MS Dhoni: భారత మాజీ కెప్టెన్, చెన్నై సూపర్ కింగ్స్ క్రౌడ్ పుల్లర్ ఎంఎస్ ధోనీ గురించి ఎంత తక్కువ చెప్పినా తక్కువే. తన ప్రజెన్సే ఆడియెన్స్ ను మైమరింపచేస్తుందనడంలో ఎలాంటి సందేహం లేదు. అయితే గత సీజన్ నుంచి ధోనీ నుంచి బ్యాటింగ్ మెరుపులు ఆశించిన వాళ్లకు కాస్త నిరాశే ఎదురైంది. తను చివర్లో బ్యాటింగ్ కు రావడం చాలామంది అభిమానులకు మింగుడుపడలేదు. ఒక్కోసారి ఎనిమిది, తొమ్మిదో స్థానాల్లో కూడా బ్యాటింగ్ కు వచ్చాడు. అయితే తన వయసు రిత్యా బ్యాటింగ్ లో లేట్ గా బరిలోకి దింపాలని జట్టు వ్యూహంగా తెలుస్తోంది. అయితే గతేడాది బ్యాటింగ్ ఆర్డర్ విఫలం కావడం వల్ల చాలా ఎర్లీగానే తను బ్యాటింగ్ చేసిన సందర్భాలు ఉన్నాయి. అయితే ఈ సీజన్ లో తనను ఇంపాక్ట్ ప్లేయర్ గా ఆడించాలనే ఆలోచనను కొట్టి పారేస్తున్నారు విశ్లేషకులు.
ఎంతో కీలకం..
ఐపీఎల్లో ఐదు కప్పులు సాధించి దిగ్గజ కెప్టెన్ గా ధోనీ నిలిచాడు. ముంబై ఇండియన్స్ దిగ్గజ కెప్టెన్ రోహిత్ శర్మ తప్పించి ఈ ఘనతను మరెవరు సాధించలేదు. ఇక బ్యాటింగ్ లో చివర్లో కామియోలు ఆడటంతోపాటు పూర్తి స్థాయిలో ధోనీ మైదానంలో కీపింగ్ చేయాలని నిపుణులు సూచిస్తున్నారు. ముఖ్యంగా కొత్త కెప్టెన్ రుతురాజ్ గైక్వాడ్ ను గైడ్ చేయడంలో ధోనీ అనుభవం చాలా అక్కరకు వస్తుందని, అలాగే కొత్త బౌలర్లను ట్రెయిన్ చేయడంలో ధోనీది అందె వేసిన చేయి కావడంతో తన ఎక్స్ పీరియన్స్ చాలా ఉపకరిస్తుందని దిగ్గజ ఆల్ రౌండర్ అశ్విన్ అంటున్నాడు. మైదానంలో 20 ఓవర్లపాటు ధోనీ అందుబాటులో ఉంటే, అది ఫీల్డింగ్ కెప్టెన్ కు ఎంతో లాభమని చెప్పుకొచ్చాడు. జట్టును అద్భుతంగా నడపగలడని, కెప్టెన్ కు విలువైన సలహాలు ఇవ్వగలడని తను తెలిపాడు.
అలా అయితే అక్కర్లేదు..
ధోనీని ఇంపాక్ట్ ప్లేయర్ గా ఆడించాలనే ఆలోచనను పక్కన పెట్టాలని అశ్విన్ కుండబద్దలు కొట్టినట్లు చెప్పాడు. మైదానంలో తను ఉండటం ఎంతో ముఖ్యమని తెలిపాడు. గతేడాది సీఎస్కే తరపునే అశ్విన్ ఆడాడు. జట్టుతోపాటు ధోనీ ఉంటే అది వెయ్యి ఎనుగుల బలంలాంటిదని చెప్పుకొచ్చాడు. ఇక ధోనీలాంటి ప్లేయర్ పూర్తి స్థాయిలో ఫిట్ గా ఉంటేనే ఆడతారని, లేకపోతే బరిలోకి దిగరని చెప్పుకొచ్చాడు. మరోవైపు 44 ఏళ్ల వయసులో ఇంకా ఐపీఎల్ ఆడుతున్న ధోనీపై విమర్శలు వస్తున్నప్పటికీ, వాటిని తను ఖాతరు చేయడం లేదు. తన ఫోకస్ అంతా ఆటపైనే ఉందని, ఈ సీజన్ కు తను సిద్ధంగా ఉన్నట్లు పేర్కొన్నాడు. ఇక ఈనెల 30న గువాహటిలో రాజస్థాన్ రాయల్స్ తో జరిగే మ్యాచ్ లో చెన్నై తమ తొలి మ్యాచ్ ను ఆడనుంది.
