Telangana Weather:వాయువ్య బంగాళాఖాతం కేంద్రీకృతమైన వాయుగుండం, ఈశాన్య అరేబియన్ సముద్ర ప్రాంతం నుంచి ఛత్తీస్‌గఢ్ వరకు ఆవరించి ఉన్న ఆవర్తనం ప్రభావంతో తెలంగాణలో వర్షాలు దంచి కొడుతున్నాయి. హైదరాబాద్‌తోపాటు జిల్లాల్లో ముసురు పట్టుకుంది. మరో రెండు మూడు రోజుల పాటు ఇలాంటి పరిస్థితి కొనసాగుతుందని వాతావరణ శాఖ వెల్లడించింది. ఉత్తర తెలంగాణ జిల్లాల్లోని కొన్నిచోట్ల మోస్తరు వర్షాలు నుంచి భారీ వర్షాలు పడతాయని పేర్కొంది.
తెలంగాణ అంతటా 40-45 కి.మీ. వేగంతో ఈదురుగాలులు వీచే అవకాశం ఉంది. ఆదిలాబాద్, ఆసిఫాబాద్, నిర్మల్, నిజామాబాద్, కామారెడ్డి, సిరిసిల్ల, జగిత్యాల, మంచిర్యాల, పెద్దపల్లి, వికారాబాద్, సంగారెడ్డి, రంగారెడ్డిలలో మోడరేట్ వర్షాలు కురుస్తాయి. మిగతా జిల్లాల్లో తేలికపాటి వర్షాలు పడే అవకాశం ఉంది.
ఎల్లో అలర్ట్ జారీ జిల్లాలు:-హైదరాబాద్, జగిత్యాల, జనగాం, జయశంకర్ భూపాలపల్లి, కామారెడ్డి, ఖమ్మం, మహబూబ్‌నగర్, మంచిర్యాల, మెదక్, మేడ్చల్ మల్కాజ్‌గిరి, నాగర్ కర్నూల్, నల్గొండ, నారాయణపేట, నిర్మల్, నిజామాబాద్, పెద్దపల్లి, రాజన్నసిరిసిల్ల జిల్లా, సంగారెడ్డి, సిద్ధిపేట, సూర్యాపేట, వికారాబాద్, యాదాద్రి భువనగిరి,
హైదరాబాద్ వర్షాలు తగ్గుముఖ పడుతున్నాయి. నిన్న రాత్రి వరకు ఏకధాటిగా కురిసిన వాన ఇవాళ ఉదయం నుంచి కాస్త గ్యాప్ ఇచ్చింది. సాయంత్రం వరకు కొన్ని ప్రాంతాల్లో చినుకులు పడతాయి. మిగతా ప్రాంతాల్లో ఆకాశం మేఘావృతమై ఉంటుంది. ఉదయం చాలా ప్రాంతాల్లో పొడిగా ఉంటుందని సాయంత్రానికి వర్షం పడుతుందని అంచనా ఉంది. ప్రస్తుతం ఉన్న వాతావరణంతో ఉష్ణోగ్రతలు భారీగా పడిపోయాయి.
రాష్ట్రంలోని వరంగల్ జిల్లాలో అత్యధికంగా 61.8 మిమీ వర్షపాతం నమోదైంది. హైదరాబాద్ లో లంగర్ హౌస్ ప్రాంతంలో 28.8 మిమీ వర్షపాతం నమోదైంది. రాష్ట్రంలోని ఆదిలాబాద్, నిర్మల్, కామారెడ్డి వంటి ఉత్తర జిల్లాల్లో సహా రాంగారెడ్డి, వికారాబాద్ వంటి పశ్చిమ జిల్లాల్లో కూడా మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిశాయి. మరో రెండు రోజులు ముసురు పరిస్థితి ఉంటుందని అంటున్నారు.
తెలంగాణలో లోటు వర్షపాతం ఉందని బెంగపడుతున్న టైంలో అల్పపీడనం ప్రభావంతో కురిసిన వర్షాలు ఊరట కలిగించాయి. అయితే ఈ సీజన్‌లో కురిసిన వర్షాలు గతంతో పోలిస్తే తక్కువన అధికారిక గణాంకాలు చెబుతున్నాయి. వాస్తవంగా ఈ సీజన్ నాటికి తెలంగాణ వ్యాప్తంగా 31.48 సెంటీమీటర్ల వర్షపాదం నమోదు కావాల్సి ఉండేది. కానీ శుక్రవారం నాటికి 30.48 సెంటీమీటర్ల వర్షపాతమే నమోదు అయింది. ఇంకా రాష్ట్రంలో వర్షాలు పడుతున్నందున ఈ వారంలో ఆలోటు అధిగమించే అవకాశం ఉందని అధికారులు చెబుతున్నారు.
లోటు ఉన్నప్పటికీ కొన్ని జిల్లాల్లో సాధారణం కంటే కాస్త ఎక్కువ వర్షపాతం నమోదు అయినట్టు లెక్కలు చెబుతున్నాయి. మహబూబ్‌నగర్, నాగర్‌కర్నూల్, రంగారెడ్డి, నారాయణపేట, కుమ్రంభీమ్ ఆసిఫాబాద్, భద్రాద్రి కొత్తగూడెం, మహబూబాబాద్, వరంగల్, కరీంనగర్, సిద్ధిపేట, వనపర్తి, ఖమ్మం, ములుగు జిల్లాలు ఈ అధిక వర్షపాతం కురిసిన జాబితాలో ఉన్నాయి.