కామారెడ్డి జిల్లా కలెక్టర్ జితేష్ పాటిల్ తో కేంద్రమంత్రి నిర్మలా సీతారామన్ ప్రవర్తించిన తీరు తనను భయపెట్టిందంటూ తెలంగాణ మంత్రి కేటీఆర్ ట్వీట్ చేశారు. అధికారంలో ఉన్న రాజకీయ నేతలు.. కష్టపడి పని చేసే ఐఏఎస్ అధికారులను భయపెట్టడం సరికాదని మంత్రి కేటీఆర్ తెలిపారు. చదువుకున్న మీకు ఈ విషయం కూడా తెలియదా అంటూ కేంద్రమంత్రికి చురకలు అంటించారు. కలెక్టర్ గౌరవ ప్రధమైన ప్రవర్తనకు కేటీఆర్ అభినందనలు తెలియజేశారు. 






అసలేం జరిగిందంటే..?


తెలంగాణలో మూడు రోజుల పర్యటనకు వచ్చిన కేంద్రమంత్రి నిర్మలాసీతారామన్‌ రెండో రోజు కామారెడ్డి జిల్లాలో పర్యటించారు. లోక్‌సభ ప్రవాస్ యోజనలో భాగంగా బాన్సువాడలో ఆమె పర్యటించారు. ఈ క్రమంలోనే బీర్కూర్ మండల కేంద్రంలో రేషన్ షాప్ వద్ద లబ్ధిదారులతో ఆమె మాట్లాడారు. అయితే కేంద్ర మంత్రి జిల్లా పర్యటనకు రావడంతో కలెక్టర్ కూడా ఆమె వెంట ఉన్నారు. ఈ క్రమంలోనే ప్రజలకు ఇస్తున్న రేషన్ వివరాలను గురించి కలెక్టర్ జితేష్ పాటిల్ ను అడిగి తెలుసుకున్నారు. ఇప్పటి వరకు గరీబ్ కల్యాణ్ అన్న యోజన కింద ఎంత బియ్యం పంపిణీ చేశారని ప్రశ్నించారు.


ఐఏస్ అధికారివి.. ఆమాత్రం తెలియదా..?


కామారెడ్డి జిల్లా కలెక్టర్‌పై కేంద్రమంత్రి నిర్మలా సీతారామన్ ఆగ్రహం వ్యక్తం చేశారు. పేద ప్రజలకు పంపిణీ చేస్తున్న రేషన్‌ బియ్యంలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల వాటా ఎంతని కలెక్టర్‌ను ప్రశ్నించారు. తనకు తెలియదన్న కలెక్టర్ సమాధానం చెప్పడంతో... ఐఏఎస్ ఆఫీసర్ అయిన మీకు ఆమాత్రం తెలియదా అంటూ కేంద్రమంత్రి ఫైర్ అయ్యారు. అరగంటలో అందుకు సంబంధించిన విషయాలు తెలుసుకుని చెప్పాలని ఆదేశాలు జారీ చేశారు. ఉచిత బియ్యంలో ఒక్క కేజీకి 35  రూపాయలు ఖర్చు అవుతుందని.. అందులో 5 రూపాయలు రాష్ట్ర ప్రభుత్వం ఖర్చు చేస్తే రూపాయి ప్రజలు ఇస్తారని తెలిపారు. మిగతా 29 రూపాయలను కేంద్రం ఖర్చు చేస్తుందని... అలాంటప్పుడు ప్రధాని మోడీ ఫ్లెక్సీ రేషన్ షాపులో పెట్టడానికి అభ్యంతరం ఏమిటని ప్రశ్నించారు.


తెలంగాణ అప్పులు కూడా పెరిగిపోయాయంటూ కామెంట్లు..


కేంద్ర ఆర్ధిక మంత్రి నిర్మలా సీతారామన్  తెలంగాణ పర్యటనలో  రాష్ట్ర ప్రభుత్వంపై మండిపడ్డారు. అప్పులపై కీలక వ్యాఖ్యలు చేశారు.  తెలంగాణ అప్పులు FRBM పరిధి దాటి పోతోందని విమర్శించారు. తెలంగాణను కేసీఆర్ అప్పుల్లోకి నెట్టేశారని అన్నారు. రాష్ట్రంలో అప్పుడే పుట్టినబాబు కూడా లక్ష రూపాయల అప్పు కట్టాల్సిన పరిస్ధితి వుందని కేంద్ర మంత్రి అన్నారు. ఉపాధి హామీ పథకం కోసం 20 వేల కోట్లు ఇచ్చామని తెలిపారు. కేంద్రం పంపిన డబ్బులు ఖర్చు చేయకపోతే అధికారులు విచారణ చేస్తారని నిర్మల హెచ్చరించారు. ఓపికగా సమాధానం చెప్పాల్సిన బాధ్యత రాష్ట్ర ప్రభుత్వంపై వుందని.. తానే ప్రధాని అన్నట్లు కేసీఆర్ దేశమంతా తిరుగుతున్నారని నిర్మల మండిపడ్డారు. అప్పుల గురించి అడిగే అధికారం కేంద్రానికి ఉందని స్పష్టం చేశారు. దేశం మొత్తం తిరిగే ముందు తమ రాష్ట్రంలో జరుగుతున్న దానిపై సమాధానం చెప్పాలని కేసీఆర్ ను డిమాండ్ చేశారు.