Telangana Local Body Elections: హైదరాబాద్: తెలంగాణలో జరగనున్న స్థానిక సంస్థల ఎన్నికల పంచాయతీ సుప్రీంకోర్టుకు చేరింది. బీసీలకు 42 శాతం రిజర్వేషన్లు అమలు చేయాలని తెలంగాణ ప్రభుత్వం అసెంబ్లీలో బిల్లులు పాస్ అయ్యాక, ఉత్తర్వులు సైతం జారీ చేసింది. అయితే తెలంగాణ హైకోర్టు స్థానిక ఎన్నికలపై ఇచ్చిన ఉత్తర్వులను సవాల్ చేస్తూ వంగ గోపాల్‌రెడ్డి సెప్టెంబరు 29న సుప్రీంకోర్టు (Supreme Court)ను ఆశ్రయించారు. ఈ నెల 6న (సోమవారం నాడు) ఈ పిటిషన్‌పై జస్టిస్ విక్రమ్‌నాథ్ నేతృత్వంలోని ధర్మాసనం విచారణ జరపనుంది. సుప్రీంకోర్టు బీసీ రిజర్వేషన్ల పెంపు రిజర్వేషన్ల పరిమితిపై ఏ తీర్పు ఇస్తుందోనని తెలంగాణలోని అన్ని రాజకీయ పార్టీలతో పాటు ప్రజల్లోనూ ఉత్కంఠ నెలకొంది.
బీసీ రిజర్వేషన్లతో లిమిట్ దాటిందని పిటిషన్లు..
మరోవైపు, బీసీ రిజర్వేషన్లపై మాధవరెడ్డి దాఖలు చేసిన మరో పిటిషన్‌పై కూడా తెలంగాణ హైకోర్టు అక్టోబర్ 8వ తేదీన తిరిగి విచారణ చేపట్టనుంది. రిజర్వేషన్ల పరిమితి పెంపు, బీసీ రిజర్వేషన్ల పెంపు అమలుపై తెలంగాణ హైకోర్టు, దేశ సర్వోన్నత న్యాయస్థానం సుప్రీంకోర్టు ఏ తీర్పు ఇస్తాయన్నది తెలంగాణలో స్థానిక సంస్థల ఎన్నికల నామినషన్లకు ముందే ఉత్కంఠ రేపుతోంది. రాష్ట్రంలో స్థానిక సంస్థల ఎన్నికల సన్నాహాలు వేగంగా జరుగుతున్నాయి. రాష్ట్ర ఎన్నికల ప్రధానాధికారి రాణి కుముదిని ఇటీవల ఎంపీటీసీ, జడ్పీటీసీ, గ్రామ పంచాయతీ ఎన్నికల షెడ్యూల్‌ను విడుదల చేశారు.
5 దశల్లో తెలంగాణలో స్థానిక ఎన్నికలు
తెలంగాణలో మొత్తం ఐదు దశల్లో స్థానిక సంస్థ ఎన్నికలు నిర్వహించనున్నారు. మొదటి రెండు దశల్లో ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికలు జరుగుతాయి. అనంతరం మూడు దశల్లో గ్రామ పంచాయతీ ఎన్నికలు నిర్వహించనున్నట్లు రాణి కుముదిని ఇటీవల ప్రకటించింది. బీసీ రిజర్వేషన్లను 42శాతానికి పెంచుతూ తెలంగాణ ప్రభుత్వం ఇచ్చిన జీవో నంబర్ 9 విషయంలో ఏం జరుగుతుందో తెలియాలంటే కొన్ని రోజులు వేచి చూడక తప్పదు. కానీ అక్టోబర్ 9న ఫస్ట్ ఫేజ్ ఎన్నికల నోటిఫికేషన్ రానుంది. ఒకవేళ అప్పటివరకూ కోర్టులు ఎటూ తేల్చకపోతే ఎన్నికలు మరికొంత కాలం వాయిదా పడతాయా అనే చర్చ జరుగుతోంది. కోర్టు తీర్పు తరువాత ప్రభుత్వం దీనిపై తుది నిర్ణయం తీసుకోనుంది.
తమిళనాడు తరహాలో రిజర్వేషన్ల పెంపు..
కాగా, బీసీ నేతలు మంత్రి పొన్నం ప్రభాకర్ నివాసంలో రెండు రోజుల కిందట కీలకంగా సమావేశయ్యారు. బీసీ రిజర్వేషన్లు 42 శాతానికి పెంచడంతో రాజ్యాంగ పరంగా, చట్టపరంగా తలెత్తే సమస్యలపై ఎలా ముందుకు వెళ్లాలనే దానిపై మంత్రులు కొండా సురేఖ, వాకిటి శ్రీహరి, సీనియర్ నేత వి. హనుమంతరావు సహా పలువురు బీసీ ప్రముఖులు సమావేశంలో పాల్గొని చర్చించారు. వ్యవహారం కోర్టుల వరకు వెళ్లడంతో న్యాయపరంగా సవాళ్లను ఎలా ఎదుర్కొవాలి, బీసీలకు 42 శాతం రిజర్వేషన్లు ఎలా అమలు సాధ్యమని చర్చ జరిగింది. తమిళనాడు తరహాలో తెలంగాణలోనూ రిజర్వేషన్ల పెంపు అమలు సాధ్యమని కాంగ్రెస్ బీసీ నేతలు ధీమా వ్యక్తం చేశారు. గవర్నర్ కు పంపిన బిల్లులు మూడు నెలల్లో ఆమోదం పొందకపోతే, వాటిని రాష్ట్ర ప్రభుత్వం చట్టంగా చేసుకునే వీలును గుర్తు చేశారు.