Adilabad Tigers Attack: మంచిర్యాల జిల్లా కాసిపేట మండలంలోనీ అటవి ప్రాంతాల్లో పెద్ద పులులు సంచరిస్తు హడలెత్తిస్తున్నాయి. ఇటీవలే కుమ్రం భీం ఆసిఫాబాద్ జిల్లా తిర్యాణి, రెబ్బేన రేంజ్ పరిధిలోని అటవీ ప్రాంతాల్లో నాలుగు పశువులపై దాడి చేసిన రెండు పులులు ప్రస్తుతం కాసిపేట, దేవాపూర్ సరిహద్దు ప్రాంతాల్లో సంచరిస్తున్నట్లు తెలుస్తోంది. తాజాగా మంచిర్యాల జిల్లా కాసిపేట మండలంలోని బెల్లంపల్లి రేంజి పరిధిలో బుగ్గగూడెం శివారులో ఎల్లక్క అనే రైతు పత్తి చేనులో ఆవుపై పులి దాడి చేసింది. పులి దాడిలో ఆవు మృతి చెందినట్లు అటవీశాఖ అధికారులు నిర్ధారించారు.
బెల్లంపల్లి రేంజ్ అటవీ శాఖ అధికారి పూర్ణచందర్ abp దేశంతో మాట్లాడారు. సమీప ప్రాంతాల్లో ట్రాప్ కెమెరాలు ఏర్పాటు చేయడం చేశామని, పులి దాడిలో మరణించిన ఆవు యజమాని ఎల్లక్కకు అటవి శాఖ తరఫున పరిహారం అందజేస్తామన్నారు. అయితే ఈ ఘటనకు ముందే మంచిర్యాల జిల్లా దేవాపూర్ రేంజి పరిధిలోని ఎగ్గెండి అటవీ ప్రాంతంలో మేతకు వెళ్లిన ఓ ఆవుపై పులి దాడి చేసి హతమార్చింది. ఆ తరువాత కాసిపేట మండలంలోనీ బుగ్గగూడెం శివారులో ఎల్లక్క అనే రైతు పత్తి చేనులో ఆవుపై పులి దాడి చేసి హతమార్చింది.
దాడులు చేస్తున్నది ఒక పులేనా లేక రెండు వేరు వేరు పులుల అన్నది అటవీ శాఖ అధికారులు నిర్ధారించాల్సి ఉంది. కానీ రెండు వేరు వేరు చోట్ల పశువులపై పులి దాడి చేయడం కొంత అనుమానాలకు తావిస్తోంది. గత వారం రోజుల క్రితం రెబ్బెన అటవీ ప్రాంతంలో సంచరిస్తున్న పులి దేవాపూర్ రేంజ్ పరిధిలోనీ ఎగ్గేండి అటవి ప్రాంతాల్లోకి వచ్చినట్లు, తిర్యాణి రేంజ్ పరిధిలో సంచరిస్తూ హడలెత్తించిన మరో పులి కాసిపేట అటవీ ప్రాంతాల్లో సంచరిస్తూ ఆవులపై దాడి చేసి ఉండవచ్చు అనీ అంచనా వేస్తున్నారు.
రెండు పులులు మేతకు వెళ్లిన ఆవులపై దాడులకు పాల్పడుతూ భయాందోళనను సృష్టిస్తున్నాయి. అటవీ ప్రాంతానికి ఆనుకొని వ్యవసాయ పనులకు వెళ్లేందుకు రైతులు జంకుతున్నారు. సమీప గ్రామాల ప్రజలు, వ్యవసాయ పనులకు వెళ్లే కూలీలు,రైతులు ఒంటరిగా వెళ్లొద్దని అటవీశాఖ అధికారులు సూచిస్తున్నారు.
నిర్మల్ జిల్లా పెంబి రేంజ్ పరిధిలోనీ అటవీ ప్రాంతాల్లో మరో పులి సంచరిస్తూ హడలెత్తిస్తోంది. గత నాలుగు రోజుల క్రితం ఆదిలాబాద్ జిల్లా సిరికొండ మండలంలోని సాత్‌మోరి గ్రామ శివారులో మెస్రం బొజ్జు అనే రైతు, పత్తి చేనులో లేగదూడపై పులి దాడి చేసి హతమార్చింది. అక్కడ నుంచి నేరడిగోండ, గోధుమల్లె మీదుగా పెంబి అటవీ ప్రాంతంలో సంచరిస్తూ హడలెత్తిస్తోంది.
శుక్రవారం సాయంత్రం వేళ పెంబి రేంజ్ పరిధిలోనీ అటవీ గ్రామాల సరిహద్దు గుండా సంచరిస్తూ తాండ్ర రేంజ్ పరిధిలోనీ లొద్ది ప్రాంతంలోకి వెళ్ళిన్నట్లు సమాచారం. అయితే ఈ పులి అక్కడ నుంచి మామడ, నేరడిగోండ, నిర్మల్ రేంజ్ అటవీ ప్రాంతం వైపు వెళ్తుందా.. లేక తిరిగి పెంబి రేంజ్ పరిధిలోనీ అటవీ ప్రాంతంలో సంచరిస్తూ కడెం, ఉడుంపూర్ రేంజ్ పరిధిలోనీ అటవీ ప్రాంతాల్లోకి వెళ్తుందా అనేది ఎదురు చూస్తున్నారు అటవీ శాఖ అధికారులు.
ఎప్పటికప్పుడు పులి పాదముద్రలు సేకరిస్తు పులికి ఎలాంటి అపాయం తలెత్తకుండా జాగ్రత్తలు తీసుకుంటున్నామని అధికారులు చెబుతున్నారు. సమీప గ్రామాల ప్రజలను అప్రమత్తంగా ఉండాలని, వ్యవసాయ పనులకు వెళ్లే కూలీలు, రైతులు ఒంటరిగా ఎవరు ఉండవద్దని గుంపులుగా ఉండాలని సూచిస్తున్నారు. రాత్రివేళలో ఎవరు బయటకు రావద్దని అవగాహన కల్పించడం జరుగుతుందనీ పెంబి రేంజ్ అటవీ శాఖ అధికారి రమేష్ రావ్ abp దేశంతో తెలిపారు.
ఏడాదిలో ఈ నాలుగు మాసాలు సెప్టెంబర్, అక్టోబర్, నవంబర్, డిసెంబర్ అనేది పులులకు మేటింగ్ సీజన్. మేటింగ్ కోసం పెద్దపులులు ఒక ప్రాంతం నుంచి మరొక ప్రాంతానికి సంచరిస్తూ ఉంటాయి. ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాను అనుకోని ఉన్న తిప్పేశ్వర్, తాడోబా అభయారణ్యం నుంచి పులులు రాకపోకలు కొనసాగిస్తుంటాయి. ప్రస్తుతం ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో ఐదు పులులు సంచరిస్తున్నట్లు అంచనా. ఆదిలాబాద్ జిల్లా భీంపూర్ మండలంలోని పెనుగంగా శివారులో ఓ పులి సంచరిస్తోంది. బోథ్ మండల అటవి ప్రాంతాల్లో సంచరిస్తున్న రెండు పులులలో ఒకటి ప్రస్తుతం నిర్మల్ జిల్లా పెంబి రేంజ్ అటవీ ప్రాంతంలో సంచరిస్తూ హడలెత్తిస్తోంది.
మరో పులి మహారాష్ట్ర సరిహద్దు ప్రాంతాల్లోకి వెళ్లినట్లు అంచనా.. ఇటు కుమ్రం భీం ఆసిఫాబాద్ జిల్లా కాగజ్ నగర్ కారిడార్ పరిధిలో ఓ పులి సంచరిస్తోంది. తాజాగా మంచిర్యాల జిల్లా కాసిపేట, దేవాపూర్ రేంజ్ పరిధిలోనీ అటవీ ప్రాంతాల్లో పులులు సంచరిస్తు పశువులపై దాడి చేస్తు హడలెత్తిస్తున్నాయి. అయితే కాసిపేట, దేవాపూర్ రేంజి పరిధిలోని అటవీ ప్రాంతాల్లో హడలెత్తిస్తున్న పులులలో ఒకటి ఆడ పులి అని, మరో పులి మగ పులి అని, నిర్మల్ జిల్లా పెంబి రేంజ్ పరిధిలో సంచరిస్తున్న పులి ఆడ పులి అని, ఇవి మేటింగ్ కోసం ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా అటవి ప్రాంతాల్లో సంచరిస్తూ హడాలెత్తిస్తున్నాయి.
మరికొద్ది రోజుల్లో ఇవి పరస్పరం కలుసుకోవడం వీలవుతుందా లేకా దారి తప్పి మరోచోటుకి మకాం మారుస్తాయా అన్నది సందిగ్ధంగా ఉంది. అయితే కవ్వాల్ అభయారణ్యం పరిధిలోనీ కోర్ ఏరియా పులులకు ఆవాస యోగ్యంగా ఉన్న ప్రాంతం. ఈ కోర్ ఏరియా పరిధిలోని అటవి ప్రాంతం దట్టమైన నిశ్శబ్దపు కారడవి, అయినప్పటికి పులులు ఆ ప్రాంతాలోకి వస్తు తిరిగి వెళ్లిపోతున్నాయి.