పాము కరిచిందని చెబితే అమ్మానాన్న తిడతారనుకుంది...బయటకు చెబితే మళ్లీ ఆడుకునేందుకు వెళ్లనివ్వరని చిన్నిబుర్ర ఆలోచించింది. అందుకే బాధని భరిస్తూ ఇంటికెళ్లింది కానీ అసలు విషయం చెప్పలేదు. అంతలోనే నోటినుంచి నురగలు వచ్చి చిట్టితల్లి ప్రాణం అనంతవాయువుల్లో కలిసిపోయింది.




అల్లారు ముద్దుగా పెంచుకున్న చిన్నారి కళ్లముందే విగతజీవిగా పడి ఉండండ చూసి ఆ తల్లిదండ్రుల గుండెలు పగిలిపోయాయి. నోటినుంచి నురగలు చూసిన వెటంనే ఆసుపత్రికి తీసుకెళ్లినా ఫలితం లేకపోయింది.




పాల్వంచ పరిధి ఉల్వనూరు పంచాయతీ లక్ష్మీదేవిపల్లికి చెందిన బోడ భాస్కర్, భారతి దంపతులకు పిల్లలు పుట్టకపోవడంతో తమ బంధువుల పాప అఖిలని దత్తత తీసుకున్నారు. ఆర్నెల్ల వయస్సు నుంచే పాపను అల్లారుముద్దుగా పెంచుకుంటున్నారు. ఇప్పుడు ఏడేళ్లు. పుట్టినరోజు వేడుకకోసం అని కోరుకొండ రామవరంలో అమ్మమ్మ ఇంటికి వెళ్లారు. ఇంటి బయట చిన్నారి తన స్నేహితులతో కలిసి ఆడుకుంటున్న సమయంలో అఖిల వేలిపై పాము కాటేసింది. భయపడిన అఖిల వెంటనే ఇంట్లోకి వెళ్లిపోయింది.


కుటుంబ సభ్యులకు చెబితే  కోప్పడతారేమో…పైగా మళ్లీ ఆడుకునేందుకు పంపించరనే భయంతో ఘోరాన్ని దాచిపెట్టింది. ఆ తర్వాత కొద్దిసేపటికే పాప నోటి నురగలు రావడం గమనించిన తల్లిదండ్రులు స్థానిక ఆర్‌ఎంపీ వద్దకు తీసుకెళ్లి ప్రాథమిక చికిత్స చేయించారు. అనంతరం కొత్తగూడెంలోని ఆస్పత్రులకు తీసుకెళ్లినా ఎవరూ చేర్చుకునేందుకు ముందుకురాలేదు. దీంతో అంబులెన్సులో ఖమ్మంలోని ఓ ప్రైవేటు ఆస్పత్రికి తరలించారు. అప్పటికే ఆలస్యం కావడంతో చిన్నారి మృతిచెందింది. సంతానం లేదనే బాధనుంచి తమకి విముక్తి కలిగించి…నట్టింట్లో లక్ష్మీదేవిలా సందడిగా ఉండే అఖిల… విగతజీవిగా పడిఉండడం చూసి తల్లిదండ్రులు గుండెలవిసిపోయేలా విలపిస్తున్నారు.




సాధారణంగా వర్షాకాలం పాములు కాటేసే కాలం. పాము కనిపిస్తే గుండెల్లోదడ మొదలవుతుంది. ఏ మాత్రం అజాగ్రత్తగా ఉన్నా ముప్పు తప్పదు. వ్యవసాయ పనుల్లో బిజీగా ఉండే రైతన్నలు, కూలీలతోపాటు చెట్లు, పొదలు ఉన్న ప్రాంతాల్లో తిరిగే వారు, నివాసం ఉండేవారు అప్రమత్తంగా ఉండకపోతే అంతేసంగతులు. అయితే ప్రతి పామూ విషపూరితమైనది కాకపోయినప్పటికీ శరీరంపై కాటు కనిపిస్తే వెంటనే దవాఖానకు వెళ్లాలి.




.వ్యక్తిని విషపూరితమైన పాము కరిస్తే శరీరమంతా నీలం రంగుగా మారుతుంది. రక్తపోటు తక్కువగా ఉంటే స్పృహ కోల్పోతారు. కరిచిన చోట నొప్పి, వాపు ఉంటుంది. కొందరిలో పొక్కులు, దద్దుర్లు కనిపిస్తాయి. నోటి నుంచి నురగ వస్తుంది. ఆయాసంతో చెమటలు పడితే…సాధారణ స్థాయి కన్నా రెట్టింపు వేగంతో గుండె కొట్టుకుంటుంది. ఈ లక్షణాలు ఉన్నప్పుడు తక్షణమే ఆసుపత్రికి తీసుకెళ్తే ఎటువంటి ప్రాణహాని ఉండదని వైద్యులు చెబుతున్నారు. కానీ ఇక్క చిన్నారి చెబితే ఏమంటారో అనే భయంతో ఆగిపోవడం వల్ల ప్రాణాలు కోల్పోవాల్సి రావడం విషాదకరం.