రాష్ట్రంలో ఏ పరీక్షలు చూసినా పేపర్ లీకులే అవుతున్నాయని ఆరోపించారు టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి. కామారెడ్డి నియోజవకర్గం రాజంపేటలో జరిగిన పాదయాత్రలో రేవంత్ ఫైరయ్యారు. బీఆర్ఆర్ఎస్ దొంగలు, పైరవీకారులకు ముందే ప్రశ్నపత్రాలు అందుతున్నాయని అన్నారు. పేపర్ లీక్ వ్యవహారంలో చిన్న చేపలను బలి చేసి.. చైర్మన్, బోర్డు మెంబర్లు, మంత్రి కేటీఆర్, సీఎం కేసీఆర్ తప్పించుకుంటున్నారని అన్నారు రేవంత్. పరీక్ష పేపర్ లీకేజ్ కు కారణం మంత్రి కేటీఆరే అని ఆరోపించారు. కేటీఆర్ ను మంత్రి పదవి నుంచి ఎందుకు బర్తరఫ్ చేయరని ప్రశ్నించారు రేవంత్. లిక్కర్ స్కాంలో ఇరుక్కున్న బిడ్డ కోసం మంత్రులను ఢిల్లీకి పంపించిన సీఎం కేసీఆర్ పేపర్ లీకేజీపై ఎందుకు సమీక్షించలేదని ప్రశ్నించారు. 

 

ప్రభుత్వ వైఖరికి నిరసనగా రేపు (ఆదివారం) అన్ని మండల కేంద్రాల్లో కేసీఆర్, కేటీఆర్ దిష్టి బొమ్మలను దహనం చేయాలని కాంగ్రెస్ శ్రేణులకు పిలుపునిచ్చారు రేవంత్ రెడ్డి. పేపర్ లీక్ వ్యవహారంపై ఈ నెల 21న కాంగ్రెస్ ముఖ్య నేతలమంతా గవర్నర్ ను కలుస్తామని చెప్పారు. కేటీఆర్ మంత్రి పదవిని బర్తరఫ్ చేయాలని గవర్నర్ కు డిమాండ్ చేస్తామని చెప్పారు రేవంత్ రెడ్డి. బీఆరెస్, బీజేపీ కుమ్మక్కుపై అమీతుమీ తేల్చుకుంటామని అన్నారు రేవంత్ రెడ్డి. నిరుద్యోగుల జీవితాలు ఆగమవుతుంటే గవర్నర్ ఎందుకు సమీక్షించడం లేదు? అని ప్రశ్నించారు. తక్షణమే కేటీఆర్ ను మంత్రి పదవి నుంచి బర్తరఫ్ చేయాలి డిమాండ్ చేశారు రేవంత్ రెడ్డి. టీఎస్ పీఎస్సీ సభ్యులను రాజీనామా చేయించి.... సిట్టింగ్ జడ్జి తో, లేదా సీబీఐతో విచారణ చేయాలని డిమాండ్ చేశారు. పరీక్షల్లో అవకతవకలపై కాంగ్రెస్ పోరాటం చేస్తుందని అన్నారు. ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు పాలనకు ఇక కాలం చెల్లిందని అన్నారు రేవంత్ రెడ్డి. దేవుడు దిగి వచ్చినా....  కూడా కేసీఆర్ కాపాడలేడని అన్నారు రేవంత్ రెడ్డి. తొమ్మిదేళ్లలో కేసీఆర్ మోయలేని పాపాలు చేశారని అన్నారు. 


 

తెలంగాణ సాధించుకున్న రాష్ట్రంలో కేసీఆర్ రెండు సార్లు ముఖ్యమంత్రి అయ్యారు. ఉద్యోగాలు లేవని యువకులు ఆత్మహత్యలు చేసుకుంటున్నారు. శ్రీకాంతాచారి బలిదానం చేసుకున్న చోటు నుంచే నిరుద్యోగ ఘర్జన పేరుతో కాంగ్రెస్ పార్టీ కదం తొక్కిందన్నారు రేవంత్ రెడ్డి. దీంతో కేసీఆర్ భయపడి 80 వేల ఉద్యోగాలకు నోటిఫికేషన్లు జారీ చేశారు. సింగరేణి పరీక్షలు, ఏఈ పరీక్షలు, టౌన్ ప్లానింగ్ పరీక్షలు, గ్రూప్ వన్ పరీక్షలు, విద్యుత్ శాఖలో పరీక్ష పేపర్లు లీకవుతున్నాయని అన్నారు రేవంత్ రెడ్డి. దోపీడి దారులకు, పైరవీ కారులకు ముందే పరీక్ష పత్రాలు లీకవుతున్నాయి. ఒక ఉద్యోగికి సెల్ ఫోన్ లో పరీక్ష పత్రాలు ముందే వస్తే ముఖ్యమంత్రి కేసీఆర్ చర్యలు తీసుకోవటం లేదు. చిన్న చిన్న ఉద్యోగులను బలి చేసే ప్రయత్నం చేస్తున్నారని ఆరోపించారు రేవంత్ రెడ్డి. ఆనాడు ఆరోపణలు వచ్చాయని రాజయ్యను మంత్రి పదవి నుంచి బర్తరఫ్ చేశావు. కన్న కొడుకు, బిడ్డ పై ఆరోపణలు వచ్చినా ఊరుకోనని అసెంబ్లీలో చెప్పిన కేసీఆర్ ఇవాళ సొంత కొడుకు, కూతురిపై ఆరోపణలు వస్తున్నా ఎందుకు కేసీఆర్ చర్యలు తీసుకోవటం లేదని ప్రశ్నించారు రేవంత్ రెడ్డి. విద్యార్థులకు, నిరుద్యోగులకు, ఉద్యమ కారులకు కాంగ్రెస్ పార్టీ అండగా ఉంటుందని అన్నారు. పేపర్ లీకేజీల విషయంపై నిందితులకు శిక్షలు పడే వరకు ఊరుకోమని అన్నారు రేవంత్ రెడ్డి.