Revanth Reddy Nomination in Kamareddy:  తెలంగాణ ఎన్నికల్లో గెలవడమే లక్ష్యంగా కామారెడ్డి వేదికగా కాంగ్రెస్ పార్టీ కీలకమైన వ్యూహాలను అమలు చేస్తోంది. కామారెడ్డిలో రేవంత్‌ రెడ్డి నేడు నామినేషన్ వేయగా, ఈ కార్యక్రమాన్ని కాంగ్రెస్ పార్టీ పెద్ద ఎత్తున నిర్వహించింది. ఈ సభకు కర్ణాటక ముఖ్యమంత్రి సిద్ధరామయ్య కూడా హాజరయ్యారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన బహిరంగ సభలో కర్ణాటక సీఎం సిద్దరామయ్య కాంగ్రెస్‌ బీసీ డిక్లరేషన్‌ ప్రకటించారు. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన 100 రోజుల్లోనే తమ ఆరు గ్యారంటీలను తక్షణం అమలు చేస్తామని సిద్ధరామయ్య హామీ ఇచ్చారు. ఇప్పటికే కర్ణాటకలో 5 గ్యారంటీలు అమలవుతున్నాయో లేదో చూడాలని కేసీఆర్ కు చెప్పారు. కేసీఆర్ కర్ణాటకకు వస్తే దగ్గరుండి చూపిస్తామని అన్నారు. కర్ణాటకలో 5 గ్యారంటీ స్కీంలను పక్కాగా అమలు చేస్తున్నామని అన్నారు. బీఆర్ఎస్ కు బీజేపీకి తేడా ఏమీ లేదని, బీఆర్ఎస్.. బీజేపీ బీ టీం అని ఆరోపించారు.


తెలంగాణకు మోదీ 100 సార్లు వచ్చినా బీజేపీ అభ్యర్థులకు డిపాజిట్లు కూడా రావని ఎద్దేవా చేశారు. కర్ణాటకలో ప్రధాని మోదీ 48 సభలు పెట్టారని, రోడ్ షోల్లో విపరీతంగా పాల్గొన్నారని గుర్తు చేశారు. అయినా కూడా ప్రధాని మోదీ ప్రచారం చేసిన ప్రతి చోట కాంగ్రెస్ పార్టీనే గెలిచిందని అన్నారు. ఇన్ని అబద్ధాలు చెప్పే ప్రధానిని తాను ఇంతవరకు చూడలేదని అన్నారు. అబద్ధాలు చెప్పే ప్రధానికి తెలంగాణ ప్రజలు బుద్ధి చెబుతారని అన్నారు. బీసీల వెనుకబాటుతనానికి ప్రధాని మోదీనే కారణమని అన్నారు. మోదీ ప్రభుత్వ హయాంలో దేశ ఆర్థిక పరిస్థితి బాగా దిగజారిందని సిద్ధరామయ్య విమర్శలు చేశారు. ముఖ్యమంత్రి కేసీఆర్ ను కామారెడ్డిలో రేవంత్ రెడ్డి చిత్తుగా ఓడిస్తారని సిద్దరామయ్య అన్నారు. కామారెడ్డితో పాటు, గజ్వేల్ లో కూడా సీఎం కేసీఆర్ ఓడిపోతారని అన్నారు. 


ఎన్నికల్లో బీఆర్ఎస్, బీజేపీని తిరస్కరించి కాంగ్రెస్ ను ఆశీర్వదించాలని అన్నారు. రేవంత్ రెడ్డి కామారెడ్డితో పోటు కొడంగల్ కూడా రెండు చోట్ల గెలుస్తారని అన్నారు. బీసీల 34 రిజర్వేషన్లు 25 శాతానికి తగ్గించిన ఘనత కేసీఆర్ కే దక్కుతుందని అన్నారు. ఎన్నికల్లో కేసీఆర్ అవినీతి డబ్బును ఖర్చు చేస్తున్నారని సిద్దరామయ్య ఆరోపించారు. పదేళ్ల కేసీఆర్ అవినీతి పాలనకు చరమగీతం పాడాలని పిలుపు ఇచ్చారు. అవినీతి సొమ్ముతో ఓట్లను కొనేందుకు కేసీఆర్ ప్రయత్నిస్తున్నారని ఆరోపించారు. తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం రావడం ఖాయమని విశ్వాసం వ్యక్తం చేశారు.