నిజామాబాద్ జిల్లాలో పురుగుల మందు తాగి సర్పంచ్ భర్త ఆత్మహత్య చేసుకున్నారు. వేల్పూర్ మండలంలోని పడగల్ వడ్డెర కాలనీలో జరిగిన ఈ సంఘటన స్థానికంగా తీవ్ర చర్చనీయాంశంగా మారింది. పడగల్ వడ్డెర కాలనీ సర్పంచ్ ముత్తెమ్మ భర్త మల్లేష్ పంచాయతీ అభివృద్ధి కోసం అప్పులు తెచ్చి ఇబ్బందుల్లో పడ్డారు. బిల్లులు రాక, తెచ్చిన అప్పులు కట్టలేక ఏం చేయాలో తెలియక గందరగోళ పరిస్థితుల్లో గురువారం పురుగుల మందు తాగి ఆత్మహత్యకు పాల్పడ్డారు. వైద్యం కోసం ఆర్మూర్ ప్రైవేటు ఆసుపత్రికి తరలించగా.. చికిత్స పొందుతూ మృతి చెందారు.   


బిల్లులు రాక అప్పుల పాలవుతున్న సర్పంచ్‌లు ! 
 
గ్రామ పంచాయతీలకు కేంద్రం ఇవ్వాల్సిన ఆర్థిక సంఘం నిధులు, రాష్ట్ర ప్రభుత్వం మంజూరు చేయాల్సిన స్టేట్ ఫైనాన్స్ కార్పొరేషన్ నిధులు ఆగిపోయాయినట్టు ప్రతిపక్షాలు ఆరోపిస్తున్నాయి. దీంతో పంచాయతీలకు నిధుల కొరత ఏర్పడింది అంటున్నారు. 2022-23 ఆర్థిక సంవత్సరం మొదలైన నుంచి పంచాయతీలకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు నిధులు మంజూరు చేయడం లేదని విమర్శిస్తున్నారు. అందుకే పంచాయతీల ద్వారా చేపట్టాల్సిన అభివృద్ధి పనులకు ఆటంకం ఏర్పడిందని అంటున్నారు. 15వ ఆర్థిక సంఘం ద్వారా కేంద్రం కేటాయించే నిధులతో సమానంగా తాము కూడా ప్రతి నెలా స్టేట్ ఫైనాన్స్ కార్పొరేషన్ ద్వారా నిధులు విడుదల చేస్తామని రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించింది. గతంలో కొన్ని నెలల పాటు ఈ విధానం అమలు చేశారు. తర్వాత పట్టించుకోవడం లేదన్నది ప్రతిపక్షాలు చేస్తున్న ఆరోపణ.. 


కేంద్రం నిధులకు జతగా విడుదల కాని రాష్ట్ర నిధులు ! 


ఆర్థిక సంఘం నిధులను కేంద్ర ఇస్తే వాటిని ట్రెజరీ ద్వారా గ్రామ పంచాయతీలకు బిల్లు రూపంలో రాష్ట్రం మంజూరు చేసేది. ఈ ప్రక్రియలో తీవ్ర జాప్యం జరుగుతుందని గ్రహించిన కేంద్రం నేరుగా పంచాయతీలకు నిధులు ఇవ్వడం మొదలు పెట్టింది. నిధులను నేరుగా విడుదల చేయడానికి పంచాయతీలతోపాటు, మండల పరిషత్, జిల్లా పరిషత్‌లకు ప్రత్యేక ఖాతాలను తెరిపించింది ఆర్థిక సంఘం. ఇప్పటికి తొలి త్రైమాసికం నిధులు విడుదల కావాల్సి ఉంది. గతంలో జిల్లాలోని పంచాయతీలకు ఆర్థిక సంఘం ద్వారా నెలకు రూ.10.30 కోట్లు, ఎస్ఎఫ్సీ ద్వారా మరో రూ.10.30 కోట్లు విడుదల అయ్యేవి. ఆర్ధిక సంఘం నిధులను ప్రభుత్వం 3 నెలలకు ఒకసారి 4 విడతల‌్లో విడుదల చేసే అవకాశం ఉంది. కేంద్రం విడుదల చేసే నిధులకు సమానంగా రాష్ట్రం కూడా నిధులు విడుదల చేస్తే చేసిన పనులకు బిల్లులు క్లియర్ అవుతాయి. కానీ రాష్ట్రం నిధులు డిపాజిట్‌ చేయడం లేదన్నది ప్రతిపక్షాల ఆరోపణ . కనీసం ఎస్ఎఫ్ సీ ద్వారా రాష్ట్ర ప్రభుత్వం తనవంతు వాటా నిధులను విడుదల చేసి ఉంటే పంచాయతీలకు కొంత ఊరట లభించేదని అంటున్నారు.  


అప్పులు తెస్తూ అభివృద్ధి పనులు - చివరికి తీవ్ర నిర్ణయాలు !
 
ఆర్మూర్ నియోజకవర్గంలోని కల్లెడ గ్రామ సర్పంచ్ భర్త సైతం ఎమ్మెల్యే జీవన్‌ రెడ్డిపై హత్యాయత్నం చేసి జైలు పాలయ్యారు. ఆయన కూడా 18 లక్షల రూపాయలు అప్పుతెచ్చి అభివృద్ధి కోసం ఖర్చు చేశారని స్థానికులు చెబుతున్నారు. బిల్లులు రాకపోవటంతో వడ్డీలు కట్టలేక జీవన్‌ రెడ్డితో కొట్లాటకు దిగారని అంటున్నారు. జిల్లాలో చాలా మంది సర్పంచ్‌లది అదే పరిస్థితి అని స్థానికంగా చర్చించుకుంటున్నారు. ఎన్నికల్లో గ్రామస్థులకు ఇచ్చిన హామీలను నెరవేర్చేందుకు అప్పులు చెల్లిస్తున్నారని... ఇలా అనేక మంది సర్పంచ్‌లు ఇబ్బందులు పడుతున్నారని తెలుస్తోంది.