Kaleshwaram Project Enquiry: తెలంగాణలోని కాళేశ్వరం ఎత్తిపోతల ప్రాజెక్ట్‌కు సంబంధించిన వివాదం తెలుగు రాష్ట్ర రాజకీయాల్లో సంచలనంగా మారింది. నిబంధనలకు విరుద్ధంగా ప్రాజెక్టు నిర్మాణం జరిగిందన్న ఆరోపణలపై మాజీ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్‌రావు (కేసీఆర్)ను విచారిస్తున్నారు. ఈ ఆరోపణలపై ఏర్పాటైన జస్టిస్ పీసీ ఘోష్ కమిషన్ ముందు ఆయన హాజరయ్యారు. హైదరాబాద్‌లోని బీఆర్‌కే భవన్‌లో విచారణ సాగుతోంది.
ఇది తెలంగాణ గతిని మార్చిన ప్రాజెక్టుగా బీఆర్‌ఎస్ చెబుతుంటే దీన్ని కేసీఆర్ ఫ్యామిలీ మెంబర్స్ ఎంటీఎంలా మార‌్చుకున్నారని కాంగ్రెస్ ఆరోపిస్తోంది. ఇలా రాష్ట్ర రైతులకు నీరు అందించేందుకు రూపొందిన ఒక పెద్ద ప్రాజెక్టు నుంచి ఆర్థిక ఇబ్బందులు, నిర్మాణ లోపాల వరకు ఈ వివాదం విస్తరించి ఉంది.
కాళేశ్వరం ప్రాజెక్టు ఎందుకు?కాళేశ్వరం ఎత్తిపోతల ప్రాజెక్టును 2016లో తెలంగాణ ప్రభుత్వం స్టార్ట్ చేసింది. గోదావరి నది నీటిని ఎత్తిపోతల ద్వారా తెలంగాణలోని లక్షల ఎకరాల సాగు భూములకు అందించాలని సంకల్పించింది. ఈ ప్రాజెక్టులో భాగంగా మేడిగడ్డ, అన్నారం, సుందిళ్లలో బ్యారేజీలు నిర్మించారు. కరవు బాధిత ప్రాంతాల్లో నీటి సమస్యకు శాశ్వత పరిష్కారం చూపించే లక్ష్యంతో వీటి నిర్మాణం చేపట్టారు. రూ. 80,000 కోట్ల డీపీఆర్‌తో మొదలైన ప్రాజెక్టు ఖర్చు చివరకు రూ. 1.27 లక్షల కోట్లకు చేరుకుంది.
వివాదం ఎప్పుడు మొదలైంది?అప్పటి వరకు ఖర్చు, ఇతర అంశాలపై మాత్రమే తరచూ విమర్శలు వినిపించేవి. కానీ 2023లో కాళేశ్వరం ప్రాజెక్టు అంశం కొత్త మలుపు తిరిగింది. మేడిగడ్డ బ్యారేజీలో ఐదు పిల్లర్‌లు కుంగిపోవడ సంచలనంగా మారింది. నీటిని నిల్వ చేసేందుకు ముఖ్యమై బ్యారేజీలోని పిల్లర్లకు బీటలు రావడం ఆందర్నీ ఆశ్చర్యానికి గురి చేసింది.
నిర్మాణ, ఆర్థిక నిర్వహణ లోపాలు కారణంగానే మేడిగడ్డ బ్యారేజీ కుంగిపోయిందని ప్రభుత్వం ప్రకటించింది. అసలు కాళేశ్వరం ప్రాజెక్టు కేవలం కాసుల కోసం నిర్మించరాని ఆరోపిస్తూ వచ్చింది. కేవలం మేడిగడ్డలోనే కాకుండా అన్నారం, సుందిళ్ల బ్యారేజీల్లో లీకేజీలు గుర్తించినట్టు ప్రభుత్వం ప్రకటించింది. జరుగుతున్న పరిణామాలు మొత్తం ప్రాజెక్టు రక్షణపై సందేహాలు పెంచింది.
ప్రాజెక్టు భద్రత, జరిగిన లోపాలు, అక్రమాలు వెలికి తీసేందుకు 2023లోనే తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. జస్టిస్ పీసీ ఘోష్ కమిషన్‌ను ఏర్పాటు చేసింది. ప్రాజెక్టు నిర్మాణంలో జరిగిన తప్పులపై దర్యాప్తు ప్రారంభించాలని కమిషన్‌కు గడవు విధించింది. నిజాలు నిగ్గుతేల్చేందుకు బాధ్యత తీసుకున్న గోష్ కమిషన్ అధికారులు, ఇంజినీర్‌లు, మాజీ మంత్రులను విచారించింది. ఇప్పుడు కేసీఆర్‌ను విచారిస్తోంది.
జరిగిన నష్టాలు ఏంటి?కాళేశ్వరం ప్రాజెక్టుతో జరిగిన నష్టం అంతా ఇంతా కాదని ప్రభుత్వం తరచూ ఆరోపిస్తోంది. మేడిగడ్డ బ్యారేజీ పిల్లర్‌ల కుంగిపోవడం, అనుకున్నట్టుగా లక్షల ఎకరాల నీరు అందకపోవడం, ఏటా ప్రభుత్వ ఖజానాపై భారం. ిలా చాలా అంశాలను తెరపైకి తీసుకొస్తోంది. లీకేజీలు కారణంగా నీరు కూడా వృథా అవుతోందని చెబుతున్నారు. ప్రాజెక్టు ఖర్చు రూ. 1.27 లక్షల కోట్లకు చేరడం, అదనంగా రూ. 47,000 కోట్ల రుణం తీసుకోవడం లాంటి విధానాలతో ఆర్థిక భారాన్ని పెంచిందని చెబుతున్నారు.
కేసీఆర్‌ను ఎందుకు విచారిస్తున్నట్టు?కేసీఆర్‌ను విచారణకు పిలవడానికి చాలా కారణాలు ఉన్నాయని అధికారులు చెబుతున్నారు. ఈ ప్రాజెక్టును కేసీఆర్ తన హయాంలో నిర్మించారు. రైతులకు నీరు అందించే "జీవనాడి"గా పేర్కొన్నారు. నిర్మాణంలో జరిగిన తప్పులు, ఆర్థిక నిర్వహణలో అవకతవకలు దాచి పెట్టడంలో ఆయన పాత్రపై సందేహాలు వ్యక్తం చేస్తోంది ప్రభుత్వం. అందుకే కమిషన్ ఆయన నుంచి ఈ ప్రాజెక్టు గురించి కీలకాంశాలు రాబట్టే ప్రయత్నం చేస్తోంది. నిర్ణయాలు, ఆర్థిక ఖర్చులు, నిర్మాణ ప్రక్రియపై ప్రశ్నిస్తున్నారు. ఇప్పటికే మాజీ మంత్రి హరీశ్ రావు, ఈటల రాజేందర్ వంటి వారిని విచారించింది. అధికారులు, మాజీ మంత్రులు చెప్పిన వివరాలు ప్రకారం కేసీఆర్‌పై దృష్టి పెట్టారు.
ఈ విచారణ రాజకీయం ప్రకంపనలు సృష్టిస్తోంది. ఇదో కక్షపూరిత చర్యగా బీఆర్‌ఎస్ విమర్శిస్తోంది. కాళేశ్వరం రైతులకు ఇచ్చిన వరంంగా చెబుతోంది. హరీశ్ రావు ఇటీవల ఒక పవర్‌పాయింట్ ప్రజెంటేషన్‌లో ఈ ప్రాజెక్టు రైతులకు ఎలా ఉపయోగపడిందో తెలిపారు. కాంగ్రెస్ ప్రభుత్వం మాత్రం ఈ ప్రాజెక్టును విఫలమైనట్టు చెబుతోంది. దీనికి కేసీఆర్, హరీశ్ రావును బాధ్యులుగా చేస్తోంది. నిర్మాణ లోపాలు, ఆర్థిక నష్టాలు ఈ వాదనలను సవాలు చేస్తున్నాయి. ఈ విచారణ రాజకీయ పోట్లాటలకు కారణమవుతోంది, ఎందుకంటే బీఆర్‌ఎస్ ఈ రోజు హైదరాబాద్‌లో బలప్రదర్శన చేయాలని నిర్ణయించింది.