Nirmal News Basara IIIT : బాసర ట్రిపుల్ ఐటీ విద్యార్థుల ఆందోళనలు ఐదో రోజుకు చేరాయి. ఆరేళ్లుగా కనీస సౌకర్యాలు లేకుండా ఇబ్బందులు పడుతున్నామని... ఎన్నిసార్లు అధికారుల దృష్టికి తీసుకొచ్చినా పట్టించుకోవట్లేదని విద్యార్థులు ఆందోళనకు దిగారు. విద్యార్థుల డిమాండ్లను విద్యా మంత్రి సిల్లీ డిమాండ్స్ అని తోసి పుచ్చారు. ఇప్పటికే ప్రతిపక్ష పార్టీలు, వివిధ విద్యార్థి సంఘాలు ప్రభుత్వంపై విమర్శలు చేస్తున్నాయి. అందరూ వచ్చి పరామర్శించి వెళ్తున్నారు. ట్రిపుల్ ఐటీ డైరక్టర్‌గా సతీష్ కుమార్‌ను నియమించినప్పటికీ ఆయన విద్యార్థులతో చర్చలు జరపలేకపోతున్నారు.
విద్యార్థులు పెట్టిన డిమాండ్లు ఇవి !
1) రెగ్యూలర్ విసిని నియమించటంతో పాటు ఖాళీ పోస్టులను భర్తీ చేయాలి.
2) విద్యార్థి నిష్పత్తి ప్రకారం ఫ్యాకల్టీ ఉండాలి
3) ఇన్ఫర్మేషన్ అండ్ కమ్యునికేషన్ టెక్నాలజీ ఆధారిత విద్య
4) పీయూసీ బ్లాక్ లు మరియు హాస్టళ్ల పునరుద్ధరణ.
5) లైబ్రరీలో మరిన్ని బుక్స్ అందుబాటులో ఉండాలి
6) విద్యార్థులకు అవసరమైన మంచాలు, పడకలు, యూనివఫామ్ లు అందుబాటులో ఉంచాలి
7) నిత్యావసరాలైన ఎలక్ట్రికల్, ప్లంబింగ్, ఇంటర్నెట్ అందుబాటులో ఉంచాలి
8) మెస్, ఇన్ఫాస్ట్రక్చర్ , మెయింటెనెన్స్ మెరుగుపర్చాలి.
9) క్యాంటిన్ లో గుత్తా్ధిపత్యం, టెండర్లను రద్దు చేయాలి
10) పీడీఎఫ్, పీఈటీ నియమించాలి. ఇతర సంస్థలకు సహకారం అందించాలి.
వీటిని సిల్లీ డిమాండ్స్ అంటున్న ప్రభుత్వం
ఇవన్నీ న్యాయమైన ఈ డిమాండ్లేనని ప్రభుత్వం ఎందుకు పట్టించకోవటం లేదన్నది విద్యార్థుల ప్రశ్న. త్రిపుల్ ఐటీలో దాదాపు 9 వేల మంది విద్యార్థులు చదువుతున్నారు. ఎన్నో ఆశలతో ఎంతో కష్టపడి చదివి కాంపిటేషన్ లో నెగ్గి ఇక్కడికి వస్తే విద్యార్థులకు తీవ్రమైన నష్టం జరుగుతోందని వారంటున్నారు. ఇంతపెద్ద యునివర్సిటీలో వీసీని నియమించకపోవటం, ఇప్పటి వరకూ ఇంఛార్జులే ఉండటంపై తీవ్ర విమర్శలకు తావిస్తోంది. ఆరేళ్లుగా విద్యార్థులు పడుతున్న ఇబ్బందులను ట్రిపుల్ ఐటీ అధికారులు బైటకు పొక్కనివ్వకుండా అడ్డుకున్నారు. విసుగు చెందిన విద్యార్థులు తమ గళం వినిపిస్తున్నారు. ప్రభుత్వం దిగివచ్చే వరకు తగ్గేదేలే అంటున్నారు విద్యార్థులు. విడతల వారిగా విద్యార్థులు తమ నిరసనలు కొనసాగిస్తున్నారు. సీఎం కేసీఆర్ లేదా మంత్రి కేటీఆర్ వచ్చి తమ సమస్యలను పరిష్కరించే వరకు తమ ఆందోళనలు కొనసాగిస్తామని చెబుతున్నారు.
నిర్బంధం మధ్య ట్రిపుల్ ఐటీ క్యాంపస్
ఎండనకా వాననకా ఐదు రోజులుగా విద్యార్థులు నిరసనలు కొనసాగిస్తుండటంతో కొంత మంది విద్యార్థులు అనారోగ్యనికి గురవుతున్నారు. ప్రతి రోజు దాదాపు 12 గంటల పాటు విద్యార్థులు నిరసనలో పాల్గొంటున్నారు. విద్యార్థులకు కనీసం తాగు నీటి సౌకర్యం కూడా ఉండటంలేదని ఆవేదన చెందుతున్నారు. ఓ వైపు బాసర ట్రిపుల్ ఐటీ పోలీసుల పాహారాలో ఉంది. తమ పిల్లలు ఎలా ఉన్నారో వారి పరిస్థితి ఎంటన్నదానిపై విద్యార్థుల తల్లిదండ్రులు ఆవేదన చెందుతున్నారు. కనీసం విద్యార్థుల తల్లిదండ్రులను సైతం ట్రిపుల్ ఐటీ లోనికి పంపకుండా పోలీసులు అడ్డుకుంటున్నారు. బాసర ట్రిపుల్ ఐటీ పరిసరాలను పోలీసులు అష్టదిగ్భంధనం చేశారు. విద్యార్థులను మీడియాతో మాట్లాడకుండా పోలీసులు అడ్డుకుంటున్నారు. ఎవరైనా మీడియాతో మాట్లాడితో వారిని పోలీసులు భయబ్రాంతులకు గురిచేస్తున్నారు.
సమస్యలు పరిష్కరించే వరకూ తగ్గేది లేదంటున్న విద్యార్థులు
ఇటు తమ సమస్యలు పరిష్కరించే వరకు తమ పోరాటం సాగిస్తామంటూ విద్యార్థులు దీక్ష చేపట్టారు. మరో వైపు ప్రభుత్వం విద్యార్థుల సమస్యలపై స్పందించకపోవటం దారుణమని అంటున్నాయ్ విపక్షాలు. తెలంగాణలో ఉన్న ఏకైక ట్రిపుల్ ఐటీని పట్టించుకోకుంటే మిగతా వాటి పరిస్థితి ఎంటన్నదానిపై సర్వత్రా విమర్శలు వెల్లువెత్తుతున్నాయ్. విద్యార్థులు ఏ ఆఘాయిత్యానికైనా పాల్పడితే అందుకు బాధ్యులు ఎవరు. విద్యార్థుల సహనం కోల్పోతే పరిస్థితి ఎంటీ అని వారి తల్లిదండ్రులు ఆందోళన చెందుతున్నారు.