ఒక్క ఛాన్స్.. ఈ మాటకు చాలా విలువ ఉంది. ఏపీలో వైఎస్ జగన్ ఒక్క ఛాన్స్ అంటూనే అధికారంలోకి వచ్చారని తెలిసిందే. అందుకే రేవంత్ రెడ్డి, బండి సంజయ్ కీలకమైన కార్యక్రమం, బహిరంగ సభల్లో ప్రజలను కోరుతున్న ఒకే ఒక్క మాట ఒక్క ఛాన్స్ ఇవ్వండి అని. ప్రస్తుతం నిజామాబాద్ జిల్లాలో జరుగుతున్న టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి హాత్ సే హాత్ జోడో యాత్రలో ఏ నియోజకవర్గానికి వెళ్లినా ప్రజలకు నొక్కిమరి అడుగుతున్నారు ఒక్క అవకాశం ఇవ్వండి అని. ఆయన చేస్తున్న పాదయాత్ర అనంతరం జరుగుతున్న కార్నర్ మీటింగ్స్ లో కాంగ్రెస్ పార్టీకి ఒక్క అవకాశం ఇవ్వండి అని అడుతున్నారు రేవంత్. ఆయన నోట మాటను కాంగ్రెస్ నాయకులు సైతం ప్లీస్ వన్ ఛాన్స్ అంటూ జపిస్తున్నారు. ఈ మంత్రం కాంగ్రెస్ పార్టీకి వచ్చే ఎన్నికల్లో కలిసి వస్తుందా... అన్న చర్చ కూడా పొలిటికల్ సర్కిల్ లో జోరుగా సాగుతోంది. 


గతంలో కాంగ్రెస్ అధికారంలో ఉన్నది. కానీ అది ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో. తెలంగాణ ఇచ్చిన పార్టీగా కాంగ్రెస్ కు గుర్తింపు ఉంది. కానీ కొత్త రాష్ట్రంలో రెండు సార్లు ఎన్నికలు జరగగా, వరుసగా రెండు సార్లు కేసీఆర్ నాయకత్వంలో టీఆర్ఎస్ విజయం సాధించింది. అయితే రాష్ట్రాన్ని ఇచ్చిన పార్టీ కాంగ్రెస్ కు కూడా ఓ ఛాన్స్ ఇచ్చి చూడాలని రేవంత్ రెడ్డి ప్రతి చోటా ప్రజలను కోరుతున్నారు. నిజామాబాద్ జిల్లాలో హాత్ సే హాత్ జోడో యాత్ర చేస్తున్న రేవంత్ రెడ్డి ఏ నియోజకవర్గానికి వెళ్లినా అక్కడి కాంగ్రెస్ నాయకులను పిలిపించుకుని మాట్లాడుతున్నారు. తిరిగి పార్టీ కోసం కష్టపడాలని సూచనలు చేస్తున్నట్లు తెలుస్తోంది. పార్టీకి దూరంగా ఉంటున్న వారిని కూడా పిలిపించుకుని మాట్లాడుతున్నట్లు తెలుస్తోంది. నెక్స్ట్ రాష్ట్రంలో, కేంద్రంలో అధికారంలోకి వచ్చేది కాంగ్రెస్ పార్టీనే నని ఆయా నియోజకవర్గాల్లో నాయకులకు, సేకండ్ క్యాడర్ లీడర్లకు లెక్కలు వేసి మరీ చెబుతున్నారంట రేవంత్ రెడ్డి. 


క్యాడర్ లో మరింత జోష్ నింపేందుకు తాను పర్సనల్ గా వారిని మోటివేట్ చేస్తున్నారు. రేవంత్ యాత్రకు యువత నుంచి కూడా మద్దతు వస్తోంది. మరోవైపు రేవంత్ చేస్తున్న పాదయాత్ర ప్రారంభానికి ముందు ఆయా నియోజకవర్గం ఎమ్మెల్యేల అవినీతి భాగోతంపై ఛార్జీషీట్ పేరుతో స్థానిక నాయకులతో ప్రెస్ మీట్ పెట్టిస్తున్నారు. అధికార పార్టీకి చెందిన ఎమ్మెల్యేల అవినీతి చిట్టా ఇదిగో అంటూ ఛార్జి షీట్ పేరుతో ప్రజలకు వివరిస్తున్నారు. ఈ ఛార్జ్ షీట్ లో తమ గురించి ఏం వస్తుందో అనే గుబులు అధికార పార్టీకి చెందిన ఆయా ఎమ్మెల్యేలు చర్చించుకున్నట్లు తెలుస్తోంది. అవినీతి బాగోతాలపై విడుదల చేస్తున్న ఛార్జ్ షీట్ మంత్రం కూడా కాంగ్రెస్ పార్టీకి బూస్ట్ ఇస్తోందన్న ప్రచారం జరుగుతోంది. 


నిజామాబాద్ జిల్లాలో ఇప్పటి వరకు 5 నియోజకవర్గాల్లో రేవంత్ రెడ్డి హాత్ సే హాత్  జోడో యాత్ర జరిగింది. ఏ నియోజకవర్గం వెళ్లినా ముందు స్థానికంగా ఫేమస్ టెంపుల్స్ ను దర్శించుకున్న తర్వాత ఆయా నియోజకవర్గంలో ఉన్న ప్రధాన సమస్యలపై ఫోకస్ చేస్తున్నారు. నేరుగా అక్కడికి వెళ్లి బాధితులతో మాట్లాడుతున్నారు. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే ఆయా హామీలను వెంటనే నెరవేరుస్తామని అక్కడికక్కడే హామీలిస్తూ వస్తున్నారు. వచ్చేది కొత్త సంవత్సరం జనవరి 1న కాంగ్రెస్ పార్టీనే ప్రభుత్వం ఏర్పాటు చేస్తుందంటూ... కార్నర్ మీటింగ్స్ లో ఢంకా బజాయించి చెబుతున్నారు. అటు స్థానికంగా ఉన్న ప్రధాన సమస్యలపై ఫోకస్ చేస్తూ... ఇటు ఆయా నియోజకవర్గాల ఎమ్మెల్యేల అవినీతిని ఛార్జ్ షీట్ పేరుతో ప్రజల్లోకి తీసుకెళ్తూ... ఒక్క అవకాశం ఇవ్వండి అన్న నినాదాన్ని గట్టిగా వినిపిస్తున్నారు రేవంత్ రెడ్డి. చూడాలి మరి వన్ ఛాన్స్ మంత్రం ఏ మేరకు ఫలిస్తుందో...