- ఆరోగ్య మహిళ కార్యక్రమాన్ని సద్వినియోగం చేసుకోవాలి 
- సీ.పీ.ఆర్ శిక్షణను ప్రారంభించిన మంత్రి వేముల


అకస్మాత్తుగా గుండెపోటుకు గురైన వారిని ప్రాణాపాయం నుండి కాపాడేందుకు వీలుగా రాష్ట్ర వైద్యారోగ్య శాఖ ఆధ్వర్యంలో ప్రభుత్వ ఉద్యోగులతో పాటు వివిధ వర్గాల వారికి సీ.పీ.ఆర్ శిక్షణ అందిస్తున్నారు. సీపీఆర్ శిక్షణ కార్యక్రమాన్ని శనివారం నిజామాబాద్ సమీకృత జిల్లా కార్యాలయాల సముదాయంలో ప్రారంభించారు మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి. ఆకస్మికంగా గుండెపోటుతో ప్రాణాపాయ స్థితికి చేరిన వారికి సీ.పీ.ఆర్ ప్రక్రియను ఎలా అందించాలనే దానిపై రాష్ట్ర స్థాయిలో శిక్షణ పొందిన మాస్టర్ ట్రైనర్ లు ప్రయోగాత్మకంగా చేసి చూపిస్తూ అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి మాట్లాడుతూ.. సీపీఆర్ అనే చిన్న ప్రక్రియ ద్వారా ఎన్నో విలువైన ప్రాణాలను కాపాడే అవకాశం ఉంటుందని అన్నారు. అకస్మాత్తుగా గుండెపోటుకు గురైన వారిని గమనించిన వెంటనే, ఏమాత్రం తాత్సారం చేయకుండా సీపీఆర్ ప్రక్రియను అమలు చేయాలని సూచించారు.  
ఆరోగ్య మహిళ సద్వినియోగం చేసుకోవాలి
ఆరోగ్యకర సమాజ నిర్మాణం కోసం రాష్ట్ర ప్రభుత్వం వైద్యారోగ్య శాఖ ఆధ్వర్యంలో అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా మహిళల కోసం  ప్రత్యేకంగా ప్రవేశపెట్టిన ఆరోగ్య మహిళ కార్యక్రమాన్ని మహిళలు సద్వినియోగం చేసుకోవాలని మంత్రి ప్రశాంత్ రెడ్డి ఈ సందర్భంగా కోరారు. జిల్లా కేంద్రంలోని సీతారాంనగర్ కాలనీ, బోధన్ లోని రాకాసిపెట్, ఆర్మూర్, మెండోరా, రుద్రూర్ లలోని ఆరోగ్య కేంద్రాలలో ప్రతి మంగళవారం మహిళలకు ప్రత్యేకంగా మహిళా వైద్యులు, సిబ్బందిచే ప్రత్యేకంగా ఆరోగ్య పరీక్షలు నిర్వహించడం జరుగుతుందని, ముఖ్యంగా ఎనిమిది రకాల వ్యాధి నిర్ధారణ పరీక్షలు జరిపి, అవసరమైన వారికి జీజీహెచ్ లో చికిత్సలు చేయిస్తారని అన్నారు. రొమ్ము క్యాన్సర్ నిర్ధారణ కోసం ఇటీవలే నిజామాబాద్ జీజీహెచ్ లో 30 లక్షల రూపాయల విలువ చేసే మామోగ్రమ్ యంత్రాన్ని కూడా అందుబాటులోకి తెచ్చామని తెలిపారు. ప్రభుత్వం కల్పిస్తున్న వైద్య సేవలను సద్వినియోగం చేసుకోవాలని హితవు పలికారు.


అంతకు ముందు వేల్పూర్, భీంగల్ మండలాలకు చెందిన.. పచ్చల నడ్కుడ, వాడి కొత్తపల్లి, చెంగల్, బిబి తండా, ఎం.జి తండా గ్రామాల్లోని వాటర్ డిస్ట్రిబ్యూటరీ బాక్స్ లు, OMS (ఔట్లెట్ మేనేజ్మెంట్ సిస్టం) లను పరిశీలించారు. ఒక్కో OMS ద్వారా 50పైగా ఎకరాలకు,ఒక్కో డిస్ట్రిబ్యూటరి ఛాంబర్ ద్వారా 12-15 ఎకరాలకు సాగునీరు అందించే ఏర్పాట్లు చేశామని మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి తెలిపారు. ఇప్పటికే పచ్చల నడ్కుడ, వాడి కొత్తపల్లి, చెంగల్, బిబి తండా, ఎం.జి తండా గ్రామాల్లో 160 ఓఎంఎస్ బాక్సుల నుండి 448 డిస్ట్రిబ్యూటరి చాంబర్స్ ద్వారా సుమారు 4,500 ఎకరాలకు సాగునీరు అందించే ఏర్పాట్లు పూర్తి అయ్యాయని తెలిపారు. ఆటోమేటిక్ ఆన్ ఆఫ్ మిషన్ ద్వారా ఇవి పని చేస్తాయన్నారు. 


చింతలూర్ వద్ద పెద్ద వాగుపై బడా భీంగల్ కప్పల వాగుపై ట్యాపింగ్ పాయింట్స్ నిర్మాణాలను పరిశీలించిన మంత్రి 15 రోజుల్లో వాటిని పూర్తి చేసి పంట పొలాలకు సాగునీరు అందించే ఏర్పాట్లు చేయాలని ఇరిగేషన్ అధికారులను అదేశించారు. ఈ ట్యాపింగ్ పాయింట్ నిర్మాణాలు పూర్తి అయితే యాసంగి లో కూడా ఈ రెండు వాగులలో నీళ్లు వదిలి చెక్ డ్యామ్ లు నింపే అవకాశం ఏర్పడుతుందని,దీనివల్ల భూగర్భ జలాలు పెరిగి వాగు పరివాహక పంట పొలాలకు కిలోమీటర్ల మేర బోర్ల రీజనరేషన్ ద్వారా సాగునీరు అందుతుందని అన్నారు. ముఖ్యమంత్రి కేసిఆర్ సహకారంతో ప్యాకేజీ 21 ద్వారా ఒక్క బాల్కొండ నియోజకవర్గంలోనే సుమారు 1650 కోట్ల వ్యయంతో 71వేల ఎకరాలకు కాళేశ్వరం జలాలు అందనున్నాయని చెప్పారు. సాగునీటిని అందించేందుకు ఏర్పాటు చేస్తున్న డిస్ట్రిబ్యూటరి పైపు లైన్ వేసేందుకు రైతులు సహకరించాలని మంత్రి విజ్ఞప్తి చేశారు.