కాంగ్రెస్ వర్కింగ్ ప్రెసిడెంట్ బొమ్మ మహేష్ కుమార్ గౌడ్ నిజామాబాద్ డీసీసీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ప్రభుత్వ తీరును ఎండగట్టారు. ఎన్నికలు సమీపిస్తున్నాయంటే ఆచరణ సాధ్యం కాని వాగ్ధానాలు ఇవ్వటం సీఎం కేసీఆర్ కు ఆనవాయితీగా మారిందన్నారు. ‘‘మళ్ళీ ప్రజలను మభ్యపెట్టే ప్రయత్నాలు ప్రారంభించారు. నిజామాబాద్ జిల్లాకు రూ.658 కోట్లు ఇచ్చారంటూ జిల్లా మంత్రి కాకి లెక్కలు చెబుతున్నారు. ఎనిమిదిన్నర ఏళ్లలో రాష్ట్రాన్ని అప్పుల పాలు చేశారు కేసీఆర్’’ అని మహేష్ కుమార్ గౌడ్ అన్నారు. నిజామాబాద్ జిల్లాలో చెప్పుకోదగ్గ అభివృద్ధి ఏం చేశారో చెప్పాలని డిమాండ్ చేశారు. జిల్లాలో జరిగిన అభివృద్ధి అంతా కాంగ్రెస్ హాయాంలోనే జరిగిందన్నారు. నిజామాబాద్‌లో ఆయన విలేకరుల సమావేశం నిర్వహించారు.


‘‘మాజీ మంత్రి సుదర్శన్ రెడ్డి హయాంలోనే మెడికల్ కాలేజి తీసుకొచ్చాం. కనీసం నిధులు కూడా ఇవ్వలేదు ఈ ప్రభుత్వం. నిజామాబాద్ జిల్లాలో విమానాశ్రయానికి కాంగ్రెస్ హాయాంలోనే భూమి కేటాయించాం. ఇప్పటి వరకు ఎయిర్ పోర్టు జాడ లేదు. ఎమ్మెల్సీ కవిత మహిళా నేతగా ఉన్నా ఒక్క మహిళా కాలేజీ తీసుకురాలేదు. రూ.658 కోట్లు దేనికి ఖర్చు పెట్టారో శ్వేత పత్రం విడుదల చేయాల’’ని డిమాండ్ చేశారు మహేష్ కుమార్ గౌడ్. పసుపు బోర్డు పేరుతో బీజేపీ ఎంపీ అర్వింద్ గెలిచి పలాయనం చిత్తగించారని విమర్శించారు.


ఈ ఎనిమిదిన్నర ఏళ్లలో నిజామాబాద్ జిల్లాకు తెచ్చిన పరిశ్రమ ఏంటి? ఒక్క కాలేజి అయినా తెచ్చారా? క్రీడల కోసం అధికార పార్టీ నేతలు ఏం చేశారని ప్రశ్నించారు. ఎస్కార్టులు, సైరన్ లతో తిరగటం తప్ప జిల్లాకు చేసింది ఏమి లేదు అని అన్నారు. ఎన్నికలు వస్తున్నాయని జిల్లా టీఆర్ఎస్ నేతలు సీఎం కేసీఆర్ తో సమీక్ష పెట్టి హడావుడి చేస్తున్నారని అన్నారు.


జిల్లాలో అభివృద్ధి కాంగ్రెస్ హాయాంలోనే జరిగింది. వ్యవసాయ ఆధారిత జిల్లాలో రైతులు పండించిన ధాన్యానికి కనీస మద్దతు ధర ఇవ్వటం లేదు. డబుల్ బెడ్రూంల పేరుతో పేదలను మోసం చేస్తున్నారు. మైనార్టీలకు ఏం న్యాయం చేశారని మహేష్ కుమార్ అన్నారు. ఎన్ని ఉద్యోగాలు నిరుద్యోగులకు ఇచ్చారో చెప్పాలని డిమాండ్ చేశారు. రోడ్లు వేసి, చెట్లు పెట్టి అభివృద్ధి జరిగింది అని చెప్పుకుంటున్నారు. మీరు ఏం చేశారన్నది ప్రజలు గమనిస్తున్నారని అన్నారు మహేష్ కుమార్ గౌడ్. ధనిక రాష్ట్రం తెలంగాణను ఎనిమిదిన్నర ఏళ్లలో ఐదున్నర లక్షల కోట్ల అప్పు చేశారు. 


ఎన్నికలు వస్తున్నాయని అభివృద్ధి చేశారంటూ తప్పుడు లెక్కలు చెబుతున్నారు. ఎనిమిదిన్నర ఏళ్ళల్లో నిజామాబాద్ జిల్లాకు టీఆర్ఎస్ పార్టీ చేసిందేమి లేదని అన్నారు. రాష్ట్రంలో 50 మందికి పైగా ఎమ్మెల్యేలు భూ కబ్జాదారులు ఉన్నారు. దేవాలయ భూములు, ఇతర భూములను కబ్జా చేస్తున్నారు. రాష్ట్రంలో నాలుగున్నర లక్షల ఎకరాల భూమి అన్యాక్రాంతం అవుతోంది.
ఎనిమిదిన్నర ఏళ్ళల్లో అత్యంత ధనిక సీఎంగా కేసీఆర్ ఉన్నారు.


ఉద్యోగాల కోసం పోరాడి తెచ్చుకున్న తెలంగాణలో కేవలం కేసీఆర్ కుటుంబం బాగుపడింది. 100 రోజుల్లో తెరిపిస్తానన్న షుగర్ ఫ్యాక్టరీ ఎటుపోయిందని అన్నారు మహేష్ కుమార్ గౌడ్. టీఆర్ఎస్ ప్రభుత్వం వచ్చాక సామాన్య జనం చితికిపోతోంది. పోడు భూములు ఇస్తామని చెప్పి ఇవ్వలేదు. అందుకే అధికారులపై దాడులు జరుగుతున్నాయి. ధరణి స్కీం అట్టర్ ఫ్లాఫ్ అయ్యింది. టీఆర్ఎస్ వచ్చాక మంత్రులు, ఎమ్మెల్యేలు బాగుపడ్డారు, సామాన్యులు చితికిపోతున్నారు అని అన్నారు మహేష్ కుమార్ గౌడ్.