Grand welcome to Seethakka: ధనసరి అనసూయ అలియాస్ సీతక్క మళ్లీ తన మార్క్ చూపించారు. మంత్రిగా బాధ్యతలు చేపట్టిన ఆమె.. తన డిపార్ట్‌మెంట్‌లోని ఉద్యోగులతో కలిసిపోయారు. తనను ఒక మంత్రిగా కాకుండా సోదరిలా చూడాలంటూ సూచించారు. మంత్రి అయినంత మాత్రాన.. తతను ప్రత్యేకంగా చూడాల్సి అవసరం లేదని... అందరిలో ఒకరిగా భావించాలని చెప్పారు. తమ ముందు పెద్ద టాస్క్ ఉందని... ప్రతి గ్రామంలో రోడ్లు, తాగునీటి సౌకర్యాలకు అత్యంత ప్రాధాన్యత ఇవ్వాలని కోరారు. తొలిసారి సమీక్షా సమావేశానికి వచ్చిన మంత్రి సీతక్కకు ఉద్యోగులు ఘనస్వాగతం పలికారు. తనకు స్వాగతం పలికినందుకు అందరికీ ధన్యవాదాలు తెలిపారు సీతక్క.
తెలంగాణలో పంచాయతీ రాజ్, గ్రామీణ అభివృద్ధి శాఖల మంత్రిగా బాధ్యతలు చేట్టిన తర్వాత... తన శాఖల పరిధిలో సమీక్షలు నిర్వహిస్తున్నారు సీతక్క. తొలిసారి గ్రామీణ ప్రాంతాల్లో తాగునీటి సరఫరా పరిస్థితిని తెలుసుకునేందుకు అధికారులతో రివ్యూ చేశారు. మిషన్ భగీరథ శాఖ కార్యకలాపాలపై చీఫ్ ఇంజనీర్లు, సూపరింటెండింగ్ ఇంజనీర్లతో సమీక్ష నిర్వహించారు. ఈ సమావేశానికి ఐఏఎస్ అధికారిణి, మిషన్ భగీరథ ప్రత్యేక కార్యదర్శి స్మిత సబర్వాల్ కూడా హాజరయ్యారు. సమీక్ష సమావేశం నిర్వహించడానికి అక్కడికి వచ్చిన సీతక్కకు పంచాయతీరాజ్, గ్రామీణ అభివృద్ధి శాఖల అధికారులు ఘనస్వాగతం పలికారు. కరతాళ ధ్వనులతో... ఆమెను ఆహ్వానించారు. తనకు ఘనస్వాగతం పలికిన ఉద్యోగులకు ఆప్యాయంగా పలకరించారు మంత్రి సీతక్క. మహిళా ఉద్యోగుల దగ్గరకు వెళ్లి.. నవ్వుతూ మాట్లాడారు. అందరికీ అభివాదం చూస్తే పరిచయం చేసుకున్నారు. ఈ వీడియోను సీతక్క తన ట్విట్టర్‌లో పోస్టు చేశారు. ఆ వీడియోతో పాటు తన డిపార్ట్‌మెంట్ ఉద్యోగులకు ఒక సందేశం కూడా ఇచ్చారు మినిస్టర్ సీతక్క. తన క్యాబినెట్ డిపార్ట్‌మెంట్ ఉద్యోగులు తనను మంత్రిగా కాకుండా సోదరిలాగా చూడాలని కోరానని చెప్పారు. తమ ముందు పెద్ద పని ఉందని... ప్రతి గ్రామంలో రోడ్లు, తాగునీటి సౌకర్యాలపై అత్యంత ప్రాధాన్యత ఉంచాలని చెప్పారు. తనకు ఘనస్వాగతం పలికిన ఉద్యోగులందరికీ ధన్యవాదాలు తెలుపుతూ ట్విట్టర్‌లో పోస్ట్ పెట్టారు.
పంచాయతీ రాజ్, గ్రామీణ అభివృద్ధి శాఖలపై సమీక్షలు నిర్వహిస్తున్న మంత్రి సీతక్క.. ముందుగా మిషన్ భగీరథపై ఫోకస్ పెట్టారు. మిషన్ భగీరథ ద్వారా మంచి నీటి సరఫరా ఏ విధంగా జరుగుతుంది అన్న అంశాలపై రివ్యూ నిర్వహించారు. మిషన్ భగీరథ శాఖ కార్యకలాపాల గురించి... స్మితా సబర్వాల్ మంత్రి సీతక్కకు వివరించారు. గ్రామీణ ప్రాంతాలలో తాగునీటి సరఫరాలను ప్రతిరోజు పర్యవేక్షించాలని సంబంధిత అధికారులను ఆదేశించారు సీతక్క. ప్రతి గ్రామానికి రోజువారి నీటి సరఫరా జరిగేలా చర్యలు చేపట్టాలన్నారు. వేసవి కాలం రాబోతోంది... ఆ సమయంలోనూ నీటి ఎద్దడి రాకుండా చూడాలని... ముందస్తు జాగ్రత్త చర్యలు చేపట్టాలని ఆదేశించారు. రిజర్వాయర్లు, నదులతోపాటు నీటి వనరుల స్థాయిలను నిరంతరం పర్యవేక్షించాలని ఆమె ఆదేశాలు జారీ చేశారు.
ఇక.. మంత్రి సీతక్కతో ఐఏఎస్ అధికారిణి, మిషన్ భగీరథ ప్రత్యేక కార్యదర్శి స్మిత సబర్వాల్‌తో ప్రత్యేకంగా సమావేశమయ్యారు. కొన్ని ఫైళ్ళపై సీతక్కతో సంతకాలు తీసుకున్నారు. దీంతో సీతక్క నిర్వహిస్తున్న శాఖల్లో స్మితా సబర్వాల్ పోస్టింగ్ ఖరారైందా అన్న చర్చ జరిగింది. అయితే... మిషన్ భగీరథ కోసం తాము ఆమె బృందంలో భాగమైనందుకు గౌరవంగా భావిస్తున్నామంటూ... స్మితా సబర్వాల్ ట్వీట్ చేశారు. మిషన్ భగీరథకు సంబంధించిన అధికారిణిగా మాత్రమే సీతక్కతో సమావేశం అయ్యానని చెప్పారు స్మితా సబర్వాల్. పోస్టింగ్‌కి సంబంధించి ఎలాంటి సిఫార్సు లేదని పరోక్ష సంకేతాలు ఇచ్చారు.