Pocharam Srinivas Reddy: నిజామాబాద్ జిల్లా కేంద్రంలోని కలెక్టరేట్ గ్రౌండ్లో ఓ పత్రిక ఆధ్వర్యంలో జరిగిన "ఆటో షో" ముగింపు కార్యక్రమంలో తెలంగాణ రాష్ట్ర శాసన సభాపతి పోచారం శ్రీనివాస రెడ్డి ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఆయనతోపాటు జడ్పీ ఛైర్మన్ దాదన్నగారి విఠల్ రావు, నగర్ మేయర్ నీతూ కిరణ్, కామారెడ్డి జిల్లా రైతుబంధు అధ్యక్షుడు అంజిరెడ్డి, ప్రజాప్రతినిధులు, నాయకులు, కంపెనీల ప్రతినిధులు, వార్తా పత్రికల సిబ్బంది ఉన్నారు. ఈ క్రమంలోనే పోచారం పోచారం శ్రీనివాస రెడ్డి బుల్లెచ్ బైక్ ను నడిపి అందరిలో హుషారు కల్గించారు. అనంతరం వేదికపై మాట్లాడుతూ.. ఆటో షో అనేది మంచి కార్యక్రమం అని తెలిపారు.






యువకులే ఎక్కువ ప్రమాదానికి గురవుతున్నారు..!


తెలంగాణ ఉద్యమంలో వార్తలను సమర్ధవంతంగా అందించిన సంస్థ ఆ పత్రిక అని స్పీకర్ పోచారం వివరించారు. నిజామాబాద్ నగరంలోని వాహనదారుల కోసం కొత్త మోడల్స్ తో ఆటో షో ఏర్పాటు చేయడం అభినందనీయం అన్నారు. ఈమధ్య కాలంలో రోడ్డు ప్రమాదాలు ఎక్కువగా జరుగుతున్నాయని.. ముఖ్యంగా యువకులు ఎక్కువగా ప్రమాదాలకు గురవుతున్నారని గుర్తు చేశారు. వాహనాలను నడిపేటప్పుడు జాగ్రత్తగా చుట్టుపక్కల గమనించాలన్నారు. అంతే కాకుండా వాహనాలు కొనడమే కాదు వాటిని జాగ్రత్తగా నడపాలని సూచించారు. ట్రాఫిక్ నియమ, నిబంధనలను కచ్చితంగా పాటించాలని పేర్కొన్నారు. 



వ్యక్తిగతంగా నేనెవరినీ విమర్శించలేదు..!


1968 లో తాను మొదటి సారి టూ వీలర్ తీసుకుని 4 లక్షల కిలోమీటర్లు తిరిగానని సభాపతి పోచారం శ్రీనివాస్ రెడ్డి గుర్తు చేశారు. 1975 లో కారు తీసుకుని 1994 లో మొదటిసారి ఎమ్మెల్యే అయ్యే వరకు స్వంతంగా డ్రైవింగ్ చేసేవాడినని చెప్పుకొచ్చారు.  టూ వీలర్, ఫోర్ వీలర్ ఏదైనా జాగ్రత్తగా నడిపేవాడిని, అందుకే నా జీవితంలో ఎప్పుడూ ప్రమాదం జరగలేదని తెలిపారు. ప్రమాదాలపై ట్రాఫిక్ పోలీసులు వాహనదారులకు ప్రత్యేకంగా అవగాహన కల్పించాలన్నారు. నూతన సాంకేతిక పరిజ్ఞానంతో వాహనాలు వస్తున్నాయిని తెలిపారు. డ్రైవింగ్ కొంచెం తేలికైందని చెప్పారు. జీవితం అన్నింటికంటే విలువైనదని.. వాహనాలు నడిపే వారు తప్పని సరిగా సీటు బెల్టు ధరించాలని వివరించారు. కారు కోసం బ్రేకులు ముఖ్యమైనవని.. తన 40 ఏళ్ల రాజకీయ జీవితంలో రాజకీయంగా తప్ప వ్యక్తిగతంగా ఎవరినీ విమర్శించ లేదని చెప్పుకొచ్చారు. ప్రజా ప్రతినిధులు కావడంతో వ్యక్తిగత దూషణలు మంచిది కాదని సూచించారు. ప్రజలు ఇచ్చిన అవకాశాన్ని సద్వినియోగం చేసుకుని ప్రజా సేవలో పోటీ పడాలన్నారు. రాజకీయాల్లో గౌరవం ఉండాలని స్పీకర్ పోచారం శ్రీనివాస రెడ్డి వ్యాఖ్యానించారు.