తెలంగాణ శాసనసభ స్పీకర్ పోచారం శ్రీనివాస్ రెడ్డి తన మనసులో మాటను క్లిస్టల్‌ క్లియర్ చెప్పేశారు. బాన్సువాడ నుంచి వచ్చే ఎన్నికల్లో టీఆర్ఎస్ పార్టీ నుంచి తానే పోటీ చేస్తానంటూ క్లారిటీ ఇచ్చేశారు. సుదీర్ఘ రాజకీయ అనుభవనం ఉన్న పోచారం శ్రీనివాస్ రెడ్డి టీడీపీ హాయంలో మంత్రిగా పనిచేశారు. ఆ తర్వాత జరిగిన రాజకీయ పరిణామాలతో స్పీకర్ పోచారం టీఆర్ఎస్ పార్టీలో చేరారు.


పోచారం అనుభవాన్ని దృష్టిలో పెట్టుకున్న సీఎం కేసీఆర్ వ్యవసాయ శాఖ మంత్రి పదవిని ఇచ్చారు. గత ఎన్నికల తర్వాత రెండోసారి టీఆర్ఎస్ ప్రభుత్వం ఏర్పాటు కాగానే సీఎం కేసీఆర్ పోచారం సీనియారిటీని దృష్టిలో ఉంచుకుని తెలంగాణ శాసన సభాపతిగా నియమించారు. అయితే పోచారం వయసు దృష్ట్యా ... వచ్చే ఎన్నికల్లో బాన్సువాడ నుంచి ఆయన కొడుకులు భాస్కర్ రెడ్డి, సురేందర్ రెడ్డి ఇద్దరిలో ఒకరు ఎమ్మెల్యేగా పోటీ చేస్తారంటూ ముమ్మర ప్రచారం జరిగింది. 


పోచారం సురేందర్ రెడ్డి స్పీకర్‌ పెద్ద కొడుకు. తండ్రికి రైట్ హ్యాండ్ గా ఉంటూ ... ఇప్పటికే రాజకీయాల్లో చురుకైన పాత్ర పోషిస్తున్నారు. సింగిల్ విండో ఛైర్మన్ గా కూడా చేశారు సురేందర్‌ రెడ్డి. బాన్సువాడ నియోజకవర్గంలో తండ్రికి రాజకీయంగా సురేందర్ రెడ్డి చేదోడుగా ఉంటున్నారు.


మరోవైపు చిన్న కొడుకు భాస్కర్ రెడ్డి కూడా పాలిటిక్స్‌లో యాక్టివ్‌గా ఉంటున్నారు. ఇప్పటికే భాస్కర్ రెడ్డి నిజామాబాద్ జిల్లా కో ఆపరేటివ్ బ్యాంక్ ఛైర్మన్ గా వ్యవహరిస్తున్నారు. బాస్కర్ రెడ్డికి కూడా బాన్సువాడ నియోజకవర్గంపై గట్టి పట్టుంది. అయితే గత కొంతకాలంగా అన్నదమ్ములు సురేందర్ రెడ్డి, భాస్కర్ రెడ్డి ఇద్దరూ వచ్చే ఎన్నికల్లో ఎమ్మెల్యేగా పోటి చేసేందుకు ఇంట్రస్ట్ గా ఉన్నట్లు వార్తలు వచ్చాయ్. ఇద్దరు సోదరులు ఎవరికి వారే క్యాడర్ ను మెయింటెన్ చేస్తున్నారన్న ప్రచారం జోరుగా నడిచింది. 


తండ్రి రాజకీయ వారసున్ని తానే అంటూ సురేందర్ రెడ్డి ఎమ్మెల్యేగా పోటీ చేసేందుకు ఇంట్రస్ట్ గా ఉన్నట్లు ప్రచారం జరిగింది. అదే స్థాయిలో భాస్కర్ రెడ్డి కూడా తానే బరిలో ఉంటానని క్యాడర్ కు సంకేతాలు కూడా ఇచ్చారన్న వార్తలు షికారు చేశాయ్. ఒక దశలో వీరిద్దరూ తానంటే తానే బరిలో ఉంటానంటూ వాగ్వాదం కూడా నడిచిందన్న వార్తలు వినిపించాయ్. అది ఎంతవరకూ సరైందో కానీ.... వీరిద్దరి వాదనలకు తెరదించారు స్పీకర్ పోచారం శ్రీనివాస్ రెడ్డి. ఇటీవలే బాహటంగానే కొడుకులు ఎమ్మెల్యేగా నిలబడరని క్లారిటీ ఇచ్చేశారు. సీఎం కేసీఆర్ ఆదేశాల మేరకే తానే వచ్చే ఎన్నికల్లో బాన్సువాడ నుంచి టీఆర్ఎస్ అభ్యర్థిగా బరిలో ఉంటానని తెల్చేశారు. దీంతో ఇద్దరు అన్నదమ్ములు ఇద్దరూ సైలెంట్ అయిపోయారు. 


బాన్సువాడలో ఇప్పటికే రాజకీయాలు రంజుగా మారాయ్. గత ఎన్నికల్లో కాంగ్రెస్ నుంచి పోటీ చేసిన మల్యాద్రి రెడ్డి పోచారం శ్రీనివాస్ రెడ్డికి గట్టి పోటీనే ఇచ్చారు. బాన్సువాడ నుంచి ఎదురులేని లీడర్ గా పేరున్న పోచారం గత ఎన్నికల్లో కొంత ఓటింగ్ శాతం తగ్గిందని భావించారు. అందుకే స్పీకర్ అయినా నియోజకవర్గానికే ఎక్కువ సమయంలో కేటాయిస్తూ... అభివృద్ధి పనులు చేయించటంలో బిజీగా మారారు. ఎక్కువ సమయంలో బాన్సువాడలోనే ఉంటూ నియోజకవర్గ ప్రజల సమస్యలు పరిష్కరిస్తున్నారు. అభివృద్ధి పనులను వేగం చేస్తున్నారు. తొలిసారిగా బాన్సువాడలో డబుల్ బెడ్ రూం ఇళ్లను కూడా పంపిణీ చేశారు స్పీకర్. ఎక్కువ సమయం నియోజకవర్గంలోనే ఉంటూ తన పట్టు నిలుపుకునే ప్రయత్నం చేస్తున్నారు సీనియర్ లీడర్ స్పీకర్ పోచారం.


అయితే ప్రతిపక్ష పార్టీలు సైతం బాన్సువాడ మీద ప్రత్యేక దృష్టి పెట్టాయ్. కాంగ్రెస్, బీజేపీ ఈసారి ఎలాగైనా బాన్సువాడలో పాగా వేయాలన్న స్కెచ్ లో ఉన్నారు. గత ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ గట్టి పోటీ ఇచ్చినందున పీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి కూడా ఈ నియోజకవర్గాన్ని కైవసం చేసుకోవాలన్న ఆలోచనలో ఉన్నట్లు సమాచారం.


గత ఎన్నికల్లో కాంగ్రెస్ నుంచి పోటీ చేసిన మల్యాద్రి రెడ్డి ఆ తర్వాత బీజేపీ పార్టీలోకి చేరారు. బాన్సువాడ నియోజకవర్గం బీజేపీ అభ్యర్థిగా మాల్యాద్రి రెడ్డికే ఎక్కువ అవకాశాలున్నాయ్. ఈ పరిస్థితిలో మల్యాద్రి నియోజకవర్గంలో చురుగ్గా పార్టీ కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. పోచారం శ్రీనివాస్ రెడ్డిని ధీటుగా ఎదుర్కోవాలంటే మల్యాద్రి రెడ్డే సరైన అభ్యర్థి అని ఇటు బీజేపీ సైతం భావిస్తోంది. ఇప్పటికే మాల్యాద్రి రెడ్డి బాన్సువాడ నియోజకవర్గంలో బీజేపీ బాడా నేతలను పిలిపిస్తూ... పార్టీ కార్యక్రమాలు కూడా చేస్తున్నారు. నియోజకవర్గ ప్రజలకు అందుబాటులో ఉంటూ బీజేపీని పటిష్టం చేస్తున్నారు. 


ఓ వైపు సర్వేల ఫలితాలు, ప్రజాస్పందన సీఎం కేసీఆర్ సూచనలు దృష్టిలో ఉంచుకుని స్పీకర్ పోచారం శ్రీనివాస్ రెడ్డి క్లారిటీకి వచ్చేశారు. వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో మరోసారి తానే నిలబడతానని చెప్పుకొచ్చారు. ఇద్దరు కొడుకుల్లో ఎవరిని బరిలో ఉంచినా.... పోటీ టఫ్ గా మారే అవకాశాలుంటాయని భావించిన పోచారం ... ఈ సారి కూడా పోటీలో తానే ఉంటానని ప్రకటించుకున్నారు. దీంతో బాన్సువాడ టీఆర్ఎస్ పొలిటికల్ సర్కిల్ లో నాయకులు కాస్త ఊపిరి పీల్చుకున్నారు. ఇక ఫ్రీగా పార్టీ కార్యక్రమాల్లో పాల్గొంటున్నాయ్ టీఅర్ఎస్ శ్రేణులు.