TS Minister KTR got invitation for Nagoba Temple Program: ఆదిలాబాద్ జిల్లా ఇంద్రవెల్లి మండలంలోని కేస్లాపూర్ గ్రామంలో డిసెంబర్ 18వ తేదీన అత్యంత అరుదైన పురాతన దేవాలయం నాగోబా విగ్రహా పునః ప్రతిష్ట కార్యక్రమం నిర్వహిస్తున్నారు. ఈ కార్యక్రమానికి తప్పనిసరిగా హాజరు కావాలని రాష్ట్ర ఐటీశాఖ మంత్రి కేటీఆర్ ని ఖానాపూర్ ఎమ్మెల్యే అజ్మీరా రేఖా నాయక్ తో కలిసి మెస్రం వంశీయులు ఆహ్వానం అందజేశారు. ఈ సందర్భంగా మంత్రి కేటిఆర్ తప్పకుండా వస్తానని సానుకూలంగా స్పందించారు. అనంతరం నియోజకవర్గ స్థాయిలో జరగవలసిన పలు అభివృద్ధి కార్యక్రమాలను మంత్రి కేటీఆర్ దృష్టికి ఎమ్మెల్యే  తీసుకేళ్ళారు. ఈ కార్యక్రమంలో మేస్రం వంశస్థులు మరియు ఇంద్రవెల్లి, ఉట్నూర్ మండలాల ప్రజా ప్రతినిధులు నాయకులు తదితరులు ఉన్నారు.


రూ. 4.67 కోట్లతో నాగోబా ఆలయం నిర్మాణం 
తెలంగాణలో ఆదివాసీల అతిపెద్ద రెండో పండుగగా నాగోబా జాతర గుర్తింపు పొందింది. కేస్లాపూర్‌లో మెస్రం వంశీ యుల ఆధ్వర్యంలో నాగోబా ఆలయ నిర్మాణం పూర్తయ్యింది. మెస్రం వంశీయులు నాగోబా ఆలయ నిర్మాణాన్ని 2018లో ప్రారంభించగా ఇటీవల పనులు పూర్తయ్యాయి. నాగోబా జాతరతో పాటు ఆలయ చరిత్రను భావితరాలకు అందించే లక్ష్యంతో తమ సొంత ఖర్చులతో నాగోబా ఆలయ నిర్మాణానికి శ్రీకారం చుట్టారు. మెస్రం కుటుంబీకుల ద్వారా పెద్ద మొత్తంలో విరాళాలు సేకరించి రూ. 4.67 కోట్లతో నాగోబా ఆలయంతో పాటు సతీ దేవత ఆలయ నిర్మాణం పూర్తి చేశారు.


మెస్రం వంశీయులు 1956లో చిన్నపాటి ఆలయాన్ని నిర్మించుకొని నాగోబా జాతర నిర్వహించారు. మెస్రం వంశీయుల విన్నపం మేరకు ఉమ్మడి రాష్ట్రంలో గిరిజన సంక్షేమ శాఖ మంత్రి జీ నగేశ్‌ అప్పట్లో రూ.3.80 లక్షలతో నాగోబా ఆలయంతో పాటు గర్భగుడి, సతీదేవత గుడి నిర్మాణానికి చర్యలు తీసుకున్నారు. మెస్రం వంశీయులు 2018 వరకు నాగోబా జాతర ఉత్సవాలను ఎంతో వైభవంగా నిర్వహించారు. జాతర సమయంలో భక్తుల ఇబ్బందులను దృష్టిలో పెట్టుకొని మెస్రం వంశీయులు నూతన నాగోబా ఆలయాన్ని అద్భు తంగా నిర్మింపజేశారు.


ఆలయ ప్రారంభోత్సవానికి మెస్రం వంశీయుల ఆహ్వానం
డిసెంబర్‌12 నుంచి 18 (Nagoba Temple Program) వరకు ప్రతి రోజూ రాత్రి 7 నుంచి 9 గంటల వరకు ఆధ్మాత్మిక ప్రవచనాలు, భజన, తదితర పూజ కార్యక్రమాలు వైభవంగా నిర్వహిస్తారు.  ఈ క్రమంలో సోమవారం నాడు మంత్రి కేటీఆర్‌ను మెస్రం వంశీయులు, ఎమ్మెల్యే రేఖా నాయక్ కలసి నాగోబా విగ్రహం పున ప్రతిష్టాపనకు హాజరు కావాలని ప్రత్యేకంగా ఆహ్వానించారు. తెలంగాణ, మహా రాష్ట్రలోని మెస్రం వంశీయులు ఉండే గ్రామాల్లో నాగోబా ఆలయం, నూతన కార్యక్రమాలపై ప్రచారం చేస్తున్నారు. ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా కలెక్టర్లతో పాటు ఎస్పీలు, ఐటీడీఏ పీవో, జిల్లా స్థాయిలోని వివిధ శాఖలకు చెందిన అధికారులు, తదితర ప్రతినిధులను, బదిలీపై వెళ్లిన వారిని ఈ వంశీయులు కార్యక్రమానికి ఆహ్వానిస్తున్నారు. ప్రత్యేక బారికేడ్లతో పాటు రంగు రంగుల లైట్లను అలంకరించి నూతన ఆలయం చుట్టూ ప్రాంతంలో సీసీ నిర్మించారు.