Indrakaran Reddy Respons on ED Notices To Kavitha:
- ఈడీ, సీబీఐ, ఐటీ కేంద్రం చేతులో కీలుబొమ్మలు
- సీబీఐ- ఈడీ వంటి వ్యవస్థలను బీజేపీ భ్రష్టు పట్టిస్తుంది
- అధికార దుర్వినియోగంతో బీజేపీ ప్రతిపక్ష పార్టీల గొంతు నొక్కుతుంది
- తెలంగాణలో బీజేపీ ఆటలు సాగవు
- సీఎం కేసీఆర్ ఎవరికీ తలవంచె రకం కాదు: మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి
నిర్మల్: ఈడీ, సీబీఐ, ఐటీ వంటి దర్యాప్తు సంస్థలు కేంద్రం చేతులో కీలుబొమ్మలుగా మారాయని తెలంగాణ అటవీ, పర్యావరణ, న్యాయ, దేవాదాయ శాఖల మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి ఆరోపించారు. బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవితకు ఈడీ నోటీసులపై మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి ఘాటుగా స్పందించారు. నిర్మల్ లో బుధవారం ఆయన మీడియాతో మాట్లాడారు. కేంద్ర సంస్థల్ని బీజేపీ కేంద్ర ప్రభుత్వం దుర్వినియోగం చేస్తోందని, వాటిని ఉపయోగించి ప్రతిపక్షాలను భయబ్రాంతులకు గురి చేస్తోందని మండిపడ్డారు. విపక్షాలను నిలువరించేందుకు, నాయకులను బ్లాక్ మెయిల్ చేసేందుకు కేంద్ర వ్యవస్థలైన సీబీఐ, ఈడీ, ఐటీలను బీజేపీ వాడుకుంటోందని ధ్వజమెత్తారు.
అందుకే కవితకు నోటీసులు ఇచ్చారన్న మంత్రి
చట్ట సభల్లో మహిళా రిజర్వేషన్లు కోరుతూ ఈ నెల 10వ తేదీన ఢిల్లీలోని జంతర్ మంతర్ వద్ద ఎమ్మెల్సీ కవిత దీక్ష చేయాలని నిర్ణయించారని, ఈ నేపథ్యంలోనే నోటీసులు జారీ చేయడం బీజేపీ కక్ష్య సాధింపు రాజకీయాలకు ఇది నిదర్శనమన్నారు. తెలంగాణలో బీజేపీ ఆటలు సాగవని, సీఎం కేసీఆర్ ఎవరికీ తలవంచె రకం కాదని స్పష్టం చేశారు. ముఖ్యమంత్రి కేసీఆర్ ను ఎదుర్కొనే ధైర్యం లేకనే ఎమ్మెల్సీ కవితను టార్గెట్ చేశారు. బీజేపీ కేంద్ర ప్రభుత్వ ప్రజా వ్యతిరేఖ విధానాలను బీఆర్ఎస్ పార్టీ ఎండగడుతున్నందుకే ఎమ్మెల్సీ కవితకు నోటీసులు ఇచ్చారని తెలిపారు. కేంద్ర ప్రభుత్వం కేవలం ప్రతిపక్షాల నాయకులను టార్గెట్ గా చేసుకుని కేంద్ర దర్యాప్తు సంస్థలచే దాడులు చేపిస్తుందని, మరి బీజేపీ నేతలపై ఎందుకు దాడులు చేయడం లేదని, వారందరూ నీతిమంతులేనా అని మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి ప్రశ్నించారు.
ఎమ్మెల్సీ కవితకు ఈడీ నోటీసులు
ఢిల్లీ లిక్కర్ స్కామ్‌లో ఎమ్మెల్సీ కవితకు ఈడీ నోటీసులు ఇచ్చింది. 9న(గురువారం) విచారణకు రావాలని పేర్కొంది. ఇప్పటికే కవితను ఇదే కేసులో సీబీఐ ఓసారి విచారించింది. ఇప్పుడు ఈడీ విచారణ చేయనుంది. హైదరాబాద్ వ్యాపారి అరుణ్ రామచంద్ర పిళ్లైను మంగళవారం సుదీర్ఘంగా విచారించిన ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ రాత్రి అరెస్టును ప్రకటించింది. ఆయనను కోర్టులో హాజరుపరిచింది. ఆయనపై వేసిన రిమాండ్ రిపోర్టులో ఈడీ అధికారులు పెద్ద ఆరోపణలే చేశారు.
పిళ్లై ఏకంగా కేసీఆర్ కుమార్తె, బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవితకు బినామీ అని సీబీఐ స్పెషల్ కోర్టుకు నివేదించిన రిమాండ్ రిపోర్టులో తెలిపారు. ఆమ్ ఆద్మీ పార్టీ నేతలకు రూ.100 కోట్ల మేర ముడుపులు ఇచ్చిన సౌత్ గ్రూప్ గుప్పిట్లో ఉన్న ఇండోస్పిరిట్స్ సంస్థలో ఎమ్మెల్సీ కవిత తరఫున అరుణ్ పార్టనర్‌గా ఉన్నారని ఆరోపించారు. ఈ కుంభకోణం మొత్తంలో అక్రమంగా సంపాదించిన సొత్తు దాదాపు రూ.296 కోట్లు ఉండవచ్చని ఈడీ అంచనా వేసింది. దీంట్లో కొంత సొమ్ముతో అరుణ్ రామచంద్ర పిళ్లై కొన్ని ఆస్తులు కొన్నారని అభియోగించింది.