హైదరాబాద్‌లో జరిగే నేషనల్‌ ఎగ్జిక్యూటివ్ సభలకు వచ్చిన బీజేపీ లీడర్లు చాలా మంది తెలంగాణలోని జిల్లాల్లో తిరుగుతున్నారు. అక్కడ పార్టీ నేతలు కార్యకర్తలను ఉత్సాహపరిచేందుకు ప్రయత్నాలు చేస్తున్నారు. అందులో భాగంగా నిజామాబాద్ జిల్లాలో తమిళనాడు బీజేపీ చీఫ్ అన్నామలై పర్యటించారు. తెలంగాణలోని 119 నియోజకవర్గాల్లో కూడా బీజేపీ లీడర్లు కార్యకర్తలను కలిసే ప్రయత్నం చేస్తున్నారు. 


దేశంలో అత్యంత అవినీతి ప్రభుత్వం తెలంగాణలోని కేసీఆర్ ప్రభుత్వమని ఆరోపించారు అన్నామలై. తెలంగాణ ఉద్యమ ఆకాంక్షలను కేసీఆర్ ప్రభుత్వం నిర్వీర్యం చేసిందన్నారు. ఉద్యమ సమయంలో తెలంగాణ ప్రజలకు నీళ్లు, నిధులు, నియామకాలు అని చెప్పి ఓట్లేయించుకొని మోసం చేశారని విమర్శించారు. ప్రస్తుతం వాటి ఊసే లేదన్నారాయన.
సిఎం కేసీఆర్ ప్రజాస్వామ్యాన్ని ఖూని చేస్తున్నారని అన్నామలై ఆరోపించారు.


తెలంగాణాలో కుటుంబ పాలన నడుస్తోందన్నారు అన్నామలై. ఏ పనులు కావాలన్నా తండ్రి, కొడుకు, కూతరు చెబితేనే
అయ్యే పరిస్థితి దాపురించిందన్నారు. కేసీఆర్ తెలంగాణ రాష్ట్రాన్ని తన ఏటియంగా మార్చేసుకున్నారని ఆరోపించారు. రాష్ట్రాన్ని కుటుంబం దోచుకుంటోందన్నారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీని కలిసే దమ్ము, దైర్యం కేసీఆర్‌కు లేదన్నారాయన. తెలంగాణకి డబుల్ ఇంజన్ సర్కార్ అవసరం వచ్చిందన్నారు. రానున్న ఎన్నికల్లో తెలంగాణలో బీజేపీ అధికారంలోకి రావటం ఖయమన్నారు. తెలంగాణ ప్రజల ఆకాంక్ష ఏ మాత్రం తీరలేదన్నారు. మోదీ పాలన ప్రపంచానికే ఆదర్శం అన్నారు అన్నామలై. తెలంగాణ ఉద్యమం అందరికి స్ఫూర్తినిచ్చింది. సీఎం కేసీఆర్ ఫాంహౌస్ వదిలి బయటికి రాలేకపోవటం సిగ్గు చేటన్నారు అన్నామలై. 


తెలంగాణలో బీజేపీ బలంగా ఉందన్నారు అన్నామలై. కుటుంబ పాలన నుంచి తెలంగాణాను విముక్తి చేయటానికి బీజేపీ నేతలు పర్యటిస్తున్నారని చెప్పారు. మోదీ సభను విజయవంతం చేయాలని తెలంగాణ ప్రజలను కోరారు. తాను ఒకరైతు బిడ్డను రైతు కుటుంబం నుంచి వచ్చానని... వ్యవసాయం అంటే తనకు ఎంతో ఇష్టమన్నారు అన్నామలై. మోదీ స్ఫూర్తితో తమిళనాడు ప్రజలకు సేవ చేయాలన్న ఉద్దేశంతో ఐపీఎస్ ఉద్యోగానికి వాలంటరీ రిటైర్‌మెంట్ తీసుకుని రాజకీయాల్లోకి వచ్చానని చెప్పారు అన్నామలై.


తెలంగాణ ప్రజలకు కేసీఆర్ చేస్తున్న బాగోతం అంతా తెలిసిపోయిందన్నారు అన్నామలై. వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో తెలంగాణలో బీజేపీ జెండా ఎగురవేయటం ఖాయమన్నారు. తెలంగాణ రాష్ట్ర ఆకాంక్షకు బీజేపీ కూడా సపోర్ట్ చేసిందని గుర్తు చేశారు.  తెలంగాణ మిగులు బడ్జెట్ ఉన్న రాష్ట్రం అలాంటి ఇవాళ అప్పుల పాలవుతోందన్నారు. ఈసారి తెలంగాణ ప్రజలు వచ్చే ఎన్నికల్లో తప్పకుండా బీజేపీకి ఓటేసి గెలిపించాలన్నారు అన్నామలై. ఇందూరు జిల్లా కార్యకర్తలు చాలా కమిట్‌మెంట్‌తో పని చేస్తారని కొనియాడారు. నిజామాబాద్ నగరంలో బీజేపీకి మంచి పట్టుందని అభిప్రాయపడ్డారు. అందుకే ఇక్కడ రెండుసార్లు బీజేపీ అభ్యర్థి ఎమ్మెల్యేగా గెలిచారని అన్నామలై అన్నారు. తెలంగాణలో ఇక వచ్చేది బీజేపీ ప్రభుత్వమే అన్నారు అన్నామలై.