Adilabad Podu Lands Issue | ఆదిలాబాద్ జిల్లా ఇచ్చోడ మండలంలోని సిరిచెల్మ అటవీ రేంజ్ పరిధిలోని కేశవపట్నంలో ఉద్రిక్తత చోటుచేసుకుంది. పోడు భూముల్లో మొక్కలు నాటేందుకు వెళ్లిన అటవీ పోలీసు అధికారులపై ముల్తానీ పోడు రైతులు తిరగబడ్డారు. మొక్కలు నాటవద్దని మొదట హెచ్చరించిన రైతులు, తరువాత అధికారులపై రాళ్లు, కర్రలతో దాడులు చేశారు. ఈ దాడుల్లో ముగ్గురికి తీవ్ర గాయాలు కాగా.. అటవీశాఖ, పోలీసుల వాహనాలు సైతం ధ్వంసమయ్యాయి. గాయాలపాలైన సిబ్బందిని ఇచ్చోడ, ఆదిలాబాద్ రిమ్స్ (Adilabad RIMS) ఆస్పత్రులకు తరలించి చికిత్స అందిస్తున్నారు. అలర్ట్ అయిన పోలీసులు పెద్ద ఎత్తున భారీ బలగాలతో కేశవపట్నం చేరుకున్నారు.
సిరిచెల్మ, బాబ్జిపేట్ బీట్ పరిధిలో పోడు భూములు
ఆదిలాబాద్ జిల్లాలోని సిరిచెల్మ, బాబ్జిపేట్ బీట్ పరిధిలోని 172, 174 కంపార్ట్మెంట్లలోని పోడుభూములలో మొక్కలు నాటేందుకు ఈ నెల 5న అటవీ అధికారులను కేశవపట్నం గ్రామస్థులు అడ్డుకున్నారు. ఈ భూములు తమవేనని కేశవపట్నం గ్రామస్తులు వారిపై ఆగ్రహం వ్యక్తం చేశారు. అయితే, అవి అటవీ భూములని తాము మొక్కలు నాటాల్సిందేనని అటవీ అధికారులు స్పష్టం చేశారు. దీంతో రగడ రాజుకుంది. అధికారులు, గ్రామస్థులు వెనక్కి తగ్గకపోవడంతో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. ఈ వ్యవహారంలో బోథ్ ఎమ్మెల్యే అనిల్ జాదవ్ ఉన్నతాధికారులతో మాట్లాడి అటవీ అధికారులను వెనక్కి పంపించడంతో పరిస్థితి సద్దుమణిగింది.
కేశవపట్నం పంచాయితీ పరిధిలో మొక్కలు నాటేందుకు యత్నం
తాజాగా అటవీ అధికారులు శనివారం కేశవపట్నం పంచాయితీ బాజ్జిపేట బీట్ 71, 72 కంపార్ట్మెంట్లలోని అటవీ భూముల్లో మొక్కలు నాటేందుకు ప్రయత్నించారు. కొందరు ముల్తానీ మహిళలు అడ్డుకునేందుకు తమ చేతిలో ఉన్న కోడవల్లతో గొంతు కోసుకొని చనిపోతామంటూ బెదిరించారు అయితే వారిని పోలీసులు సముదాయించి ఎలాంటి హానిచేసుకోకుండా పోలీస్ స్టేషన్ కు తరలించారు. అనంతరం వదిలిపెట్టకా ఆదివారం ఉదయం పూట అటవీ శాఖ అధికారులు, పోలీసులు వెళ్లగా గ్రామస్తులు వారితో వాగ్వాదానికి దిగారు. దీంతో ఎదురు తిరిగిన ముల్తానీలు రాళ్లతో అటవీశాఖ, పోలీసు సిబ్బంది పై దాడికి యత్నించారు. ఈ దాడిలో ముగ్గురికి తీవ్ర గాయాలు కాగా, మరికొందరికి స్వల్వ గాయాలయ్యాయి.
రైతుల రాళ్ల దాడిలో అధికారుల వాహనాలు ధ్వంసం
ఈ రాళ్ళ దాడిలో పలువురు పోలీస్ సిబ్బందికి తీవ్ర గాయాలయ్యాయి. అటవీ, పోలీస్ శాఖ వాహనాల అద్దాలు సైతం ధ్వంసమయ్యాయి. గాయాల పాలైన పోలీసు, అటవీ శాఖ సిబ్బందిని ఇచ్చోడ ప్రాథమిక ఆరోగ్య కేంద్రానికి తరలించారు. మరికొందరికి తీవ్రగాయాలు కాగా వారిని ఆదిలాబాద్ రిమ్స్ ఆసుపత్రికి తరలించి వైద్యం అందిస్తున్నారు. రాళ్ల దాడితో ఒక్కసారిగా భయాందోళనలకు గురైన అటవీ సిబ్బంది పోలీసుల రక్షణ వలయంలో ఇచ్చోడ చేరుకున్నారు. ఈ ఘటనపై సీరియస్ అయిన పోలీసు అధికారులు ఆందోళనకారులను గుర్తించేందుకు రంగంలోకి దిగారు.
ఉట్నూర్ ఏఎస్పీ కాజల్ సమక్షంలో ఘటన స్థలానికి చేరుకున్నారు. ఏ క్షణాన ఏం జరుగుతుందోనని పలువురు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. పోడు భూముల విషయంలో మళ్ళీ ఎలాంటి ఆందోళనలు జరగకుండా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని పలువురు కోరుతున్నారు.