నిజామాబాద్ నగర వాసుల కల నెరవేరబోతోంది. నగరంలో కొత్తబస్టాండ్ ఏర్పాటుకు సీఎం కేసీఆర్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. 
ఎన్నో రోజులుగా పెండింగ్‌లో ఉన్న ఈ ఫైల్‌పై సీఎం కెసిఆర్ సంతకం చేసినట్టు తెలిసింది. ప్రస్తుతం ఉన్న బస్టాండ్ చాలా చిన్నది. రోజు రోజుకి పెరుగుతున్న నగర జనాభాతో ప్రయాణికుల సంఖ్య కూడా భారీగా పెరిగింది. దీంతో బస్సుల సంఖ్యను కూడా పెంచారు. బస్టాండ్ చిన్నది కావటంతో రద్దీగా మారింది. 


నిజామాబాద్ నుంచి ముంబయ్, హైదరాబాద్, నాగ్ పూర్ కు ఎక్కువగా ప్రయాణాలు జరుగుతాయ్. ప్రస్తుతం ఉన్న బస్టాండ్ కంజెస్టడ్‌గా ఉండటంతో జిల్లాకు సంబంధించిన నేతలు ఎప్పట్నుంచో బస్టాండ్ మార్పు కోసం ప్రతిపాదనలు పెట్టారు. అయితే ఆర్టీసీ ఛైర్మన్ బాజిరెడ్డి గోవర్దన్ జిల్లాకే చెందిన వారు కావటం, మంత్రి ప్రశాంత్ రెడ్డి, ఎమ్మెల్సీ కవిత చొరవతో సీఎం కేసీఆర్ కొత్త బస్టాండ్ కు ఆమోదం తలిపినట్లు సమాచారం. 


ఇప్పుడున్న పాత బస్టాండ్ మూడున్నర ఎకరాల్లో ఉంది. తాత్కాలిక మరమ్మతులతో నడుస్తోంది. పెరిగిన రద్దీకి అనుగుణంగా స్థలం ఏమాత్రం సరిపోవడం లేదు. ప్రభుత్వ ఆస్పత్రి బస్టాండ్ పక్కనే ఉంది. ఆస్పత్రికి కూడా స్థలం సరిపోవటం లేదు. దీంతో బస్టాండ్ మార్పు తప్పనిసరైంది. 


కొత్తగా నిర్మించే బస్టాండ్ ...  రైల్వే స్టేషన్ ను ఆనుకొని ఉన్న ఐదున్నర ఎకరాల్లో నిర్మించాలని జిల్లా నేతలు ప్రతిపాదించారు. రైల్వే స్టేషన్‌కు అనుకుని ఉండటంతో ప్రయాణికులకు కూడా సలువుగా ఉంటుందని జిల్లా నేతలు భావిస్తున్నారు. కొత్త బస్టాండ్ ప్రతిపాదన చాలా కాలంగా పెండింగ్‌లో ఉంది. బాజిరెడ్డి ఆర్టీసీ ఛైర్మన్ అయిన తర్వాత ఈ అంశాన్ని పలు మార్లు సీఎం దృష్టికి తీసుకెళ్లారు. పాత బస్టాండ్ స్థలం ఇచ్చేస్తామని రైల్వే స్టేషన్ పక్కనే ఉన్న ఐదున్నర ఎకరాలు ఇవ్వాలని కోరారు. 


ప్రస్తుతం ఈ స్థలంలో ఆర్ అండ్ బీ ఎస్సీ ఆఫీస్, ఈఈ కార్యాలయం, ఇరిగేషన్ ఆఫీస్, పాత ప్రెస్ క్లబ్, ఆర్ అండ్ బీ ఎస్సీ క్యాంపు ఆఫీస్‌లు ఉన్నాయ్. వీటిని తొలగించి కొత్త బస్టాండ్‌ను దాదాపు 55 కోట్లతో నిర్మించాలని భావిస్తున్నారు. ఈ మేరకు అంచనాలు రూపొందిస్తున్నారు. ఏడాదిలోగా ఇది పూర్తి చేయాలని సీఎం ఆదేశించినట్టు సమాచారం. సీఎం కేసీఆర్ కొత్త బస్టాండ్ ఏర్పాటుకు గ్రీన్ సిగ్నల్ ఇవ్వటంతో ఇటు నగరవాసులు సైతం హర్షం వ్యక్తం చేస్తున్నారు. 


మొన్నటి రివ్యూలో సీఎం ఏమన్నారంటే


ప్రగతి పథంలో దూసుకుపోతున్న నిజామాబాద్ నగరం మరింత అభివృద్ధి చెందాలని సీఎం కేసీఆర్ స్పష్టం చేశారు. రెండున్నర నెలల్లో ప్రణాళికాబద్ధంగా పనులను పూర్తిచేయాలనీ, తాను పర్యటించి పనులను పరిశీలిస్తానని తెలిపారు. పంచాయతీరాజ్, రోడ్లు భవనాలు, మున్సిపల్ శాఖ, తదితర అన్ని శాఖలు సమన్వయంతో నిజామాబాద్ అభివృద్ధి పనులను పూర్తి చేసేలా పనుల్లో నిమగ్నం కావాలన్నారు. ఈ మేరకు స్థానిక ఎమ్మెల్యే గణేశ్ బిగాలను సీఎం ఆదేశించారు. నిజామాబాద్ అభివృద్ధికి నిధుల కొరత లేదని సీఎం స్పష్టం చేశారు. ఇప్పటికే విడుదలైన నిధులతో పాటు  నిజామాబాద్ నగరాభివృద్ధికి అవసరమైన మరిన్ని నిధులను విడుదల చేయాలని ఫైనాన్స్ సెక్రటరీకి సమావేశం నుంచే సీఎం కేసీఆర్ ఫోన్ చేసి ఆదేశించారు.