KCR Sand Art : సీఎం కేసీఆర్ జాతీయ రాజకీయాల్లో వెళ్లనున్నట్లు ఇప్పటికే ప్రకటించారు. విజయదశమి రోజున జాతీయ పార్టీ ప్రకటన ఉండబోతుందని టీఆర్ఎస్ వర్గాలు చెబుతున్నాయి. అయితే కేసీఆర్ జాతీయ రాజకీయాల్లోకి రావడాన్ని ఆహ్వానిస్తూ తెలంగాణకు చెందిన టీఆర్ఎస్ నాయకుడు అలిశెట్టి  అర్వింద్ తన అభిమానాన్ని చాటుకున్నారు. కేసీఆర్ కొత్త జాతీయ పార్టీని స్వాగతిస్తూ ఒడిశా రాష్ట్రంలోని పూరీ బీచ్ లో సైకత శిల్పం వేయించారు.  ప్రఖ్యాత ఇసుక కళాకారుడు మానస్ సాహూ ఒడిశాలోని పూరీ బీచ్‌లో కేసీఆర్ సైకత శిల్పం రూపొందించారు. 


దేశ్ కి నేత 
 
ఈ సైకత శిల్పంలో కేసీఆర్ జీ వెలకమ్ టూ నేషనల్ పాలిటిక్స్, దేశ్ కి నేత కిసాన్ కి భరోసా అని రాయించారు. 75 సంవత్సరాల స్వాతంత్ర్య చరిత్రలో కాంగ్రెస్ లేదా బీజేపీ ఆధ్వర్యంలో పాలన సాగిందని, భారత జాతీయ రాజకీయాల్లో ప్రత్యామ్నాయ పార్టీ లేదని టీఆర్ఎస్ యువనేత అలిశెట్టి  అర్వింద్ అన్నారు. తెలంగాణ రాష్ట్ర సాధన ఉద్యమ స్పూర్తితో కేసీఆర్ మళ్లీ నయా భారత్ వైపు అడుగులు వేస్తున్నారన్నారు. భారతదేశాన్ని చైతన్యవంతమైన దేశంగా మార్చడానికి కేసీఆర్ ఉద్యమిస్తున్నారన్నారు.  


జాతీయ రాజకీయాల్లోకి స్వాగతం 


 సీఎం కేసీఆర్‌ ప్రారంభించనున్న జాతీయ పార్టీని ఆహ్వానిస్తూ ఆయన సైకత శిల్పాన్ని ఒడిశా పూరీ తీరంలో ఏర్పాటు చేశారు. టీఆర్ఎస్ నేత అలిశెట్టి అర్వింద్‌ ఆధ్వర్యంలో సైకత శిల్పి సాహు సాండ్ ఆర్ట్ రూపొందించారు. 14 ఏళ్ల పాటు పోరాటం చేసి తెలంగాణ సాధించిన సీఎం కేసీఆర్ తెలంగాణ రాష్ట్రాన్ని దేశానికే మార్గదర్శిగా తీర్చిదిద్దారని అర్వింద్‌ తెలిపారు. ఇదే విధంగా దేశ భవిష్యత్తును మార్చే సత్తా కేసీఆర్ కు ఉందన్నారు.  దేశానికి స్వాతంత్ర్యం వచ్చి 75 ఏళ్లు అవుతున్నా రైతులు, ఇతర వర్గాలు ఇప్పటికీ అనేక సమస్యలతో కొట్టిమిట్టాడుతున్నారని, దానికి బీజేపీ, కాంగ్రెస్  పాలనే కారణమన్నారు. ఈ వైఫల్యాన్ని గుర్తించిన కేసీఆర్‌ జాతీయ పార్టీ ఏర్పాటు చేస్తున్నారని అర్వింద్ అన్నారు. దేశం మొత్తం తెలంగాణ వైపు చూస్తున్న వేళ దేశ గతిని మార్చేందుకు నడుం బిగించిన తమ నాయకుడికి వినూత్న రీతిలో ఆహ్వానం పలికేందుకే సైకత శిల్పాన్ని ఏర్పాటు చేసినట్లు తెలిపారు. 


Also Read : కొత్త జాతీయ పార్టీ పేరుతో కేసిఆర్ వేయబోతున్న స్కెచ్ ఇదేనా?


Also Read : TRS Meeting : దసరా రోజున మీటింగ్ యథాతాథం - ఏ మార్పు లేదన్న టీఆర్ఎస్ !