KTR Tour In Nirmal District On 4 October: 
నిర్మల్: తెలంగాణ పురపాలక, పట్టణ అభివృద్ధి శాఖల మంత్రి కేటీఆర్ అక్టోబర్ 4న నిర్మ‌ల్ జిల్లాలో పర్యటించనున్నారు. నిర్మ‌ల్ నియోజ‌క‌వ‌ర్గంలో కేటీఆర్ అభివృద్ధి పనులకు ప్రారంభోత్సవాలు, శంకుస్థాపనలు చేయ‌నున్న‌ట్లు మంత్రి ఇంద్ర‌క‌ర‌ణ్ రెడ్డి వెల్ల‌డించారు. కేటీఆర్ జిల్లా పర్యటనకు పకడ్బందీగా ఏర్పాట్లు చేయాలని అట‌వీ, ప‌ర్యావ‌ర‌ణ‌, న్యాయ‌, దేవాదాయ శాఖ మంత్రి ఇంద్ర‌క‌ర‌ణ్ రెడ్డి అధికారుల‌ను ఆదేశించారు. ఈ కార్యక్రమాల అనంతరం నిర్మ‌ల్ ప‌ట్ట‌ణంలోని మినీ ఎన్టీఆర్ స్డేడియంలో మ‌ధ్యాహ్నం భారీ బ‌హిరంగ స‌భ నిర్వ‌హించ‌నున్న‌ట్లు చెప్పారు. 


అభివృద్ధి పనుల ప్రారంభం..
కాళేశ్వరం ప్రాజెక్టులో భాగంగా రూ. 714 కోట్ల వ్య‌యంతో చేపట్టిన శ్రీ ల‌క్ష్మిన‌ర్సింహా స్వామి ఎత్తిపోత‌ల ప‌థ‌కాన్ని (27 ప్యాకేజ్) మంత్రి కేటీఆర్ ప్రారంభిస్తారు. మిష‌న్ భ‌గీర‌థ ప‌థ‌కంలో భాగంగా రూ. 23.91 కోట్ల వ్య‌యంతో నిర్మ‌ల్ ప‌ట్ట‌ణంలో ఇంటింటికి న‌ల్లా నీటి స‌ర‌ఫ‌రాను ప్రారంభించనున్నారు.


మంత్రి కేటీఆర్ చేయనున్న శంకుస్థాపనలు...
సోన్ మండలం పాత పోచంప‌హాడ్ గ్రామంలో రూ. 250 కోట్ల వ్య‌యంతో నిర్మించనున్న ఆయిల్ పామ్ ప్యాక‌ర్టీకి మంత్రి కేటీఆర్ శంకుస్థాప‌న చేయనున్నారు. 40 ఎక‌రాల విస్తీర్ణంలో నిర్మించనున్నారు. ఆపై నిర్మ‌ల్ పట్టణంలోని త‌హ‌సీల్ కార్యాలయ స్థ‌లంలో 2.30 ఎక‌రాల విస్తీర్ణంలో రూ.10.15 కోట్ల వ్యయంతో నిర్మించనున్న‌ స‌మీకృత మార్కెట్ కు శంకుస్థాప‌న చేస్తారు. రూ. 4 కోట్ల టియూఎఫ్ఐడీసీ నిధుల‌తో మౌలిక వ‌స‌తుల క‌ల్ప‌న కోసం చేప‌ట్టే ప‌లు అభివృద్ధి ప‌నుల‌కు శంకుస్థాప‌న‌, నిర్మ‌ల్ ప‌ట్ట‌ణంలో రూ. 2 కోట్ల‌ టియూఎఫ్ఐడీసీ నిధుల‌తో నిర్మించే దోబీ ఘాట్ ప‌నుల‌కు శంకుస్థాప‌న‌, మంచినీటి స‌ర‌ఫ‌రా వ్య‌వ‌స్థ‌ను మెరుగుప‌ర్చేందుకు అమృత్ ప‌థ‌కంలో భాగంగా రూ. 62.50 కోట్ల వ్య‌యంతో చేప‌ట్టే ప‌నుల‌కు శ్రీకారం చుట్టనున్నారు. రూ. 50 కోట్ల టియూఎఫ్ఐడీసీ నిధుల‌తో మౌలిక వ‌స‌తుల క‌ల్ప‌న కోసం చేప‌ట్టే ప‌లు అభివృద్ధి ప‌నుల‌కు శంకుస్థాప‌న‌, ప్ర‌త్యేక అభివృద్ధి నిధుల ద్వారా రూ. 25 కోట్ల వ్య‌యంతో మౌలిక వ‌స‌తుల క‌ల్ప‌నలో భాగంగా చేపట్టే ప‌లు అభివృద్ధి ప‌నుల‌కు శంకుస్థాప‌న అనంతరం నిర్మల్ పట్టణంలోని ఎన్టీఆర్ స్టేడియంలో బ‌హిరంగ సభలో మంత్రి కేటీఆర్ పాల్గొంటారు.


మంత్రి ఇంద్ర‌క‌ర‌ణ్ రెడ్డికి పొన్క‌ల్ మండ‌ల వాసులు కృత‌జ్ఞ‌త‌లు
డా. బీఆర్. అంబేడ్క‌ర్ స‌చివాల‌యంలో మంత్రి ఇంద్ర‌క‌ర‌ణ్ రెడ్డిని  నూత‌న మండ‌ల పొన్కల్ వాసులు క‌లిసారు. నిర్మల్ జిల్లాలో పొన్కల్ మండ‌ల సాధ‌న‌కు విశేష కృషి చేసినందుకు మంత్రి ఇంద్ర‌క‌ర‌ణ్ రెడ్డికి కృత‌జ్ఞ‌త‌లు తెలిపారు. పుష్ప‌గుచ్చం అంద‌జేసి శాలువ‌తో స‌త్క‌రించారు. మంత్రి ఇంద్ర‌క‌ర‌ణ్ రెడ్డి వ‌ల్లే ఇది సాధ్య‌మైంద‌ని జేఏసీ నాయకులు అన్నారు. 


మంత్రి ఇంద్ర‌క‌ర‌ణ్ రెడ్డిని క‌లిసిన వారిలో మాజీ డీసీసీబీ చైర్మ‌న్ రాంకిష‌న్ రెడ్డి, మామ‌డ రైతుబంధు అధ్య‌క్షులు కాల‌గిరి గంగారెడ్డి, మండ‌ల క‌న్వీన‌ర్ చంద్ర‌శేఖ‌ర్ గౌడ్, మార్కెట్ క‌మిటీ డైరెక్ట‌ర్ న‌ల్లా లింగారెడ్డి, పొన్క‌ల్ స‌ర్పంచ్ భూమేశ్వ‌ర్, మండ‌ల సాధ‌న‌ జేఏసీ నాయ‌కులు సుధాక‌ర్ రెడ్డి, ఇప్ప గంగారెడ్డి, ఎంపీటీసీ బొజ్జ రాధ -గంగాధ‌ర్, ఇత‌ర గ్రామాల స‌ర్పంచ్ లు, జేఏసీ నాయ‌కులు, ఆయ గ్రామాల‌ ప్ర‌జ‌లు ఉన్నారు.