హైదరాబాద్: తెలంగాణలో టెన్త్ బోర్డ్ ఎగ్జామ్స్ జరుగుతున్న సమయంలో వచ్చే ఏడాది నుంచి వీటిని రద్దు చేస్తారని సోషల్ మీడియాలో ప్రచారం జరిగింది. తెలంగాణలో సెకండరీ స్కూల్ సర్టిఫికేట్ (SSC) పరీక్షలను రద్దు చేస్తున్నారనే వదంతులపై తెలంగాణ విద్యా కమిషన్ (TEC) క్లారిటీ ఇచ్చింది. ప్రభుత్వ పరిశీలనలో అటువంటి ప్రతిపాదనేదీ లేదని TEC సభ్యుడు ప్రొఫెసర్ విశ్వేశ్వర్ రావు పేర్కొన్నారు. 

వదంతులకు కారణం ఇదే

తెలంగాణ విద్యా విధానం 2026 (Education Policy for Telangana 2026) విధాన పత్రాన్ని విడుదల చేసిన తర్వాత తెలంగాణలో SSC పరీక్షల రద్దుపై పుకార్లు మొదలయ్యాయి. ఆ డాక్యుమెంట్‌లో ఎస్‌ఎస్‌సి బోర్డును ఇంటర్మీడియట్ బోర్డు (BIE)తో విలీనం చేయడం వంటి సంస్కరణలను సూచించారు. పదో తరగతి బోర్డు పరీక్షలను రద్దు చేయాలని ఎక్కడా సూచించలేదు. అయితే, కొన్ని ప్రైవేట్ స్కూల్స్ 11, 12 తరగతులను స్కూల్లో మొదలుపెట్టాయి. దాంతో టెన్త్ బోర్డ్ ఎగ్జామ్స్ రద్దు అని వదంతులు త్వరగా వ్యాపించాయి.

తెలంగాణ రాష్ట్రంలో మార్చి 14న ప్రారంభమైన  పదో తరగతి బోర్డు పరీక్షలు  ఏప్రిల్ 16 వరకు జరగనున్నాయి. ఈ పరీక్షలను ప్రభుత్వం 6 పేపర్ల విధానంలో నిర్వహిస్తోంది. ప్రతి రోజూ ఉదయం 9:30 గంటల నుండి మధ్యాహ్నం 12:30 గంటల వరకు (3 గంటల పాటు) పరీక్షలు జరుగుతాయి. రాష్ట్రవ్యాప్తంగా ఏర్పాటు చేసిన 2,676 ఎగ్జామ్ సెంటర్లలో సుమారు 5,28,239 మంది విద్యార్థులు ఈ పరీక్షలకు హాజరుకానున్నారు. నిబంధనల విషయానికి వస్తే, విద్యార్థులకు కేవలం 5 నిమిషాల ఆలస్య అనుమతి మాత్రమే ఉంటుంది. పరీక్షలు ముగిసిన అనంతరం, ఫలితాలను ఏప్రిల్ చివరి వారం లేదా మే 2026లో విడుదల చేసే అవకాశం ఉంది.

తెలంగాణ విద్యా సంస్కరణలపై సీఎం రేవంత్ రెడ్డి 

తెలంగాణ విద్యావ్యవస్థలో సమూల మార్పులు తీసుకురావాల్సిన అవసరం ఉందని సీఎం రేవంత్ రెడ్డి ఇటీవల స్పష్టం చేశారు. రాష్ట్ర విద్యా రంగాన్ని అంతర్జాతీయ ప్రమాణాలకు అనుగుణంగా తీర్చిదిద్దడమే ప్రభుత్వ ప్రధాన లక్ష్యమని ఆయన ప్రకటించారు.

జాతీయ విద్యా విధానానికి (NEP) అనుగుణంగా రాష్ట్రంలో ప్లస్ టూ (+2) విద్యా విధానాన్ని మరింత పటిష్టం చేయాలని ప్రభుత్వం యోచిస్తోంది. విద్యా సంస్కరణలపై నియమించిన కమిటీ ప్రస్తుతం అధ్యయనం చేస్తోందని, వారు సమర్పించేది ప్రాథమిక నివేదిక మాత్రమేనని, అది తుది నిర్ణయం కాదని సీఎం రేవంత్ రెడ్డి వివరించారు.

పదో తరగతి పరీక్షలపై మార్పు లేదు

ప్రస్తుతం పదో తరగతి బోర్డు పరీక్షల రద్దుపై ప్రభుత్వం ఎటువంటి అధికారిక ఉత్తర్వులు (GO) జారీ చేయలేదు. విద్యాశాఖ కమిషన్ ఇచ్చే సిఫార్సులను క్షుణ్ణంగా పరిశీలించిన తర్వాతే ప్రభుత్వం తుది నిర్ణయం తీసుకుంటుంది. తెలంగాణలో టెన్త్ పరీక్షల రద్దుపై వస్తున్న పుకార్లను నమ్మవద్దని, విద్యార్థులు తమ ప్రిపరేషన్‌ను యథావిధిగా కొనసాగించాలని సూచించారు.