Tiger in Niramal District | నిర్మల్ జిల్లా మామడ రేంజి పరిధిలోని భర్కరేగిడి అటవీ ప్రాంతంలో పెద్దపులి సంచరిస్తోంది. రెండు రోజుల క్రితం నిర్మల్ ఘాట్ దాటి మామడ రేంజి పరిధిలోకి సంచరించిన పెద్దపులి.. మామడ రెంజ్ పరిధిలోని పెంబి రేంజికి సమీపంలో భుర్కరేగిడి అటవీ ప్రాంతంలోని పత్తి చేనుకు సమీపంలో ఓ ఎద్దు పై పులి దాడి చేసి హతమార్చింది.
స్థానిక రైతులు విషయం తెలుసుకొని అటవీ శాఖ అధికారులకు సమాచారం అందించడంతో మామడ, తాండ్ర, పెంబి మూడు రేంజ్ల అధికారులు, బాసర జోన్ ఫ్లయింగ్ స్క్వాడ్ టీం, టాస్క్ ఫోర్స్ టీమ్ అధికారులు అక్కడికి చేరుకున్నారు. పులి దాడి చేసి హతమార్చిన ఎద్దు,ను పరిశీలించారు. పత్తి చేనులో సమీపంలో ఉన్న అటవీ ప్రాంతంలో పులి పాదముద్రలను సేకరించారు. పులి ఏ ప్రాంతం వైపు వెళ్లిందో దాని అడుగుజాడలను చూసుకుంటూ, వైల్డ్ లైఫ్ టీమ్, అటవీ శాఖ బేస్ క్యాంప్ సిబ్బంది వాచ్ చేస్తున్నారు. అక్కడి ప్రాంతంలో రెండు ట్రాప్ కెమెరాలను ఏర్పాటు చేశారు. ఆ ప్రాంతం నుండి సమీప గ్రామాలకు వెళ్లే రహదారిని మూసివేశారు. ఆ ప్రాంతాల వైపు ఎవరు వెళ్లకూడదని సమీప గ్రామాల ప్రజలకు సమాచారం చేరవేస్తున్నారు.
భయాందోళన చెందవద్దు
పులి వచ్చిందని ఎవరు భయాందోళనకు గురవకూడదని, పులికి ఎలాంటి హాని చేయకూడదని గ్రామస్తులకు అవగాహన కల్పిస్తున్నారు. పంట పొలాల్లో ఉచ్చులు, విద్యుత్ తీగల కంచేకలను పెట్టొద్దని, ఎక్కడైనా ఉంటే వాటినీ తిల్గించాలని చెబుతున్నారు. మృతి చెందిన పశువు యజమాని కుమ్ర గంగాధర్ కు అటవీశాఖ తరఫున పరిహారం అందిస్తామన్నారు. పులి సంచారం విషయమై ఏబీపీ దేశం.. మామడ, పెంబి రేంజ్ అధికారలు, రాథోడ్ అవినాష్, రమేష్ లతో ఫోన్ ద్వారా వివరణ కోరగా... పులి తమ రేంజి పరిధిలో ఉందని సమీప అటవీ ప్రాంతాల్లో అది సంచరిస్తోందన్నారు. భుర్కరేగిడి అటవీ సమీపంలో ఓ ఎద్దుపై దాడి చేసిందన్నారు. రైతు కుమ్ర గంగాధర్ కు చెందిన ఎద్దు పై పులి దాడి చేసి చంపడంతో అతనికి అటవీశాఖ తరఫున తాత్కాలికంగా 5000 రూపాయలను అందించారు. మిగతా పరిహారం పంచనామా అనంతరం అందించడం జరుగుతుందని మామడ రేంజ్ అధికారి అవినాష్ తెలిపారు.
పులి దాడిలో ఎవరి పశువులైన హతమయితే తమకు సమాచారం అందించాలని, పులి ఈ ప్రాంతంలో సంచరిస్తున్నందున సమీప గ్రామాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, పంట పొలాల్లో చేనులలో పనిచేసే వ్యవసాయ రైతులు కూలీలు తమ పనులు ఉదయం 10 గంటల నుండి సాయంత్రం నాలుగు గంటల లోపే గుంపులు గుంపులుగా ఇద్దరు ముగ్గురు ఉంటూ చేసుకోవాలన్నారు. పంటచేలలో అడవి పందులకు అమర్చే విద్యుత్ కంచేలను తొలగించాలని గ్రామస్తులకు అవగాహన కల్పించడం జరుగుతుందన్నారు. పులి సంచారం నేపథ్యంలో ఎవరు కూడా భయాందోళనకు గురవద్దని, అప్రమత్తంగా ఉండాలన్నారు.