన్నికలను దృష్టిలో పెట్టుకుంటే జమ్మూకాశ్మీర్ కు సంబంధించి ఆర్టికల్ 370 రద్దుచేసే వారు కాదన్నారు. ఎన్నికలే ముఖ్యమని భావిస్తే మహిళా బిల్లు సాకారం చేసేవారు కాదని జనసేనాని వ్యాఖ్యానించారు.
ప్రధాని మోదీ హయాంలో ఉగ్రదాడులు తగ్గిపోయాయని జనసేనాని పవన్ కళ్యాణ్ అన్నారు. ప్రతి భారతీయుడి గుండెల్లో ధైర్యం నింపిన నేత మోదీ అన్నారు. నీళ్లు, నిధులు, నియామకాలు అనేది తెలంగాణ ఉద్యమ నినాదాలని.. కానీ ఆ మూడు నెరవేరాయా లేదా అనేది రాష్ట్రంలో పెద్ద ప్రశ్నగా మిగిలిందన్నారు.
ఎల్బీ స్టేడియంలో నిర్వహిస్తున్న బీసీ ఆత్మగౌరవ సభకు ప్రధాని మోదీ హాజరుకాగా, వేదిక మీద ఆయనతో పాటు బీజేపీ తెలంగాణ అధ్యక్షుడు కిషన్ రెడ్డి, బండి సంజయ్, లక్ష్మణ్, జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ ఉన్నారు.
బీజేపీ నిర్వహిస్తున్న బీసీ ఆత్మగౌరవ సభకు జనసేన అధినేత పవన్ కళ్యాణ్ హాజరయ్యారు. ఓపెన్ టాప్ జీప్ లో ఎల్బీ స్టేడియంలో సభా వేదిక వద్దకు ప్రధాని మోదీ వచ్చారు.
బీసీ గర్జన బహిరంగ సభలో పాల్గొనేందుకు తెలంగాణకు విచ్చేసిన ప్రధాని మోదీ ఎల్బీ స్టేడియానికి చేరుకున్నారు.
బీజేపీ హైకమాండ్ ఏ రాష్ట్రంలో ఎన్నికలు జరిగినా ముఖ్యమంత్రి అభ్యర్థిని ముందుగా ప్రకటించాలనే ఆలోచన చేయదు. ఎన్నికలు అయిపోయిన తర్వాత ఫలితాలను బట్టి నిర్ణయం తీసుకుంటుంది. కానీ ఆ పార్టీ రాజకీయ పరిస్థితులకు అనుగుణంగా .. రాష్ట్రాల వారీగా వ్యూహాలు మార్చుకుంటూ ఉంటుంది. ఈ క్రమంలో తెలంగాణలో విజయం కోసం పక్కాగా ప్రణాళికలు సిద్ధం చేసుకున్న బీజేపీ బీసీ సీఎం నినాదాన్ని తెరపైకి తీసుకు వచ్చింది. అయితే అభ్యర్థి ఎవరు అన్నది స్పష్టత లేదు.
తెలంగాణలో భారతీయ జనతా పార్టీ గెలిస్తే బీసీని సీఎంను చేస్తామని ఇప్పటికే అమిత్ షా ప్రకటించారు. అందుకు బీసీలంతా అత్మగౌరవ సభను ఏర్పాటు చేసి ప్రధాని మోదీని ముఖ్య అతిథిగా ఆహ్వానించారు. ఈ సభకు వస్తున్న ఆయన బీసీలకు చిరకాలం గుర్తుండిపోయే ప్రకటన చేయబోతున్నట్లుగా తెలుస్తోంది. బీసీలకు కొన్ని వరాలు ప్రకటించడంతో పాటు తెలంగాణలో బీజేపీ గెలిస్తే బీసీ సీఎం ఎవరో కూడా ఆయన ప్రకటించే ఉందని బీజేపీ వర్గాలు అంచనా వేస్తున్నాయి.
ప్రధానమంత్రి నరేంద్రమోదీ తెలంగాణలో ఎన్నికల ప్రచారం కోసం మంగళవారం మరోసారి హైదరాబాద్ వస్తున్నారు. ఎల్బీ స్టేడియంలో నిర్వహించనున్న బీసీ ఆత్మగౌరవసభలో పాల్గొననున్నారు.
Background
PM Modi BJP Meeting in Hyderabad: హైదరాబాద్: తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో గెలుపే లక్ష్యంగా పార్టీలు హోరాహోరీగా ప్రచారం చేస్తున్నాయి. విజయం కోసం సర్వశక్తులూ ఒడ్డుతున్నాయి. వ్యూహ, ప్రతివ్యూహాలతో ప్రత్యర్థులపై పైచేయి సాధించేందుకు ప్రయత్నిస్తున్నాయి. అగ్రనేతల పర్యటనలు, ప్రచారాలు హోరెత్తిస్తున్నాయి. హమీలు, మ్యానిఫెస్టోలు, భరోసా, గ్యారెంటీలతో ప్రజల్లోకి వెళ్తున్నారు. గులాబీ పార్టీతో పాటు కాంగ్రెస్ ప్రచారంతో హోరెత్తిస్తున్నారు. ఇప్పటికే కీలక నేతలు నామినేషన్లు దాఖలు చేశారు. బీజేపీ (BJP) కూడా ప్రచారంలో దూకుడు పెంచేందుకు రెడీ అవుతోంది. ప్రధానమంత్రి నరేంద్ర మోడీ నేడు హైదరాబాద్ (Hyderabad) రానున్నారు. ఎల్బీ స్టేడియంలో జరిగే బీసీ గర్జన సభలో మాట్లాడనున్నారు.
బీసీ ముఖ్యమంత్రి అభ్యర్థిని ప్రకటిస్తారా ?
సాయంత్రం 5.30 గంటలకు ఎల్‌బీ స్టేడియంలో ఈ సభ ప్రారంభం కానుంది. దీనికి సంబంధించి బీజేపీ నేతలు ఇప్పటికే ఏర్పాట్లు పూర్తి చేశారు. రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల వేళ బీజేపీ బీసీ ఎజెండాను ఎత్తుకోవడం, బీజేపీ అధికారానికి వస్తే బీసీ నేతను సీఎంను చేస్తామని అమిత్ షా ఇప్పటికే ప్రకటించారు. మరో అడుగు ముందుకేసి బీసీ సీఎం అభ్యర్థి ఎవరనేది ప్రధాని మోడీ ప్రకటిస్తారా అన్నది ఆసక్తికరంగా మారింది. బీసీలతో పాటు ఎస్సీ, ఎస్టీ, ఇతర సామాజిక వర్గాలను ఆకట్టుకునేలా హామీలు ఇచ్చే అవకాశం ఉందని పార్టీలు చెబుతున్నాయి. బీసీ సీఎం అభ్యర్థిని ప్రకటించడం ద్వారా అధికార బీఆర్ఎస్, కాంగ్రెస్ పార్టీలను ఇరకాటంలోకి నెట్టాలని బీజేపీ ప్రణాళికలు సిద్ధం చేసింది. అందులో బాగంగానే బీసీ సీఎం నినాదాన్ని ఎత్తుకుందని ఆ పార్టీ నేతలు చెబుతున్నారు.
బీసీల ఓట్లే లక్ష్యమా ?
ఎవరు సీఎం అవుతారని ముందే ప్రకటించే ఆనవాయితీ కాషాయ పార్టీలో ఎన్నడూ లేదు. తెలంగాణ జనాభాలో 54శాతం ఉన్న బీసీలను ఆకట్టుకునేందుకు సీఎం అభ్యర్థిని ప్రకటిస్తారని పార్టీ నేతలు చెప్తున్నారు. ఉమ్మడి ఏపీలో, తెలంగాణలో ఇప్పటి వరకు బీసీ వర్గానికి చెందిన వారెవరూ ముఖ్యమంత్రి కాలేదని, అందుకే బీసీ ఎజెండా, బీసీ సీఎం నినాదాన్ని ఎత్తుకున్నట్లు తెలుస్తోంది. బీసీ ఎజెండా ద్వారా మంచి ఫలితాలను సాధించవచ్చని బీజేపీ హైకమాండ్ లెక్కలు వేసుకుంటోంది. దక్షిణాది రాష్ట్రాల్లో కీలకంగా మారిన ఎస్సీ రిజర్వేషన్ల వర్గీకరణకు మద్దతుగా ప్రధాని మోడీ ప్రకటన చేసే అవకాశము లేకపోలేదంటున్నారు. తెలంగాణలో బీజేపీ అధికారంలోకి వస్తే ఇక్కడ ఎస్టీల రిజర్వేషన్లను 10–12 శాతానికి పెంచుతామని హామీ ఇవ్వొచ్చని అంటున్నారు. తెలంగాణలో విజయం సాధించి, దక్షిణాదిన సత్తా చాటాలని బీజేపీ భావిస్తోంది.
గంటన్నర పాటు నగరంలో పర్యటన
ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ ఉత్తరప్రదేశ్ లోని ప్రయాగ్‌రాజ్ నుంచి వైమానిక దళ ప్రత్యేక విమానంలో సాయంత్రం 5 గంటలకు బేగంపేట ఎయిర్‌పోర్టులో దిగుతారు. అక్కడి నుంచి రోడ్డుమార్గంలో 5.30 గంటలకు ఎల్‌బీ స్టేడియానికి చేరుకుంటారు. 6.10 గంటల వరకు బహిరంగ సభలో పాల్గొంటారు. 6.30 గంటలకు బేగంపేట ఎయిర్‌పోర్టు నుంచి ప్రత్యేక విమానంలో ఢిల్లీకి తిరుగు ప్రయాణమవుతారు. ప్రధాని మోడీ పర్యటించనున్న ప్రాంతాల్లో పోలీసుల పకడ్బందీ ఏర్పాట్లు చేశారు. రోడ్లను ఇప్పటికే జల్లెడ పట్టేశారు. ఎల్బీ స్టేడియం పోలీసులు భారీగా మోహరించారు.
- - - - - - - - - Advertisement - - - - - - - - -