సైబరాబాద్ పోలీస్ కమీషనరేట్‌లోని పోలీస్ పరేడ్ గ్రౌండులో 5th యాన్యువల్ స్పోర్ట్స్ అండ్ గేమ్స్ మీట్-2023 ముగింపు వేడుకలు ఘనంగా జరిగాయి. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా  రాష్ట్ర హోంశాఖ ప్రిన్సిపల్ సెక్రెటరీ డా. జితేందర్ ఐపీఎస్ హాజరయ్యారు. సీపీ స్టీఫెన్ రవీంద్ర, జాయింట్ సీపీలు అవినాష్ మహంతి, నారాయణ నాయక్, డీసీపీలు, సిబ్బంది ఉత్సాహంగా పాల్గొన్నారు. బెలూన్లు పావురాలను ఎగరేసి కార్యక్రమాన్ని ఘనంగా ప్రారంభించారు. అనంతరం వివిధ జోన్ల నుంచి వచ్చిన పోలీస్ క్రీడాకారుల గౌరవ వందనాన్ని స్వీకరించారు.


మూడు రోజుల పాటు జరిగిన ఈ క్రీడల్లో పోలీసు సిబ్బంది ఉత్సాహంగా పాల్గొన్నారు. ఈ క్రీడల్లో 9 టీంలు పార్టిసిపేట్ చేశాయి. మాదాపూర్ జోన్, బాలానగర్ జోన్, శంషాబాద్ జోన్, రాజేంద్రనగర్ జోన్, మేడ్చల్ జోన్, సీఏఆర్ హెడ్ క్వార్టర్స్, ట్రాఫిక్ వింగ్, క్రైమ్ వింగ్, మినిస్టీరియల్ స్టాఫ్ పాల్గొన్నారు. పోలీస్ సిబ్బందికి కబడ్డీ, వాలీబాల్, బాస్కెట్ బాల్, ఫుట్ బాల్, టగ్ ఆఫ్ వార్, అథ్లెటిక్స్, క్యారమ్స్, చెస్, బ్యాడ్మింటన్, టెన్నిస్ తదితర పోటీలు నిర్వహించారు. మహిళల విభాగంలో సీఏఆర్ హెడ్ క్వార్టర్స్ Vs రాజేంద్రనగర్ జోన్ మధ్య జరిగిన టగ్ ఆఫ్ వార్ పోటీల్లో సీఏఆర్ హెడ్ క్వార్టర్స్ మహిళల పోలీస్ టీమ్ విన్ అయింది.


అలాగే  పురుషుల విభాగంలో సీఏఆర్ హెడ్ క్వార్టర్స్ Vs ట్రాఫిక్ వింగ్ కు నిర్వహించిన టగ్ ఆఫ్ వార్ పోటీల్లో సీఏఆర్ హెడ్ క్వార్టర్స్ టీమ్ విన్నర్ గా నిలిచింది. బాస్కెట్ బాల్ లో సైబరాబాద్ ట్రాఫిక్ పోలీస్ గెలిచింది. ఫుట్ బాల్ మ్యాచ్ లో క్రైమ్ వింగ్ విన్నర్ గా నిలిచింది. మెన్స్ కబడ్డీ మ్యాచ్ లో ట్రాఫిక్ పోలీస్ విజేతగా నిలిచింది.. ఉమెన్స్ కబడ్డీ మ్యాచ్ లో సీఏఆర్ హెడ్ క్వార్టర్స్ ట్రోఫీ గెలుచుకుంది.


సైబరాబాద్ యాన్యువల్ స్పోర్ట్స్ అండ్ గేమ్స్ మీట్– 2023లో పాల్గొనడం సంతోషంగా ఉందన్నారు హోంశాఖ ప్రిన్సిపల్ సెక్రెటరీ డా. జితేందర్. శాంతి భద్రతల పరిరక్షణలో నిరంతరం శ్రమిస్తున్న పోలీసులను ఆయన అభినందించారు. క్రీడలతో ఫిట్‌నెస్‌ ఉంటుందని, క్రీడల్లో గెలుపు కంటే పాల్గొనడం ముఖ్యమన్నారు. కష్టపడితేనే క్రీడల్లోనైనా, ఏ వృత్తిలోనైనా రాణిస్తామన్నారు. పోలీసులు విధుల్లో ఒత్తిడి నుంచి బయటపడడానికి క్రీడలు తోడ్పడతాయని అన్నారు. పోలీసుల శారీరక దృఢత్వాన్ని కాపాడుకోవడానికి స్పోర్ట్స్‌ దోహదపడతాయన్నారు. తెలంగాణ పోలీసు సిబ్బంది ఎన్నో ప్రతిష్టాత్మకమైన అవార్డులు అందుకున్నారన్నారు. మారుతున్న టెక్నాలజీ కి అనుగుణంగా నేరాలు కూడా పెరుగుతున్నాయని తెలిపారు. వీటిని కట్టడి చేయడానికి TSPCC, PSIOC సెంటర్లను ఏర్పాటు చేసిన సీపీని ఆయన అభినందించారు.


సైబరాబాద్‌లో యాన్యువల్ స్పోర్ట్స్ అండ్ గేమ్స్ మీట్ ఏర్పాటు చేయడం వరుసగా ఇది 5వ సారి అన్నారు సీపీ స్టీఫెన్ రవీంద్ర. క్రీడలు నాయకత్వ లక్షణాలను తట్టిలేపడంతో పాటు టీమ్ స్పిరిట్, ఐకమత్యాన్నిపెంచుతాయన్నారు. ఇలాంటి స్పోర్ట్స్ మీట్ ప్రతీ సంవత్సరం జరపాలన్నారు. పోలీసులు శాంతిభద్రతల పరిరక్షణలో నిత్యం బిజీగా ఉన్నప్పటికీ  సిబ్బంది క్రీడల్లో పాల్గొనడం వారిలో నూతనోత్సాహాన్ని నింపుతుందన్నారు సీపీ స్టీఫెన్ రవీంద్ర. పోలీసులు విధుల్లో ఒత్తిడి నుంచి బయటపడడానికి, శారీరక దృఢత్వానికీ క్రీడలు తోడ్పడతాయన్నారు. వ్యాయామాన్ని నిత్య జీవితంలోనూ భాగం చేసుకోవాలన్నారు. రోజులో కొంత సమయాన్ని వ్యాయామం, యోగా కోసం కేటాయించుకోవాలన సూచించారు. వీలున్నప్పుడు కుటుంబ సభ్యులతో సమయాన్ని గడపాలన్నారు సీపీ స్టీఫెన్ రవీంద్ర.