ఆదిలాబాద్ జిల్లాలో గురువారం మధ్యాహ్నం ఉరుములు మెరుపులతో కూడిన భారీ వర్షం కురిసింది. జిల్లాలో భారీ వర్షం కురుస్తున్న సమయంలో పలుచోట్ల పిడుగులు పడి ఆరుగురు మృతి చెందారు. ఆదిలాబాద్ జిల్లాలోని గాదిగూడ మండలం పిప్రి గ్రామంలో చేనులో పత్తి విత్తనాలు వేస్తుండగా పిడుగు పడి నలుగురు అక్కడికక్కడే మృతి చెందారు. చేనులో ఉన్న మరో ఎనిమిది మంది పిడుగుపాటుతో గాయపడ్డారు. అటూ బేల మండలంలోను ఇద్దరు మృతి చెందారు.
బేల మండలంలోనీ సాంగ్డి గ్రామంలో గెడం నందిని, సొన్ కాస్ గ్రామంలో కోవ సునీత చేనులో విత్తనాలు వేస్తుండగానే ఈ ఇద్దరు పిడుగుపాటుతో మృతి చెందారు. గాదిగూడ మండలంలోని పిప్పిరి గ్రామంలోనూ వ్యవసాయ పనులలో నిమగ్నమై చేనులో పత్తి విత్తనాలు విత్తుతుండగా ఒక్కసారిగా పిడుగు పడడంతో మంగం భీంబాయి, సిడం రాంబాయి, పెందూర్ మనోహర్, పెందుర్ సంజన, ఈ నలుగురు అక్కడికక్కడే మృతి చెందారు. అక్కడే పిడుగుపాటుతో మరో 8 మంది గాయపడగా వారిని స్థానికులు గమనించి ఆదిలాబాద్ రిమ్స్ ఆసుపత్రికి తరలించారు. రిమ్స్ ఆస్పత్రిలో వైద్యులు వారికి చికిత్సను అందిస్తున్నారు ఇందులో ఇద్దరి పరిస్థితి విషమంగా ఉన్నట్లు తెలుస్తోంది.
పిడుగుపాటుతో మృతి చెందిన విషయం తెలుసుకున్న స్ధానిక పోలీసులు మృతదేహాలను పరిశీలించి కేసు నమోదు చేసుకుని పోస్టుమార్టం నిమిత్తం మృతదేహాలను ఆదిలాబాద్ రిమ్స్ ఆసుపత్రికి తరలించారు. ఏరువాక పౌర్ణమి తర్వాత అందరూ వ్యవసాయ పనుల్లో నిమగ్నమై పత్తి విత్తనాలు వేస్తుండగా పిడుగుపాటుతో జిల్లాలో ఆరుగురు మరణించడం అందరినీ కలచివేసింది. మృతుల కుటుంబాలను ప్రభుత్వం ఆదుకోవాలని స్థానికులు కోరుతున్నారు.