Vivek Venkatswamy vs Prem Sagar Rao | రాష్ట్ర మంత్రి అంటే రాష్ట్రంలో ఎక్కడికైనా వెళ్లిరావచ్చు.. కానీ, ఓ మంత్రి మాత్రం తన సొంత పార్టీ ఎమ్మెల్యే నియోజకవర్గంలో మాత్రం కాలు పెట్టలేకపోతున్నారు. కాదు.. కాదు.. కాలు పెట్టనివ్వడం లేదు. మంత్రి మా నియోజకవర్గంలోకి రావొద్దంటూ సొంత పార్టీ నేతలే హెచ్చరించడంతో మంత్రి అటువైపు కనీసం కన్నెత్తి కూడా చూడటం లేదు. ఇటీవలే కొత్తగా మంత్రి వర్గంలోకి వచ్చిన చెన్నూర్ ఎమ్మెల్యే గడ్డం వివేక్ వెంకట్‌స్వామికి సొంత పార్టీ కాంగ్రెస్‌లో, పైగా సొంత జిల్లాలోనే తలనొప్పులు తప్పడం లేదు.
మంత్రి పదవి రాలేదని ప్రేమ్ సాగర్ రావు ఫైర్
ఎన్నికల వరకు వేరే పార్టీలో ఉన్న వివేక్ వెంకట్ స్వామి ఎన్నికల ముందే కాంగ్రెస్ పార్టీలోకి చేరారు. ఆయన వచ్చీ రావడంతోనే తనకు, తన అన్న వినోద్ కు టిక్కెట్టు సాధించుకున్నారు. అంతేకాకుండా, తన కొడుకు వంశీకి సైతం పెద్దపల్లి ఎంపీ టిక్కెట్టు సాధించారు. ఎన్నికల్లో ఎమ్మెల్యే, ఎంపీలుగా తండ్రీకొడుకు గెలుపొందారు. ఇదంతా ఒక్కెత్తు కాగా, మరో బంపర్ ఆఫర్ కొట్టేశారు. కొద్ది రోజుల కిందట జరిగిన మంత్రి వర్గ విస్తరణలో మంత్రి కూడా అయ్యారు. అయితే, ఇన్ని రోజులు ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో మంత్రి పదవిపై ఆశపెట్టుకున్న మంచిర్యాల ఎమ్మెల్యే కొక్కిరాల ప్రేంసాగర్ రావ్ అగ్గి మీద గుగ్గిలం అయ్యారు. తాను ఎన్నో ఏండ్లుగా పార్టీని పట్టుకుని ఉంటున్నానని, బీఆర్ఎస్ ప్రభుత్వం హయాంలో సైతం ఆయన పార్టీనే అంటిపెట్టుకుని ఉన్నానని, తనపై ఎన్నో కేసులు కూడా నమోదు అయినా, వాటన్నింటిని ఎదుర్కొని కాంగ్రెస్ పార్టీని పటిష్టం చేశానని ప్రేంసాగర్ రావ్ స్పష్టం చేశారు.
వివేక్ కు పదవి ఎలా ఇచ్చారని అధిష్టానానికే ప్రశ్నలు
ఉమ్మడి ఆదిలాబాద్ లో నిర్వహించిన భట్టి విక్రమార్క పీపుల్స్ మార్చ్ పాదయాత్ర, ఎఐసిసి అధ్యక్షులు మల్లికార్జున ఖర్గే బహిరంగ సభను సైతం విజయవంతం చేయడంలో ప్రేమ్ సాగర్ రావ్ కీలకపాత్ర పోషించారు. కాంగ్రెస్ అధిష్టానం ఏం ఆలోచించిదో ఏమో కానీ... ప్రేమ్ సాగర్ రావ్ ను కాదని వివేక్ కు మంత్రి పదవి కట్టబెట్టింది. దీంతో అటు ప్రేం సాగర్ రావ్, ఆయన అనుచరవర్గం ఇప్పుడు వివేక్ అంటే మండి పడుతున్నారు. తాము ఎన్నో ఏండ్లుగా కష్టపడి పార్టీని కాపాడుకుంటూ వస్తే కేసులకు భయపడకుండా, ఒత్తిళ్లకు తలొగ్గకుండా కాంగ్రెస్ పార్టీలోనే ఉంటే.. అన్ని పార్టీలు తిరిగి వచ్చిన వివేక్ ను మంత్రి చేయడం ఏమిటని ప్రశ్నిస్తున్నారు.
ఇటీవల హైదరాబాద్ లో ఎమ్మెల్యే ప్రేంసాగర్ రావ్ ఏఐసీసీ జాతీయ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గేను కలిసి మంత్రి పదవి గురించి నిలదీశారు. పార్టీ కోసం కష్టపడ్డది తామైతే ఫలితం దక్కింది మరొకరికి అంటూ ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. దీంతో ఆయనకు చీఫ్ విప్ పదవి ఇవ్వాలని అధిష్టానం భావించింది కానీ ఆ ఆఫర్ ను ప్రేమ్ సాగర్ రావ్ తిరస్కరించారు. తనకు మంత్రి పదవి తప్ప వేరే ఏం వద్దంటూ అక్కడి నుంచి వెళ్ళిపోయారు. దీంతో తెలంగాణ ఇన్చార్జి మీనాక్షి నటరాజన్, ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క, మంత్రులు దుద్దిళ్ళ శ్రీధర్ బాబు ఆయనను కలిసి బుజ్జగించి.. మరో మంత్రి వర్గ విస్తరణలో అవకాశం కల్పించే దిశగా కృషి చేస్తామన్నారు.
మంత్రి పదవి రానివ్వలేదని ప్రేమ్ సాగర్ రావు ఆగ్రహం
కాంగ్రెస్ తమ నేతకు అన్యాయం చేసిందని ఆగ్రహంతో ఉన్న ప్రేమ్ సాగర్ రావ్ అనుచరులు తమ నేతకు దక్కాల్సిన మంత్రి పదవి గద్దలా తన్నుకుపోయిన గడ్డం వివేక్ పై తీవ్ర ఆగ్రహంతో ఉన్నారు. ఎంపీ ఎన్నికల సమయంలో తన కొడుకు వంశీకృష్ణను గెలిపిస్తే ప్రేంసాగర్ రావ్ మంత్రి పదవికి తాను అడ్డురానని చెప్పిన వివేక్.. తీరా మంత్రి కావడం వారు జీర్ణించుకోలేకపోతున్నారు. ఈ నేపథ్యంలోనే ప్రేంసాగర్ రావ్ ఆయన అనుచరవర్గం తమ నియోజకవర్గంలో అడ్డుపెట్టొద్దని ఏకంగా మంత్రి వివేక్ కే అల్టిమేటం జారీ చేశారు. ఒకవేళ మంత్రి మంచిర్యాల వస్తే గొడవలు తప్పవని, ఆయనను మంచిర్యాల అడుగుపెట్టనీయమని ప్రతిజ్ఞ చేశారు. ఎమ్మెల్యే ప్రేమ్ సాగర్ రావ్ సైతం నా నియోజకవర్గంలో నేనే రాజు.. నేనే మంత్రి అంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు. పార్టీ కోసం పనిచేసే ప్రతి కార్యకర్తకు అండగా నిలిచి వారికి న్యాయం చేసేలా తాను ముందుంటానన్నారు. దీంతో మంత్రి వివేక్ సైతం ఆయన నియోజకవర్గంలో ఎందుకైనా మంచిదని, ఆ నియోజకవర్గానికి దూరంగా ఉంటున్నారు.
జిల్లా కేంద్రమైన మంచిర్యాలలో అడుగుపెట్టకుండా మంత్రి వివేక్ సైతం జాగ్రత్త పడుతున్నారు. మంత్రి పదవి ప్రమాణ స్వీకారం చేసినప్పుడు సైతం ఇందారం మీదుగా చెన్నూరు నుంచి అటు వైపుగా మందమర్రి వెళ్లిన మంత్రి మంచిర్యాలలో తన నివాసానికి వెళ్ళి హైదరాబాద్ కు వెళ్ళిపోయారు. ప్రేంసాగర్ రావ్, ఆయన అనుచరుల హెచ్చరికల వల్ల.. పార్టీ పెద్దలను సైతం నొప్పించడం ఇష్టంలేక మంత్రి వివేక్ వెంకటస్వామి మంచిర్యాల నియోజకవర్గానికి రావడం లేదు. తన నియోజకవర్గ అభివృద్ధి ఆగకుండా చూసుకుంటున్న ఎమ్మెల్యే ప్రేంసాగర్ రావ్, ఆయన అనుచరులు మంత్రిని మాత్రం నియోజకవర్గంలో అడుగుపెట్టనిచ్చేది లేదని భీష్మించుకున్నారు.
మంచిర్యాలలో పర్యటించిన మంత్రులు
తాజాగా ఆదివారం మంచిర్యాల జిల్లాలో ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క, సహా ముగ్గురు మంత్రులు జిల్లా ఇన్చార్జీ మంత్రి జూపల్లి కృష్ణారావు, వైద్యారోగ్య శాఖ మంత్రి దామోదర రాజనర్సింహ, ఐటీ శాఖ మంత్రి దుద్దిళ్ళ శ్రీధర్ బాబు పర్యటించి.. మంచిర్యాల నియోజకవర్గంలో పలు అభివృద్ధి కార్యక్రమాలు నిర్వహించి మరికొన్ని అభివృద్ధి పనులకు శంకుస్థాపనలు చేశారు. ఉప ముఖ్యమంత్రి సహా, ముగ్గురు మంత్రులు తన సొంత జిల్లాకు వచ్చినప్పటికీ ఈ కార్యక్రమానికి సైతం మంత్రి వివేక్ హాజరుకాలేదు.
ఆదివారం ఇదే సమయంలో మంత్రి వివేక్ వెంకటస్వామి ఆదిలాబాద్ జిల్లాలో పర్యటించి పలు కార్యక్రమాల్లో పాల్గొన్నారు. అటూ మంచిర్యాల జిల్లాలో ఉప ముఖ్యమంత్రి సహా ముగ్గురు మంత్రుల పర్యటన ఉంటే వివేక్ వెంకటస్వామి మాత్రం ఆదిలాబాద్ జిల్లాలో పర్యటించడం అంటే అక్కడ పరిస్థితి ఎలా ఉందో అర్థం చేసుకోవచ్చు. అయితే మరో మంత్రి వర్గ విస్తరణలో ప్రేమ్ సాగర్ రావ్ కు అధిష్టానం అవకాశం కల్పిస్తుందా...? మరి రానున్న రోజుల్లో మంత్రిగా వివేక్ ఎప్పుడైనా మంచిర్యాల నియోజకవర్గంలో అడుగు పెడతారా.. అభివృద్ధి కార్యక్రమాల్లో పాల్గొంటారా..? అంటే మరికొద్ది రోజులు వేచి చూడాలి. ఈ విషయం ఇప్పుడు ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో చర్చనీయాంశంగా మారింది.