EX MP Vinod Comments: రాజ్యాంగంలోని ఆర్టికల్ 200 లో సవరణలు చేయాలని కరీంనగర్ మాజీ ఎంపీ, ప్రణాళిక సంఘం వైస్ చైర్మన్ బి వినోద్ అన్నారు. " ఆజ్ సూన్ ఆజ్ పాసిబుల్ " పదాన్ని మార్చేసి " విత్ ఇన్ 30 డేస్ "గా చేయాలన్నారు. ఆయా రాష్ట్రాల అసెంబ్లీ, కౌన్సిల్స్ ఆమోదించిన బిల్లులను ఆయా రాష్ట్రాల గవర్నర్లు నిర్ణీత గడువులోగా క్లియర్ చేసే పరిస్థితి ఉండాలని తెలిపారు. అందుకే ఆర్టికల్ 200లో సవరణలు చేయాలన్నారు. గవర్నర్ల నిర్వాకం వల్ల దేశ వ్యాప్తంగా అనేక రాష్ట్రాల ప్రభుత్వాలు ఇబ్బందులు పడుతున్నాయని తెలిపారు. బీజేపీయేతర ప్రభుత్వాలను గవర్నర్లు ఇక్కట్ల పాలు చేస్తున్నారని ఆరోపించారు. ఈ క్రమంలోనే ఆర్టికల్ 200లో సవరణలు కోరుతూ లా కమిషన్ ఛైర్మన్ రితురాజ్ ఆవస్తికి వినోద్ కుమార్ బుధవారం లేఖ రాశారు. ఈ మేరకు సవరణలు చేస్తూ కేంద్ర ప్రభుత్వానికి సిఫార్సు చేయాలని లేఖలో పేర్కొన్నారు. 






ఆజ్ సూన్ ఆజ్ పాజిబుల్ ను.. విత్ ఇన్ 30 డేస్..


రాజ్యాంగంలోని ఆర్టికల్ 200లో సవరణలు చేయాల్సిన అవసరం ఉందని రాష్ట్ర ప్రణాళిక సంఘం వైస్ ఛైర్మన్ బోయినపల్లి వినోద్ కుమార్ అభిప్రాయ పడ్డారు. ఆర్టికల్ 200లో " ఆజ్ సూన్ ఆజ్ పాసిబుల్ " అనే పదాన్ని గవర్నర్లు తమకు అనుకూలంగా మార్చుకుంటున్నారని, ఆయా రాష్ట్రాల ప్రభుత్వాలు అసెంబ్లీలో కౌన్సిల్లో ఆమోదించి గవర్నర్ లకు క్లియరెన్స్ కోసం పంపితే.. ఈ పదాన్ని ఉపయోగించుకొని నెలల తరబడి బిల్లులను క్లియర్ చేయకుండా గవర్నర్లు పెండింగ్ లో ఉంచుతున్నారని వినోద్ కుమార్ ఆ లేఖలో పేర్కొన్నారు. "ఆజ్ సూన్ ఆజ్ పాసిబుల్ " పదాన్ని మార్చేసి " విత్ ఇన్ 30 డేస్" గా చేయాలని, ఇలా చేయడం వల్ల ఆయా రాష్ట్రాల గవర్నర్లు.. ఆయా రాష్ట్రాల బిల్లులను నిర్ణీత గడువులోగా క్లియర్ చేయడమో, తిరస్కరించడమో, లేదా రాష్ట్రపతికి పంపే పరిస్థితులు ఉంటాయని వినోద్ కుమార్ ఆ లేఖలో వివరించారు.


ఆర్టికల్ 200 లో సవరణలు చేయకుంటే ఆయా రాష్ట్రాల గవర్నర్లు.. ఆయా రాష్ట్రాల ప్రభుత్వాలను ఇబ్బందుల పాల్జేసే ఆస్కారాలు కొనసాగుతూనే ఉంటాయని వినోద్ కుమార్ అన్నారు. రాజ్యాంగం రూపొందిన సందర్భంలో రాజ్యాంగ నిర్మాతలు రాసిన ఆర్టికల్ 200 లో " ఆజ్ సూన్ ఆజ్ పాసిబుల్ " అనే పదాన్ని గవర్నర్లు తమకు అనుకూలంగా మలుచుకుంటారని ఊహించలేకపోయి ఉండవచ్చు అని వినోద్ కుమార్ అన్నారు. గవర్నర్ల పాత్రపై రాజ్యాంగ నిర్మాతలకు అప్పట్లోనే ఏమాత్రం అనుమానాలు వచ్చినా.. ఆర్టికల్ 200లో వేరే రకంగా రాసి ఉండేవారు అని వినోద్ కుమార్ తెలిపారు. ప్రజా స్వామ్యయుతంగా, ప్రజల తీర్పు వల్ల ఏర్పడిన రాష్ట్ర ప్రభుత్వాలను.. రాజకీయంగా నామినేట్ కాబడిన గవర్నర్లు ఇబ్బందుల పాలు చేస్తుండటం దురదృష్టకరమని పేర్కొన్నారు. 


బీజేపీ పాలిత ప్రాంతాలకు సంపూర్ణ సహకారం..


గవర్నర్ వ్యవస్థ వల్ల తెలంగాణ, తమిళనాడు, కేరళ, పశ్చిమ బెంగాల్ సహా దేశవ్యాప్తంగా అనేక రాష్ట్రాల ప్రభుత్వాలు పరిపాలనాపరంగా ఇబ్బందుల పాలు అవుతున్నాయని వినోద్ కుమార్ గుర్తు చేశారు. ఆర్టికల్ 200లో సవరణలు చేస్తే తప్ప ఆయా రాష్ట్రాలలో ప్రభుత్వాలు సాఫీగా పరిపాలన చేసే పరిస్థితులు ఉండవని, గవర్నర్ల బాధ్యతలను, బిల్లుల ఆమోదానికి నిర్ణీత గడువును నిర్దేశించాల్సిన ఆవశ్యకత ఎంతైనా ఉందని వినోద్ కుమార్ అభిప్రాయ పడ్డారు. కేవలం బీజేపీయేతర రాష్ట్ర ప్రభుత్వాలకు మాత్రమే గవర్నర్లు ఇక్కట్ల పాలు చేస్తున్నారని, బీజేపీ పాలిత రాష్ట్రాల ప్రభుత్వాలకు గవర్నర్లు సంపూర్ణ సహకారాన్ని అందిస్తున్నారని తెలిపారు. 


రాష్ట్రంలో వివిధ యూనివర్సిటీల్లో ఖాళీగా ఉన్న 1,062 అసిస్టెంట్ ప్రొఫెసర్ పోస్టుల భర్తీకి కామన్ రిక్రూట్మెంట్ బోర్డు ఏర్పాటు చేసేందుకు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అసెంబ్లీలో బిల్లును ఆమోదించి క్లియరెన్స్ కోసం గవర్నర్ కు పంపగా.. కొన్ని నెలలు గడుస్తున్నా ఆ బిల్లు పెండింగ్ లోనే ఉందని వినోద్ కుమార్ తెలిపారు.గవర్నర్లతో ఇలాంటి పరిస్థితులు దేశంలోని పలు రాష్ట్రాల ప్రభుత్వాలు ఎదుర్కొంటున్నాయని, ఈ పరిస్థితులు పూర్తిగా మారాల్సిన అవసరం ఉందని వినోద్ కుమార్ పేర్కొన్నారు. ఈ నేపథ్యంలో ఆర్టికల్ 200 లో సవరణలు చేస్తూ కేంద్ర ప్రభుత్వానికి సిఫార్సు చేయాలని లా కమిషన్ చైర్మన్ ఆవస్తి కి రాసిన  లేఖలో వినోద్ కుమార్ కోరారు.