ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలో సీనియర్ నాయకులు తమ వారసుల అదృష్టాన్ని పరీక్షించేందుకు సిద్ధవుతున్నారు. వచ్చే ఎన్నికల్లో బరిలో దింపేందుకు తహతహలాడుతున్నారు. ప్రధానంగా నిజామాబాద్ రూరల్ ఎమ్మెల్యే బాజిరెడ్డి గోవర్దన్, బాన్సువాడ ఎమ్మెల్యే అసెంబ్లీ స్పీకర్ పోచారం శ్రీనివాస్ రెడ్డి తమ బిడ్డలను ఎమ్మెల్యేలుగా చేయాలని సిద్ధమవుతున్నారు. 


ఇప్పటికే బాజిరెడ్డి గోవర్దన్ నాలుగు సార్లు ఎమ్మెల్యేగా చేశారు. జిల్లాలో సీనియర్ నాయకుడిగా పేరుంది. మాస్ లీడర్. అయితే వయసు కూడా పెరుగుతున్నందున బాజిరెడ్డి కుమారుడు బాజిరెడ్డి జగన్మోహన్‌ను ఎమ్మెల్యేగా చూసుకోవాలని గత ఎన్నికల నుంచే అనుకున్నారు. గత ఎన్నికల్లో రూరల్ నుంచి కుమారుడిని బరిలోకి దింపాలని అనుకున్నారు. కానీ అందుకు టీఆర్ఎస్ పార్టీ అధిష్ఠానం ఒప్పుకోలేదని తెలిసింది. 


తన ప్రయత్నాన్ని మాత్రం బాజిరెడ్డి మానుకోలేదు. తన కుమారుడు జగన్‌ను ధర్పల్లి జడ్పీటీసీగా పోటీ చేయించి గెలిపించుకున్నారు. కొడుకుకు జడ్పీఛైర్మన్ పదవి కోసం బాగానే ట్రై చేసినా... దాదాన్నగారి విఠల్‌రావుకు ఆ పదవి వరించింది. బాజిరెడ్డి కొడుకును పాలిటిక్స్‌లో యాక్టివ్ చేశారు. రాజకీయ ఓనమాలు నేర్పారు బాజిరెడ్డి. జగన్‌ను ఎలాగైనా ఎమ్మెల్యేగా చూడాలని బాజిరెడ్డి కసరత్తు చేస్తున్నట్లు తెలుస్తోంది. ఇప్పటికే బాజిరెడ్డి గోవర్దన్ ఆర్టీసీ ఛైర్మన్‌గా పని చేస్తున్నారు. కుమారుడిని ఎమ్మెల్యేగా చూడాలన్నది బాజిరెడ్డికి బాగా ఇంట్రస్ట్‌గా ఉన్నట్లు తెలుస్తోంది. 


టీఆర్‌ఎస్‌ అధిష్ఠానం మాత్రం డిఫరెంట్‌గా ఆలోచిస్తున్నట్టు తెలుస్తోంది. ఈసారి కూడా బాజిరెడ్డే పోటీలో ఉండాలని టీఆర్ఎస్  అధినాయకత్వం కోరుకుంటున్నట్టు సమాచారం. గత ఎన్నికల్లో కూడా ఇదే పరిస్థితి ఎదురైంది. కుమారుడు జగన్‌ను బరిలోకి దించాలనుకున్నారు బాజిరెడ్డి... వచ్చే ఎన్నికల్లోనైనా తన కల నెరవేరుతుందా అన్న ఆశతో ఉన్నట్లు తెలుస్తోంది. అయితే కేసీఆర్ మాత్రం బాజిరెడ్డి గోవర్ధనే వచ్చే ఎన్నికల్లో పోటీ చేస్తే బాగుంటుంది అన్న అభిప్రాయంలో ఉన్నట్లు తెలుస్తోంది.


బాన్సువాడ నియోజకవర్గ ఎమ్మెల్యే తెలంగాణ అసెంబ్లీ స్పీకర్ పోచారం శ్రీనివాస్ రెడ్డి సైతం తన కుమారులు భాస్కర్ రెడ్డి, సురేందర్ రెడ్డిలో ఒకరిని బాన్సువాడ నియోజకవర్గం నుంచి పోటీలో నిలిపేందుకు ప్రయత్నాలు చేస్తున్నారట. ఇప్పటికే భాస్కర్ రెడ్డి నిజామాబాద్ డీసీసీబీ ఛైర్మన్‌గా ఉన్నారు. యువకుడు రాజకీయాల్లో చురుగ్గా ఉంటున్నారు భాస్కర్ రెడ్డి. వచ్చే ఎన్నికల్లో బాన్సువాడ నుంచి ఆయనే పోటీలో ఉంటారన్న ప్రచారం కూడా జోరుగా జరుగుతోంది. పోచారం మరో కుమారుడు సురేందర్ రెడ్డి సింగిల్ విండో ఛైర్మన్‌గా చేశారు. సురేందర్ రెడ్డి సైతం ఎమ్మెల్యేగా పోటీ చేయాలన్న ఆశతో ఉన్నట్లు సమాచారం.  


ఇద్దరి కుమారుల్లో ఎవరినో ఒకరిని ఎమ్మెల్యేగా చేసుకోవాలన్నది పోచారం మదిలో ఉన్నట్లు అనుచురులు చెప్పుకుంటున్నారు. పోచారానికి వయసు కూడా మీద పడుతుండటంతో తన స్థానంలో కుమారులను నిలబెట్టుకోవాలని చూస్తున్నారని తెలుస్తోంది. సర్వేల లెక్క ప్రకారం.. మరోసారి పోచారం శ్రీనివాస్‌ రెడ్డి వైపే సీఎం కేసీఆర్ మొగ్గుతున్నట్టు సమాచారం. ఆయన బరిలో ఉంటే బాగుంటుంది అన్న అభిప్రాయం వ్యక్తం చేసినట్లు వినికిడి. పోచారం ఇటీవల బాన్సువాడలో జరిగిన ఓ కార్యక్రమంలో వచ్చే ఎన్నికల్లో కూడా తానే పోటీ చేస్తానని చెప్పుకోచ్చారు. ఆ మాట మనసులోంచి వచ్చిందా లేదా అన్నది పక్కన పెడితే ... పోచారం శ్రీనివాస్ రెడ్డికి మాత్రం ఇద్దరి కుమారుల్లో ఎవరినో ఒకరిని ఎమ్మెల్యేగా చూడాలన్న ఆశతో ఉన్నట్లు తెలుస్తోంది.


మాజీ ఎమ్మెల్యే అన్నపూర్ణమ్మ గతంలో టీడీపీలో ఉండగా యాక్టివ్ పాటిలిక్స్ చేశారు. అయితే ప్రస్తుతం అన్నపూర్ణమ్మ కుమారుడు మల్లి ఖార్జున్ రెడ్డి బాల్కొండ నియోజకవర్గంలో బీజేపీలో యాక్టివ్‌గా ఉన్నారు. పార్టీ కూడా బాల్కొండ నియోజకవర్గం ఇంఛార్జ్‌గా బాధ్యతలు అప్పజెప్పింది. వచ్చే ఎన్నికల్లో బాల్కొండ నుంచి మల్లిఖార్జున్ రెడ్డిని ఎమ్మెల్యేగా చూడాలన్నది అన్నపూర్ణమ్మ కోరిక. ఇప్పటి నుంచే అన్నపూర్ణమ్మ పావులు కదుపుతున్నారు. పార్టీ అధిష్ఠానం వచ్చే ఎన్నికల నాటికి అన్నపూర్ణమ్మను నిజామాబాద్ బీజేపీ ఎంపీ అభ్యర్థిగా బరిలో దింపే అవకాశం కూడా ఉందన్నది అంతర్గతంగా నడుస్తున్న చర్చ. ఒక వేళ అలా కుదురకుంటే కుమారుడు మల్లిఖార్జున్‌ను ఎమ్మెల్యేగా గెలిపించుకోవాలన్నది అన్నపూర్ణమ్మ కొరిక. అయితే ఆ నియోజకవర్గం నుంచి సునీల్ రెడ్డి కూడా బీజేపీ నుంచి టికెట్ ఆశిస్తున్నట్లు జిల్లాలో ప్రచారం జరుగుతోంది.


ధర్మపురి శ్రీనివాస్ డీఎస్ పెద్ద కుమారుడు ఎమ్మెల్యేగా చూడాలని గట్టి సంకల్పంతో ఉన్నారు. కుదిరితే కాంగ్రెస్ నుంచి నిజామాబాద్ అర్బన్ ఎమ్మెల్యే అభ్యర్థిగా బరిలోకి దింపాలన్నది డీఎస్ మదిలో ఉన్న కొరిక. ఇప్పటికే డీఎస్ చిన్న కుమారుడు అరవింద్ ఎంపీగా ఉన్నారు. పెద్దోడు సంజయ్ నిజామాబాద్ కార్పొరేషన్ ఏర్పడ్డాక మొదటి మేయర్‌గా చేశారు. వచ్చే ఎన్నికల్లో సంజయ్‌ను ఎమ్మెల్యే చేయాలన్నదే డీఎస్ ధ్యేయంగా పెట్టుకున్నారని తెలుస్తోంది. చూడాలి మరి ఉమ్మడి నిజామాబాద్ జిల్లా సీనియర్ నాయకుల కల నెరవేరుతుందో లేదోనని.