లంబాడాలను ఎస్టీ జాబితా నుంచి తొలగించాలంటూ బీజేపీ ఎంపీ సోయం బాపురావు చేసిన కామెంట్స కలకలం రేపుతున్నాయి. దీనిపై లంబాడాలు భగ్గుమంటున్నారు. ఆయన వ్యతిరేకంగా ధర్నాలు, రాస్తారోకోలు చేస్తున్నారు. 


వస్తున్న వ్యతిరేకతను గమనించిన తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు కిషన్‌ రెడ్డి దీనిపైల క్లారిటీ ఇచ్చారు. లంబాడాలను ఎస్టీ జాబితా నుంచి తొలగించే ఆలోచన లేదని స్పష్టం చేశారు. ఆదిలాబాద్‌ ఎంపీ బాపురావు చేసిన కామెంట్స్ ఆయన వ్యక్తిగతమని అన్నారు. పార్టీకి సంబంధం లేదని చెప్పారు. 


సోయం బాపురావు చేసిన వ్యాఖ్యలపై సొంత పార్టీ నేతల నుంచే తీవ్ర వ్యతిరేకత వస్తోంది. బీజేపీ నాయకుడు రవీంద్ర నాయక్ సహా లంబాడీ విద్యార్థులు ఆయనపై ఫైర్ అవుతున్నారు. సోయం బాపురావును బీజేపీ నుంచి సస్పెండ్ చేయాలంటూ డిమాండ్ చేస్తున్నారు. దిష్టి బొమ్మలు దగ్ధం చేశారు. 


ఇంతకీ బాపురావు ఏమన్నరంటే?
గత వారం పార్లమెంట్‌లో హోంమంత్రి అమిత్‌షాను కలిసి బాపురావు ఎస్టీ జాబితా నుంచి లంబాడాలను తొలగించాలని కోరారు. దీనిపై నాలుగేళ్ల క్రితం సుప్రీంకోర్టులో పిటిషన్ వేశామన్నారు. ఆ కేసులో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వానికి సుప్రీంకోర్టు నోటీసులు ఇచ్చిందని అమిత్‌షాకు గుర్తు చేశారు. 


ఆ కేసులో కేంద్రం తరపున రివ్యూ పిటిషన్ వేయాలని కోరినట్టు బాపురావు పేర్కొన్నారు. వచ్చే 11 లోపు సుప్రీం కోర్టుకు వివరణ ఇవ్వాల్సి ఉందని ఆలోపు నిర్ణయం తీసుకోవాలని విజ్ఞప్తి చేశామన్నారు. కేంద్ర న్యాయశాఖ, గిరిజన శాఖ మంత్రులను కూడా కలిసి తమకు అనుకూలంగా నిర్ణయం తీసుకోవాలని వేడుకున్నట్టు చెప్పారు. 


లంబాడాలను ఎస్టీ జాబితా నుంచి తొలగించే వరకు తమ పోరాటం కొనసాగుతుందని ప్రకటించారు బాపురావు. ఇదే ఇప్పుడు తెలంగాణలో తీవ్ర చర్చకు దారి తీస్తుంది. బాపురావుతోపాటు బీజేపీపై కూడా లంబాడా యువత, సంఘాలు ఆగ్రహంతో ఉన్నాయి. దీన్ని దృష్టి పెట్టుకొనే కిషన్ రెడ్డి స్పందించాల్సి వచ్చింది. బాపురావు చేసిన కామెంట్స్ ఆయన వ్యక్తిగతమని బీజేపీ, కేంద్రం ఇంకా ఎలాంటి నిర్ణయం తీసుకోలేదని చెప్పుకొచ్చారు.