Borabanda Bandi Sanjay Meeting: జూబ్లిహిల్స్ ఎన్నికల ప్రచారంలో భాగంగా బోరబండలో సభ పెట్టాలనుకున్న బండి సంజయ్‌కు పోలీసులు షాక్ ఇచ్చారు. ఆయన సభకు అనుమతి రద్దు చేశారు. షెడ్యూల్ ప్రకారం ఈరోజు సాయంత్రం బోరబండలో మీటింగ్ జరగాల్సి ఉండగా, భద్రతా కారణాలు చెబుతూ పోలీసులు అనుమతిని వెనక్కి తీసుకున్నారు. ఈ నిర్ణయంపై బీజేపీ శ్రేణులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశాయి. “అనుమతి ఇచ్చి తర్వాత రద్దు చేయడమేంటి?” అని వారు ప్రశ్నించారు. ఎట్టి పరిస్థితుల్లోనూ సాయంత్రం బోరబండలో మీటింగ్ జరిపి తీరుతామని బీజేపీ నేతలు స్పష్టం చేశారు. బోరబండ ప్రాంతంలో పోలీసులు భారీగా మోహరించారు. ఏవైనా అవాంఛనీయ ఘటనలు జరగకుండా ప్రత్యేక బందోబస్తు ఏర్పాటు చేసినట్లు తెలుస్తోంది.
బోరబండలో బండి సంజయ్ సభకు పోలీసుల అనుమతి నిరాకరణ
దీనిపై బండి సంజయ్ మండిపడ్డారు. ఈసీ అనుమతి ఇచ్చినా పోలీసులు అనుమతి ఇవ్వకపోవడమేమిటని ఆయన ప్రశ్నించారు. “బోరబండకు నేనొస్తున్నా.. ఎవరు అడ్డుకుంటారో చూస్తా. ఇలాంటి అడ్డంకులు బీజేపీ ఎన్నో సార్లు ఎదుర్కొని పోరాడింది. మళ్లీ కూడా వెనక్కి తగ్గేది లేదు.” అని బండి సంజయ్ ప్రకటించారు. ప్రజా కార్యక్రమాలను అడ్డుకోవడం ప్రజాస్వామ్య సూత్రాలకు విరుద్ధమని ఆయన విమర్శించారు. తెలంగాణలో ప్రజా హక్కుల కోసం బీజేపీ నిరంతరం పోరాడుతుందని, ప్రజల మద్దతుతో పార్టీ మరింత బలపడుతుందని బండి సంజయ్ పేర్కొన్నారు.
తమను అనుమతి అడగలేదని.. అది రిటర్నింగ్ ఆఫీసర్ పరిధిలోని అంశమన్న పోలీసులు
ఈ వివాదంపై పోలీసులు స్పందించారు. తమను ఎవరూ అనుమతి అడగలేదని అది రిటర్నింగ్ అధికారి పరిధిలోకి అంశమన్నారు. కానీ బండి సంజయ్ ఈ వాదనను ఖండించారు. తాము అనుమతి అడిగామని.. అాలగే పోలీసులు తిరస్కరించారని ఆధారాలను విడుదల చేశారు.
బోరబండలో ప్రజా సంకల్ప యాత్ర జరిపి తీరుతామన్న బండి సంజయ్
కాంగ్రెస్ నేతలు మజ్లిస్ భయంతోనే ప్రచారానికి అనుమతి నిరాకరించారని బీజేపీ నేతలు అంటున్నారు. తమ సత్తా ఏమిటో చూపిస్తామని.. అందరూ బోరబండకు రావాలని బండి సంజయ్ పిలుపునిచ్చారు. స్వయంగా కేంద్ర సహాయ మంత్రి హోదాలో ఉన్న ఆయన ఇలా పోలీసులు అనుమతి నిరాకరించినా.. సభకు పిలుపునివ్వడం సంచలనంగా మారుతోంది.