Mancherial News Today | మంచిర్యాల జిల్లాలో మంత్రి వివేక్ వెంకటస్వామి (Vivek Venkatswamy) బోనమెత్తి సందడి చేశారు. ప్రజల సంక్షేమం, శాంతి, ఐక్యత, రాష్ట్ర అభివృద్ధి కోసం ప్రభుత్వం అహర్నిశలు కృషి చేస్తుందని రాష్ట్ర కార్మిక, ఉపాధి కల్పన, భూగర్భ జనుల శాఖ మంత్రి గడ్డం వివేకానంద అన్నారు. ఆషాడ మాసం సందర్భంగా ఆదివారం మంచిర్యాల జిల్లాలోని మందమర్రి మండలం బొక్కలగుట్ట ప్రాంతంలోని గాంధారి మైసమ్మ తల్లి ఆలయంలో, నస్పూర్ మండలం సి.సి.సి. కార్నర్ లోని శ్రీ ఆదిపరాశక్తి భువనేశ్వరి మాత దేవాలయంలో ఆషాడ మాస బోనాల జాతర జరిగింది. మందమర్రి మండలం వెంకటాపూర్ గ్రామంలోని పోచమ్మ బోనాల పండుగలో పాల్గొనగా వేద పండితులు మంత్రోచ్ఛరణల మధ్య పూజలు నిర్వహించగా రాష్ట్ర మంత్రి గడ్డం వివేక్ మొక్కులు చెల్లించారు.

గ్రామదేవతల ఆరాధనలో తెలంగాణ భూమి

ఈ సందర్భంగా రాష్ట్ర మంత్రి వివేక్ వెంకటస్వామి మాట్లాడుతూ.. ప్రజల సంక్షేమం, రాష్ట్ర అభివృద్ధిపై అమ్మవారి చల్లని చూపు ఉండాలని, రాష్ట్రాన్ని మరింత అభివృద్ధి చేసి ప్రజలకు అవసరమైన సదుపాయాలను పూర్తి స్థాయిలో అందించేందుకు కృషి చేస్తాం. తెలంగాణ భూమి పరంపరగా శక్తి స్వరూపమైన గ్రామదేవతల ఆరాధనలో ముందుంటుంది. ఇలాంటి జాతరలు ప్రజల మానసిక శాంతికి, సామూహిక ఐక్యతకు వేదికగా నిలుస్తాయి. సంప్రదాయాలను గౌరవిస్తూ ప్రజల నమ్మకానికి విలువ ఇస్తామని, ఇలాంటి వేడుకల ద్వారా ప్రజలలో ఆధ్యాత్మిక భావన పెంపొందుతుంది. దేవతామూర్తుల ఆరాధనతో రాష్ట్ర అభివృద్ధికి నిరంతరం కృషి చేస్తామని’ చెప్పారు. 

బొక్కలగుట్ట సమస్యలను పరిష్కరిస్తామని హామీ

అనంతరం స్థానిక బొక్కలగుట్టలో ఏర్పాటు చేసిన సన్మాన కార్యక్రమానికి డి.సి.పి. ఎ.భాస్కర్ తో కలిసి హాజరయ్యారు. స్థానిక ప్రజా ప్రతినిధులు, ప్రజలు గ్రామంలో నెలకొన్న వివిధ సమస్యల వివరాలను రాష్ట్ర మంత్రి దృష్టికి తీసుకువచ్చారు. ఈ సందర్భంగా మంత్రి వివేక్ వెంకటస్వామి మాట్లాడుతూ ప్రభుత్వం ప్రజా సంక్షేమం దిశగా నిరంతరం కృషి చేస్తుందని తెలిపారు. రాష్ట్రంలోని ప్రజలందరి అభిప్రాయాలను గౌరవిస్తూ ఆధ్యాత్మిక అభివృద్ధికి చర్యలు తీసుకుంటుందని తెలిపారు. బొక్కలగుట్ట గ్రామంలో నెలకొన్న సమస్యలను పరిష్కరించే దిశగా అధికారుల సమస్యలతో చర్యలు తీసుకుంటామని తెలిపారు.

చెన్నూరు నియోజకవర్గ పరిధిలో ప్రజలకు నాణ్యమైన విద్యుత్ అందించేందుకు దాదాపు 5 కోట్ల రూపాయల వ్యయంతో సబ్ స్టేషన్ల ఏర్పాటుకు చర్యలు తీసుకుంటున్నామని తెలిపారు. ఇప్పటి వరకు 2 సబ్ స్టేషన్లను ప్రారంభించడం జరిగిందని, మిగతా 3 సబ్ స్టేషన్ల కొరకు స్థలాలను గుర్తించి ఏర్పాటు చేసేందుకు చర్యలు తీసుకుంటున్నామని తెలిపారు. రైతు సంక్షేమానికి అధిక ప్రాధాన్యతనిస్తూ రైతు భరోసా పథకం రెండో భాగంగా 9 రోజులలో 9 వేల కోట్ల రూపాయలు అర్హులైన రైతుల ఖాతాలలో జమ చేయడం జరిగిందని తెలిపారు. పంట సాగు ప్రారంభానికి ముందే పెట్టుబడి సాయం అందించడంతో రైతులు సంతోషంగా ఉన్నారని తెలిపారు.

అర్హులైన పేదలకు ఇందిరమ్మ ఇండ్లు..

అర్హులైన నిరుపేదలందరికీ గూడు కల్పించేందుకు ప్రభుత్వం ఇందిరమ్మ ఇండ్ల పథకం ద్వారా చర్యలు తీసుకుంటుందన్నారు. ప్రతి నియోజకవర్గానికి 3 వేల 500 ఇండ్ల చొప్పున రాష్ట్ర వ్యాప్తంగా 4 లక్షల 50 వేల ఇందిరమ్మ ఇండ్లు అందించేందుకు ఏర్పాట్లు చేస్తామన్నారు. రేషన్ కార్డుదారులకు జూన్, జులై, ఆగస్టు 3 సంబంధించి ప్రజా పంపిణీ వ్యవస్థలో చౌక ధరల దుకాణాల ద్వారా సన్నబియ్యంను ఉచితంగా పంపిణీ చేశామన్నారు. రేషన్ కార్డుల కొరకు దరఖాస్తు చేసుకున్న వారి వివరాలను క్షేత్రస్థాయిలో పరిశీలించి అర్హత గల వారికి కార్డులు జారీ చేస్తామని తెలిపారు.

మహిళల ఆర్థిక అభివృద్ధికి అవకాశం కల్పిస్తూ ఇందిరమ్మ మహిళా శక్తి కార్యక్రమంలో భాగంగా స్వయం సహాయక సంఘాల మహిళలను ప్రోత్సహిస్తూ అనేక వ్యాపారాలలో అకాశం కల్పిస్తామని తెలిపారు. ఆరోగ్యశ్రీ పథకం పరిమితిని 10 లక్షల రూపాయలకు పెంచి నిరుపేదలకు కార్పొరేట్ వైద్యాన్ని అందించేందుకు ఈ చర్యలు తీసుకుంటున్నామని చెప్పారు. పేద ప్రజల కోసం ప్రభుత్వం ప్రవేశపెట్టిన సంక్షేమ పథకాలను అర్హులైన ప్రతి లబ్ధిదారుడికి అందించేందుకు సమన్వయంతో కృషి చేస్తామన్నారు. ఈ కార్యక్రమంలో సంబంధిత అధికారులు, స్థానిక ప్రజా ప్రతినిధులు తదితరులు పాల్గొన్నారు.