TRS MLA Jeevan Reddy Comments on MP Dharmapuri Arvind: గవర్నర్ తమిళిసై రాజ్యాంగ బద్ధ పదవిలో ఉండి బీజేపీ మహిళా మోర్చా అధ్యక్షురాలిగా మాట్లాడుతున్నారంటూ టీఆర్ఎస్ ఎమ్మెల్యే జీవన్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. బీజేపీ గుండాలు టీఆర్ఎస్ నేతలపై మాట్లాడినపుడు ఎందుకు మౌనంగా ఉన్నారో గవర్నర్ చెప్పాలన్నారు. నిజామాబాద్ టీఆర్ఎస్ పార్టీ కార్యాలయంలో జీవన్ రెడ్డి మీడియాతో మాట్లాడారు. మహిళా నాయకురాలిపై దాడి జరిగితే గవర్నర్ తమిళిసై ఎందుకు స్పందించలేదో చెప్పాలన్నారు. జరుగుతున్న పరిణామాలు గమనిస్తే.. అది రాజ్ భవన్ కాదు రాజకీయ భవన్ గా మారిందని వ్యాఖ్యానించారు జీవన్ రెడ్డి. గవర్నర్ బీఆర్ అంబేద్కర్ రాసిన రాజ్యాంగం ప్రకారం కాకుండా ప్రధాని నరేంద్ర మోదీ చెప్పినట్లు వ్యవహిస్తున్నారని ఆరోపించారు. ఎంపీ అరవింద్ విషయం రాష్ట్ర ప్రజలందరికీ తెలుసునని, కేంద్రంలోని బీజేపీ పెద్దలు మాత్రం సీబీఐ, ఐటీ, ఈడీలను దుర్వినియోగం చేస్తున్నారని విమర్శించారు. అరవింద్ తన వ్యాఖ్యలపై క్షమాపణ కోరేంత వరకు టీఆర్ఎస్ శ్రేణులు వెంటాడుతూనే ఉంటాయన్నారు.


ఎంపీ అరవింద్ ఒక ఫేకర్ అని, వాళ్ల నాన్న ఒక జోకర్ ! 
నిజామాబాద్ రాజకీయాలు అధికార టీఆర్ఎస్, బీజేపీ మధ్య మరింత హీటు పెంచుతున్నాయి. బీజేపీ ఎంపీ ధర్మపురి అరవింద్ ఎమ్మెల్సీ కవితపై చేసిన వ్యాఖ్యలతో మరోసారి మాటల తూటాలు పేలుతున్నాయి. మొదట కవిత ఎంపీ అరవింద్ వ్యాఖ్యలపై తీవ్రంగా స్పందించారు. ఇంకోసారి పిచ్చి పిచ్చి మాటలు మాట్లాడినా, లేనిపోని ఆరోపణలు చేసినా చెప్పుతో కొడతామంతూ కవిత వార్నింగ్ ఇచ్చారు. టీఆర్ఎస్ శ్రేణులు హైదరాబాద్ లోని ఎంపీ అరవింద్ నివాసంపై దాడి చేశాయి. ఇది కేసుల వరకు వెళ్లింది. తాజాగా టీఆర్ఎస్ ఎమ్మెల్యే జీవన్ రెడ్డి నిజామాబాద్ ఎంపీ అరవింద్ పై సంచలన వ్యాఖ్యలు చేశారు. ఎంపీ అరవింద్ ఒక ఫేకర్ అని, వాళ్ల నాన్న ఒక జోకర్ అంటూ మండిపడ్డారు.






ఇలాగే మాట్లాడితే ఉరికించి కొడతామని వార్నింగ్ 
కేసీఆర్ ఫ్యామిలీ ఫైటర్స్ ఫ్యామిలీ అయితే, బీజేపీ ఎంపీ అరవింద్ ఫ్యామిలీ చిటర్స్ ఫ్యామిలీ అంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఒక ఇంట్లో మూడు పార్టీల వారు ఉన్నారని, డ్రగ్ అడిక్ట్ ఫెల్లో అరవింద్ అని, ఆయన చూపిన చదువు ఫేక్ అని, రాసిచ్చిన బాండు ఫ్రాండ్ అని, ఆయన మాట్లాడేది మొత్తం అసత్యాలే అంటూ టీఆర్ఎస్ ఎమ్మెల్యే జీవన్ రెడ్డి ఫైర్ అయ్యారు. చెప్పుతో కొట్టడం అనేది చిన్న మాట అని, తనపై తీవ్ర వ్యాఖ్యలు చేసిన వ్యక్తిని ఎమ్మెల్సీ కవిత చాలా చిన్న మాట అన్నారని, ఇంకోసారి సీఎం కేసీఆర్ ఫ్యామిలీ గురించి మాట్లాడితే ఎల్లమ్మ గుట్ట చౌరస్తాలో ఉరికించి కొడతామని ఎంపీ అరవింద్ ను హెచ్చరించారు.


టీఆర్ఎస్ పార్టీకి 62 లక్షల మంది సైన్యం ఉందన్నారు. ఆర్మూర్ ప్రజలు నిన్ను ఓడించేందుకు ఎదురు చూస్తున్నారు. ఈసారి పోటీ చేస్తే అరవింద్ ను తాము తుక్కు తుక్కుగా ఓడిస్తామన్నారు టీఆర్ఎస్ ఎమ్మెల్యే. కేసీఆర్ కుటుంబంపై విమర్శలు, వ్యాఖ్యలు చేయడానికి బదులుగా నిజామాబాద్ జిల్లాకు చేసింది ఏంటో ప్రజలకు చెప్పాలన్నారు. ఫేక్ బాండు పేపర్ గురించి ప్రజలకు చెప్పాలని, అవినీతికి మారు పేరు అరవింద్, ఆయన  కుటుంబం అని ఆరోపించారు. కరెంటు గురించి మాట్లాడే అరవింద్ ఒకసారి కరెంట్ వైర్లను పట్టుకుంటే దాని పవర్ ఏంటో తెలుస్తుందన్నారు జీవన్ రెడ్డి.