Paddy Procurement Telangana: మేకులు దించారు, తూటాలు పేల్చారు, భాష్ప వాయువు సైతం కేంద్ర ప్రభుత్వం రైతులపై ప్రయోగించిందని తెలంగాణ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ గుర్తుచేశారు. రాష్ట్రంలో పండిన ధాన్యం కేంద్ర ప్రభుత్వం కొనుగోలు చేయకపోతే కొట్లాట తప్పదని మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ (Telangana Minister Puvvada Ajay Kumar) స్పష్టం చేశారు. అన్నదాతల జీవన్మరణ సమస్యగా మారిన ధాన్యం కొనుగోలుకు శాశ్వత పరిష్కారం చూపే లక్ష్యంతో తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్‌ మరో ఉద్యమానికి పూనుకున్నారని తెలిపారు. సోమవారం ఖమ్మం నియోజకవర్గంలోని మంచుకొండ గ్రామంలో జరిగిన రైతు నిరసన దీక్షలో మంత్రి పాల్గొన్నారు.


ఢిల్లీపై దండయాత్రకు కేసీఆర్ రెఢీ  
తెలంగాణ రైతుల ప్రయోజనం కోసం ఢిల్లీపై సీఎం కేసిఆర్ దండయాత్ర (KCR will fight againt Central Govt) చేసేందుకు సిద్ధమయ్యారని.. నాడు తెలంగాణ ఏర్పాటు కోసం ఉద్యమనేతగా సమైక్య రాష్ట్రంలో కర్షకుల ఆత్మహత్యలను కండ్లారా చూసి కేసీఆర్ చలించిపోయారన్నారు. నేడు ఆ దుస్థితి నుంచి బయట పడేసేందుకు అన్ని విధాలా అండగా నిలుస్తున్నారని చెప్పారు. సాగునీటి ప్రాజెక్టులను నిర్మించడమే కాదు, రైతు బంధు, రైతు బీమా, 24గంటల ఉచిత నాణ్యమైన కరెంట్‌ ఎన్నో పథకాలతో ఏడేళ్ల కాలంలోనే తెలంగాణను దేశానికే అన్నం పెట్టే స్థితికి తీసుకొచ్చారని కేసీఆర్‌ను ప్రశంసించారు.


కేంద్రం కక్ష సాధింపు ధోరణి 
ధాన్యం కొనుగోలు విషయంలో కేంద్రం కక్ష సాధింపు ధోరణితో వ్యవహరిస్తున్నదని ఆరోపించారు. బీజేపీ నాయకులు తలా తోకా లేకుండా మాట్లాడుతుండగా, కేంద్రం రోజుకో కొర్రీ పెడుతూ ప్రస్తుత యాసంగి వడ్ల కొనుగోలుపై దాటవేస్తూ వివక్ష చూపుతున్నదన్నారు. దీనిపై తాడోపేడో తేల్చకపోతే అన్నదాతలు మరింత నష్టపోయే ప్రమాదమున్నదని చెప్పారు. ఈ నేపథ్యంలో ముఖ్యమంత్రి కేసీఆర్‌ తీసుకున్న పోరుబాటకు ఉమ్మడి ఖమ్మం జిల్లా రైతులు సీఎం వెంట ఉంటారని మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ స్పష్టం చేశారు. మొత్తం బియ్యాన్ని కొంటామని మొదట్లో చెప్పిన కేంద్ర ప్రభుత్వం ఆపై రాష్ట్రం నుంచి వచ్చే దిగుమతిని చూసి మాట మార్చిందని టీఆర్ఎస్ నేతలు ఆరోపించారు. 


కేంద్రం వరి కొనుగోలు చేయాలని టీఆర్ఎస్ శ్రేణుల పోరుబాట
Telangana Farmers and TRS Leaders Protest:  కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం వరి ధాన్యం కొనుగోలు చేయాలని డిమాండ్ చేస్తూ టీఆర్ఎస్ పోరుబాట చేపట్టింది. నేడు తెలంగాణ రాష్ట్రవ్యాప్తంగా క్షేత్రస్థాయిలో మండల కేంద్రాల్లో రైతులు, టీఆర్ఎస్ నేతలు నిరసన దీక్షలు చేస్తున్నారు. మరోవైపు టీఆర్ఎస్ ఎంపీలో ఢిల్లీలో తమ గళాన్ని వినిపిస్తున్నారు. కేంద్రం దిగొచ్చి.. ధాన్యం కొనుగోలు చేయాలని డిమాండ్ చేస్తున్నారు.


Also Read: Drugs in Hyderabad Pub: పబ్‌లో డ్రగ్స్ - ఇప్పుడే సినిమాల్లో ఎదుగుతున్నాం, బద్నాం చేయవద్దు: జూనియర్ ఆర్టిస్ట్ ఆవేదన


Also Read: Bhadrachalam: భద్రాద్రి రాముడి చుట్టూ రాజకీయ గలాటా, అమిత్‌షా వస్తారా? కేసీఆర్‌ అవి తెస్తారా?